కోతకు గురవుతున్న భూములు
కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ప్రభావం
సరుగుడు, మడ అడవులు మాయం
సాక్షి, అమలాపురం/ అల్లవరం: కోస్తా తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా ఫెంగల్ తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర ఉంది.
కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐ.పోలవరం మండలం బైరుపాలెం వరకూ 90 కిలోమీటర్లు కాగా, తాళ్లరేవు మండలం గాడిమొగ నుంచి తుని మండలం వరకూ సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం ఉంది. పచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి.
ఇదే సమయంలో తీరం పొడవునా సముద్ర కోత కూడా అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో ఓడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరిపట్నంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కోత తీవ్రత రెట్టింపు అయ్యింది. ఓడలరేవులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి.
ఎనిమిదేళ్ల కిందట ఓడలరేవు బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకూ సముద్రం చొచ్చుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అంతర్వేది బీచ్‌లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకూ వస్తోంది. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసుపాలెం తూర్పులంక వంటి గ్రామాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి.
కాలుష్యాన్ని కలిపేస్తూ..
అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకూ నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంశధార, నాగావళి వంటి నదుల సంగమం బంగాళాఖాతంలోనే. దేశంలో చాలా వరకూ కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు దానిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి.
ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుపాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది.
దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు.
అలలు ఎగసిపడి..
కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు తరుక్కుపోతుంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలెండ్ ఉండడం, డీప్ వాటర్ పోర్టు కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోని “ఉప్పాడ’ గ్రామంపై పడుతోంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. హోప్ ఐలెండ్ వద్ద తీరం పెరుగుతుండగా, ఉప్పాడ వద్ద కోత పెరుగుతోంది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది.
భూములను కలిపేసుకుని..
ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకూ వందలాది ఎకరాల జిరాయితీ, డీపట్టా భూములు సముద్రంలో కలసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఇటీవల నెల రోజుల్లో రెండు పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నంబర్ గల జిరాయితీ, డీ పట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది.
దీంతో ఓడలరేవులో సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ, తదితరులకు చెందిన మరో ఆరు ఎకరాలు భూమి కోతకు గురైంది. –పాల వర్మ, ఓడలరేవు, అల్లవరం మండలం
ప్రమాదంలో ఓఎన్జీసీ టెర్మినల్
కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్‌లోకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందారు. సముద్ర అలల తాకిడికి ఈ టెరి్మనల్ ప్రధాన గోడ వరకూ భూమి కోతకు గురైంది. ఇప్పుడున్న టెరి్మనల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటరు దూరంలో ఉండేది.
నెమ్మది నెమ్మదిగా సముద్రం చొచ్చుకొస్తూ గోడ వరకు వచ్చింది. కోత నివారణకు జియోట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత ఆగడం లేదు. తాజాగా తుపాన్లతో అలల ఉధృతికి కోత తీవ్రత మరింత పెరిగింది. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి లేదు.
మానవ తప్పిదాలే కారణం
ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉషో్టగ్రతలు పెరిగి తుపాన్లకు దారి తీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment