her కేలియే..
పాప్ సింగర్‌గా ఉర్రూతలూగించే పాటలతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన రెగ్గి బెంజిమన్.. తన కళను ఓ ప్రయోజనానికి వేదికగా మలచుకున్నాడు. అవనిలో అతివలపై జరుగుతన్న దాడులను అడ్డుకునే లక్ష్యంతో.. ఆమె కోసం.. మిషన్ సేవ్ హర్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. బుధవారం హైదరాబాద్‌లో తన ఫౌండేషన్ విధివిధానాలను తెలియజేశాడు. తాను రాసిన ‘సేవ్ హర్’ పాటను పాడి వినిపించారు. ఈ సందర్భంగా బెంజిమన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
- వాంకె శ్రీనివాస్
మా పేరెంట్స్‌ది మెదక్ జిల్లాలోని నర్సాపూర్. నాన్న రాస్కో బెంజిమన్ పాస్టర్. అమ్మ రోజ్ బెంజిమన్ నర్స్. నేను పుట్టకముందే వాళ్లు కెనెడాకు వెళ్లారు. నేను కెనెడాలోనే పుట్టాను. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు అమెరికాకు షిఫ్ట్ అయ్యాం. స్కూలింగ్, కాలేజ్ డేస్ అంతా చికాగాలోనే సాగిపోయాయి. నాన్న క్రిస్టియన్ ప్రీచర్ కావడంతో చిన్నతనంలోనే మ్యూజిక్ అబ్బింది.
మ్యూజిక్ వాయిస్‌లో డిగ్రీ చేశాను. బిజినెస్ కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేశాను. తర్వాత మ్యూజిక్‌కే పూర్తి టైమ్ కేటాయించాను. నా ఫస్ట్ ఆల్బమ్ 2ఎక్స్ సెంట్రిక్స్‌కు ఇండియాలో మంచి ఆదరణ లభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. పాప్ కెరీర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. నా పాటలు 25 దేశాల్లో వినిపిస్తున్నాయి. ఇండో, అమెరికన్ పాప్ స్టార్‌గా పేరు రావడం ఆనందంగా ఉంది.
ఆ ఘటన కదిలించింది..
ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు, ఇండియాలో ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురువుతున్నారు. కెనెడాలో ప్రతి 17 మంది మహిళల్లో ఒకరు, యూకేలో ప్రతి ఐదుగురి ఆడవాళ్లలో ఒకరిపై అత్యాచారం జరుగుతోంది. ఇటీవల ఇండియాలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిపి.. ఆపై వారిని ఉరి తీయడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడాను. ఇక్కడ మహిళల అక్రమరవాణా కూడా ఆందోళనకర స్థాయిలో సాగుతోంది.
తల్లిలా చూడాల్సిన ఆడవారిపై జరుగుతున్న దాడులను ఆపడానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడి ‘మిషన్ సేవ్ హర్’ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టా. ‘సేవ్ హర్’ అనే పాట రాసి.. పద్నాలుగు మంది హాలీవుడ్ సెలబ్రిటీలతో పాడించాను. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది. ఈ పాట విని కొందరైనా.. మారితే చాలు. ఈ ఆల్బమ్‌కు వచ్చే నిధులను ‘సేవ్ హర్ ఫౌండేషన్’కు అందేలా చూస్తున్నాం.
స్పెషల్ ఫోకస్...
ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ హర్’ విస్తరించాలని భావిస్తున్నాం. భారత్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. ముంబై, పూణె, ఢిల్లీ, బెంగళూరులలో మా సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించాం. నాకు మంచి పేరెంట్స్‌తో పాటు ఎంతో మంది భారత్ అభిమానులను ఇచ్చిన ఈ పుణ్యభూమికి ఈ రకంగానైనా సేవ చేయాలనుకుంటున్నా. అందరి సహకారం అందుతుందని ఆశిస్తున్నా.