
ఐ & లెన్స్
ఐఫోన్‌తో ఏం చేయొచ్చు? ‘ఐట్యూన్స్ వినొచ్చు, ఇంటర్నెట్‌ను ఈజీగా బ్రౌజ్ చేయొచ్చు.. అప్పుడప్పుడూ ఫొటోస్ తీసుకోవచ్చు’ అనుకుంటాం. కానీ అప్పుడప్పుడూ కాదు.. అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు. ఎంతలా అంటే ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేంత! అది నిజం చేసి చూపించారు ఫొటోగ్రాఫర్ శివ చిలువేరు.తన ఐఫోన్ 4ఎస్‌తో తీసిన చిత్రాలతో మాదాపూర్‌లోని అలంకృత ఆర్ట్ గ్యాలరీలో ‘ద ఐఫొనోగ్రఫీ’ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఐఫోన్‌తో శివ చేసిన మ్యాజిక్ గురించి..
- కట్ట కవిత
సాధారణంగా బయటికి వెళ్లేటప్పుడు అన్నీ ఉన్నాయా అని బ్యాగ్ చెక్ చేసుకుంటాం. కానీ శివ మాత్రం తన ఐఫోన్ ఉందో లేదో అని చూసుకుంటారు. ఎందుకంటే... ఈజీగా క్యారీ చేసే ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లో హైరిజల్యూషన్ కెమెరానే కాదు, అమేజింగ్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండటం అందుకు కారణం. న్యూయార్క్‌లో ఫైన్‌ఆర్ట్స్ మాస్టర్స్ చేసిన ఈ హైదరాబాదీ... స్టీవ్ జాబ్స్ ఫొటోగ్రఫీ విజన్ తనకు స్ఫూర్తి అంటారు. న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాక వ్యాపారవేత్తగా, ఫొటోగ్రాఫర్‌గా రెండు ప్రొఫెషన్స్ కొనసాగించారు. కొంతకాలానికే పూర్తిస్థాయిలో ఫొటోగ్రఫీకే షిఫ్ట్ అయిపోయారు.
ఐఫోనోగ్రఫీ ఎప్పటి నుంచి...
‘యాపిల్ ప్రొడక్ట్స అంటే అభిమానం. మొదటి ఐఫోన్ రిలీజైనప్పుడు యూఎస్‌లోనే ఉన్నాను. 2013లో ఐఫోన్ తీసుకున్నా. అందులో కెమెరా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. రిజల్యూషన్ చెక్ చేసుకుని వెంటనే ఫొటోస్ తీయడం మొదలు పెట్టాను. ఆనలాగ్ కెమెరా ప్లేస్‌ను డిజిటల్ కెమెరా రీప్లేస్ చేసింది. ఇప్పుడు డిజిటల్ కెమెరాల స్థానాన్ని హైరిజల్యూషన్ కెమెరాస్ ఉన్న ఫోన్స్ ఆక్రమించుకుంటున్నాయి. ఇది మార్పుకు సంకేతం’ అంటారు శివ. 2013 డిసెంబర్ నుంచి ఈ ఎగ్జిబిషన్ కోసం పనిచేయడం ప్రారంభించారు. వీటికోసం హైదరాబాద్‌లోని అన్ని చారిత్రాత్మక కట్టడాలు, సిటీ ఔట్‌స్కట్స్, ఇతర నగరాల ను చుట్టేశారు. ఆయన ప్రస్తుత ప్రదర్శనలో 31 ఫొటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ నెల 25 వరకు ఈ ఫొటో షో కొనసాగుతుంది.
గతంలో ఎగ్జిబిషన్స్...
ఐఫోన్‌తో తీసిన ఫొటోస్‌తో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం ఇదే తొలిసారి. ప్రదర్శనలో ఉన్న చిత్రాలన్నీ రోజూ మనం చూసేవే. కానీ పట్టించుకోనివి. పరిశీలించనవి. రోజూవారీ జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాల్ని తన లెన్స్‌లో బంధించానంటారు శివ. ఆయన సూర్యోదయం, సూర్యాస్తమయాలు అస్సలు మిస్సవ్వరు. మార్కెట్స్, ఇతర రద్దీ ప్రదేశాలను ఫ్రేమ్ చేసుకుంటాడు. ఎన్నో కెమెరాలుండగా ఐఫోన్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే.. ‘కెమెరా ఫోన్లు క్యారీ చేయడం సులువు. ఫొటో ఎడిటింగ్‌కి సంబంధించి ఐఫోన్‌లో మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. ఫొటో తీయగానే బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ వంటి బేసిక్ టూల్స్‌ను ఉపయోగించి ఎడిట్ చేస్తాను’ అని చెబుతారు శివ.
బేసిక్స్ తెలియాలి...
చేతిలో కెమెరా ఉన్నంతనే ఎవరూ ఫొటోగ్రాఫర్ అయిపోరు. ఫొటోగ్రఫీ బేసిక్స్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి’ అంటారు శివ. భవిష్యత్‌లో మొబైల్ ఫొటోగ్రాఫర్స్ అందరినీ ఒక వేదికపైకి తేవాలనుకుంటున్న శివ.. ఐఫోన్‌లో చిత్రీకరించిన షార్ట్ ఫిలింస్‌తో షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.