
అలజడి
https://www.youtube.com/watch?v=DY9RrScQOG4
కడలి కెరటాలు.. తీరం నుంచి అందంగానే కనిపిస్తాయి. అదే అలలపై సాగే మత్స్యకారుల బతుకు పయనం.. దినదిన గండమే. ధైర్యమనే నావను నమ్ముకుని సముద్రంపై వేటకు వెళ్లాల్సిందే. గాలానికి చేపలు చిక్కినా.. ఒడ్డుకు చేరే వరకూ టెన్షనే. వేటకు వెళ్లిన రోజు.. కడలి కల్లోలంగా మారితే.. వారి కుటుంబసభ్యులు ఒడ్డున పడ్డ చేపపిల్లల్లా అల్లాడిపోతుంటారు. సముద్రంలో తుపానుకు గల్లంతైన వారి గురించిన వార్తలు ఆ కుటుంబసభ్యుల్లో కలకలం రేపుతాయి.
అదృష్టవంతులు తిరిగి తీరం చేరుకుంటారు. తుపాను తాకిడికి కొన్ని పాకలు ఖాళీ అవుతాయి. పునరావాసానికి తావు ఎక్కడా కనిపించదు.. ఇదీ వారి జీవితం. మత్స్యకారులకు సూచనలు, గల్లంతైన వారి వివరాలని వార్తలు వినడం తప్ప.. వారి జీవితాల గురించి తెలిసింది తక్కువే. మత్స్యకారుల పాట్లు, వారి కుటుంబసభ్యుల జీవితాల్లో ఆటుపోట్ల గురించి ఈ చిట్టిసినిమాలో చూపించారు దర్శకుడు సత్య. సీరియస్‌గా కాకుండా.. డ్రామటిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు.
కథలోకి వస్తే.. సముద్రం ఒడ్డున ఒక ప్రేమజంట.. అందమైన భవిష్యత్తును ఊహిస్తుంటుంది. అయితే అమ్మాయి అమ్మ, అమ్మమ్మ మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోరు. అమ్మాయి తండ్రి, తాత.. మత్స్యకారులు కావడం వల్లే బతికి లేరని, అలాంటి పరిస్థితి తనకు రాకూడదని సముదాయిస్తారు. అయితే ఆ అమ్మాయి మాత్రం అతడినే పెళ్లి చేసుకుంటుంది.
పెళ్లయిన నాటి నుంచి.. అతను వేటకు వెళ్లిన ప్రతిసారి, సముద్రం ప్రతికూలించిన ప్రతి రాత్రి.. ఆమె భయపడుతూనే ఉంటుంది. అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ సముద్రమంత బాధను గుండెల్లో మోసుకుంటూ బతకడం ఆమెకు అల వాటవుతుంది. మత్స్యకారుల జీవన చిత్రాన్ని అందంగా ఆవిష్కరించారు రచయిత, దర్శకుడు సత్య. మోహన్‌చంద్ సినిమాటోగ్రఫీ బాగుంది.
- ఓ మధు