
సుడిగాలి.. జడివాన
మిమిక్రీ అనగానే.. హీరోల గొంతులు, రాజకీయ నాయకుల ప్రసంగాల అనుకరణే గుర్తుకొస్తుంది. ప్రాకృతికమైన ధ్వనులని తమ గళంలో మేళవించే పట్టున్నవాళ్లు కొద్దిమందే. అలాంటివారిలో మేటి చిట్టూరి గోపీచంద్. పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో 45 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్న ఆయన ఇటీవలే అమెరికాలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పరిచయం..
..:: కోన సుధాకర్‌రెడ్డి
బయట వర్షం పడుతుంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకొని ఆ సవ్వడిని విని ఆనందించేవాళ్లు ఎంతోమంది. కానీ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే గాలుల చప్పుడును వినాలంటే? గాలి ధాటికి ఎక్కడికో కొట్టుకుపోతాం.. వినడమే సాధ్యం కాదు! అలాంటి అసాధ్యాన్ని తన స్వరంతో సుసాధ్యం చేశారాయన. ఇక సినీనటుల గొంతులని అవలీలగా అనుకరించేస్తారు. రాజకీయ నాయకుల స్వరాలకు వ్యంగ్యం జోడిస్తారు.
నదీ ప్రవాహ సవ్వడులు, పశుపక్ష్యాదుల అరుపులు.. ఒకటేమిటి సకల శబ్దాలను అనుకరించగల గోపీచంద్ ఉచితంగా ఎందరికో మిమిక్రీలో శిక్షణ ఇస్తున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌లో 30 రకాలు గోపీచంద్ సృష్టించినవే ఉన్నాయి. సినీ ఆర్టిస్టుల తొలినాళ్ల వాయిస్- ఇప్పటి వాయిస్, ప్రకృతి వైపరీత్యాల సవ్వడుల వంటివి ఆయన పేటెంట్!
జీవితాన్ని నేర్పిన సినారె...
సినారె పాల్గొన్న ఓ కార్యక్రమంలో మిమిక్రీ చేసిన గోపీచంద్.. ఆయన వద్ద మిమిక్రీలో సాహిత్యాన్ని ఎంతవరకు ఉపయోగించవచ్చో నేర్చుకొన్నారు. ఆయన ప్రభావంతోనే ‘అక్షరమంజీరాలు, సాగరమేఖల, స్వాప్నిక్, వె న్నెల, దివ్యనాగావళి’ వంటి కావ్యాలని రచించారు. ‘ప్రేమకు వేళాయెరా’ చిత్రంతో సహా పలు సినిమాల్లో నటించారు. ‘మిమిక్రీ కళకు నాడు ఎంత అదరణ ఉందో ఇప్పుడు అంతకు రెట్టింపైంది. చాలా మంది ఈ కళపై ఆధారపడి బతుకుతున్నారు. నేటి యువత కూడా ఆకర్షితులు అవుతున్నారు. అద్భుతంగా చేస్తున్నారు’ అని కితాబిస్తారాయన. తెనాలిలో స్కూల్ స్థాయిలో పిట్టల అరుపుల వంటి నేచురల్ సౌండ్స్ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టిన ఆయన.. కాలేజీకి వచ్చేసరికి ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోయారు. 15 ఏళ్ల వయసులోనే ప్రదర్శనలు ప్రారంభించిన గోపీచంద్ ఈ 45 ఏళ్లలో వేల ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బ్యాంకాక్, అమెరికా సహా 14 దేశాలు చుట్టివచ్చారు.