కలల దారిలో..
రాస్తా ఫిలింస్.. బాపురమణల్లాంటి ఇద్దరు స్నేహితుల బ్రెయిన్‌చైల్డ్!
వేరువేరు ఊళ్లు, అంతకన్నా వేరైన వీరి నేపథ్యాలను
ఒక్కటి చేసింది గువాహటి ఐఐటీ! కలలకు రెక్కలు తొడిగి
ఎగిరే శక్తినిచ్చింది ఆ క్యాంపసే! ఆ జోడు పక్షుల పేర్లు.. సాయి, ప్రేమ్.
ఈ జంట డ్రీమ్.. సినిమా! దాన్ని నెరవేర్చుకోవడానికి
పుట్టిందే రాస్తా ఫిలింస్.. ఆ కథ, స్క్రీన్‌ప్లే ఇది..
..:: సరస్వతి రమ
సాయి ఫ్రమ్ కరీంనగర్, ప్రేమ్.. హైదరాబాదీ! వీళ్ల తల్లిదండ్రుల కలైన ఐఐటీ సీట్‌ను సాఫల్యం చేసి.. గువాహటి ఐఐటీ క్యాంపస్‌లో ఇద్దరూ ఒకేసారి అడుగుపెట్టారు. సాయిది కంప్యూటర్‌సైన్స్ బ్రాంచ్. ప్రేమ్ ఈసీఈ. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లో వీరి మధ్య పరిచయం చిగురించింది. ఇద్దరి కామన్ డ్రీమ్ అయిన మూవీ మేకింగ్ వీళ్ల స్నేహానికి కారణమైంది. అప్పటి నుంచి తమ లక్ష్యాన్ని సాధించుకునే పనిలోపడ్డారు. సినిమాలు చూడ్డం, డిస్కస్ చేయడం, ఐడియాలు షేర్ చేసుకోవడం.. ఇలా చదువు పూర్తి కాకముందే మూవీమేకింగ్‌కు కావల్సిన ప్లాట్‌ఫామ్ కట్టేసుకున్నారు. ఎటొచ్చి సినిమాబండిలో ప్రయాణానికి కావల్సిన టికెట్ డబ్బుల గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. చదువైన వెంటనే కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బులు పదిలం చేసుకోవాలనుకున్నారు. హమ్మయ్య ఎట్ లాస్ట్ ఫ్యూచర్‌పై ఓ క్లారిటీ తెచ్చుకున్నారు. ప్రయత్నమే తరువాయి.
మిస్టర్ క్యాబ్‌మ్యాన్..
అసలే యూత్.. మనసుకి కళ్లెం లేని ఏజ్. అందుకే చదువైపోయేవరకు ఆగనివ్వలేదు వాళ్ల సినిమా కల. ఫోర్త్ ఇయర్‌లో ఉండగానే వాళ్ల మెదళ్లను తొలిచేసింది. అందుబాటులో ఉన్న వనరులతోనే చిన్న సినిమా తీశారు. అదే మిస్టర్ క్యాబ్‌మ్యాన్. ఇట్స్ ఎ మ్యూజిక్ వీడియో మూవీ. సినిమా పూర్తి చేయడంతో సంతృప్తి పడలేదు. తమ అభిరుచికున్న సత్తా ఎలాంటిదో తేల్చుకోవాలనుకొని దాన్ని కేరళ ఫిలిం ఫెస్టివల్‌కు పంపారు. అందులో అవార్డు గెలుచుకుని.. వాళ్ల హాబీ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది ! ఆ అవార్డే భవిష్యత్ మీద వాళ్ల విశ్వాసాన్ని రెట్టింపు చేసి ఉంటుంది.
శామ్‌సంగ్.. డేటావిండ్..
ముందే అనుకున్నట్టు.. సినిమా బండి టికెట్‌కి పైసలు కూడబెట్టే ప్రయత్నంలో సాయి సామ్‌సంగ్‌లో, ప్రేమ్ డేటావిండ్‌లో ఉద్యోగాలు సంపాదించారు. కొన్నాళ్లాగి పార్ట్‌టైమ్‌ను సినిమా కోసం స్పెండ్ చేయడం మొదలెట్టారు. అఫ్‌సోస్.. వర్కవుట్‌కాలేదు. జాబ్‌ని కంప్లీట్‌గా పక్కకు పెట్టేద్దామనే నిర్ణయానికొచ్చారు. పేరెంట్స్ నో అన్నారు మూకుమ్మడిగా. కన్విన్స్ చేశారు వేరువేరుగా. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనీ కోసం మీమీద ఆధారపడమని ప్రామిస్ చేశారు. సాలోచనగా సరే అన్నారు అమ్మానాన్నలు. ఏనుగెక్కినంత బలమొచ్చింది అబ్బాయిలకు.
రాస్తా ఫిలింస్...
అప్పటికే తమలాంటి థింకింగ్, ఎచీవ్‌మెంట్ పాత్ ఉన్న ఫ్రెండ్స్ దొరికారు వాళ్లకు. తమలోకి ఆహ్వానించారు. ‘రాస్తా ఫిలింస్’ అనే ప్రొడ క్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఫస్ట్ కార్పొరెట్ ఫిలింస్‌తో రీలు నింపడం ప్రారంభించారు. తర్వాత యాడ్ ఫిలింస్‌కీ విస్తరించారు. తమలాంటి ఫిలిం లవర్స్‌కీ ఈ బ్యానర్ కింద సినిమాలు తీసుకోవడానికి చాన్స్ ఇస్తున్నారు. రాస్తా స్టూడియోస్‌నీ స్థాపించి యానిమేషన్‌నూ మొదలుపెట్టారు. ఈ టీమ్‌లో వీరితో పాటు ఇద్దరు డిజైనర్స్, ఓ యానిమేటర్ (అమ్మాయి) కలిపి మొత్తం అయిదుగురు.
నో ఎండ్..
ఈ ఎఫర్ట్స్ అనుభవం ఏడాదిన్నరే. బ్రేక్‌ఈవెన్ రాలేదు.. స్ట్రగులింగ్‌లోనే ఉన్నారు. అయితే ఏం.. ‘బోలెడు ఎక్స్‌పీరియెన్స్ గెయిన్ చేసుకుంటున్నాం.. ఫ్యూచర్ మాదే. ఈ అనుభవంతో డెఫినెట్‌గా మంచి సినిమాలు తీస్తామన్న నమ్మకం ఉంది’ అంటారు వాళ్లు. మంచి సినిమా అంటే అని అడిగితే.. ‘ఇప్పుడొస్తున్న రొటీన్ ఫార్ములాకి డిఫరెంట్‌గా ఉన్న ఫిలింస్‌నే ప్రొడ్యూస్ చేస్తాం.. డెరైక్ట్ చేస్తాం. ఆ పనిలోనే సీరియస్‌గా ఉన్నాం’ అని చెప్తారు. ఆ మాటలు వాళ్ల చేతలకు ప్రతీకలుగా వినిపిస్తాయి. ఎందుకంటే మొన్న మార్చి 8.. విమెన్స్ డే సందర్భంగా వాళ్లు తీసి, ప్రదర్శించిన ‘గులాబీ గ్యాంగ్ డాక్యుమెంటరీ చెప్తుంది వాళ్ల ప్రతిభేంటో! ‘ఇష్టమైన పనికి కష్టం ఉండదు.. ఓన్లీ ఎచీవ్‌మెంటే’ అంటుంది రాస్తా ఫిలింస్ టీమ్!
ఈ ఇద్దరు ఐఐటీ ప్రొడక్ట్స్ త్రీ ఇడియట్స్ టైప్ కాదు అమ్మానాన్నల కలతో పాటు సొంత డ్రీమ్‌కు డిజైన్ ఇచ్చిన టూ జెమ్స్!