పండగ ప్రయాణం | Special Story By Saraswathi Rama In Funday | Sakshi
Sakshi News home page

పండగ ప్రయాణం

Published Sun, Jan 12 2020 4:39 AM | Last Updated on Sun, Jan 12 2020 4:39 AM

Special Story By Saraswathi Rama In Funday - Sakshi

‘‘ఆకలేయట్లేదు.. నిద్రపట్టట్లేదు.. అసలు ఏ పనీ చేయబుద్ధవడం లేదు తెల్సా?’’  ఛాతీకి ఆనించుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను రెండు చేతుల మధ్య మరింత భద్రంగా బంధిస్తూ... సంతోషంతో తాదాత్మ్యం చెందుతూ చెప్పింది శ్యామల. 
‘‘ఊ... ఇదిగో’’ అంటూ డ్రై ఫ్రూట్స్‌ ప్యాక్‌లోంచి ఖర్జూరం తీసి శ్యామలకు ఇచ్చింది దీవెన. 
బర్‌దుబాయ్‌లోని షాపింగ్‌ ఏరియాలో తీరిగ్గా నడుచుకుంటూ వెళ్తున్నారిద్దరూ! 
‘‘దీవెనా... నాలుగేళ్ల తర్వాత ఊరెళ్తున్నాను.. నిజంగా చాలా హ్యాపీగా ఉంది’’ ఖర్జూరాన్ని తుడుచుకొని తింటూ చెప్పింది శ్యామల. 
‘‘ఇక్కడికొచ్చాక మీ ఊరు వెళ్లడం ఇదే ఫస్ట్‌ టైమా?’’ తనూ ఒక ఖర్జూరాన్ని నోట్లో వేసుకుంటూ అడిగింది దీవెన. 
‘‘మరి..? నాలుగు నెలల నా కొడుకును వదిలేసి వచ్చా!’’ గొంతుకు బాధ అడ్డంపడుతుండగా చెప్పింది శ్యామల. ఆమె కళ్లల్లో నిండిన నీళ్లను చూసి ఆప్యాయంగా శ్యామల చేయి నొక్కింది దీవెన. 
ఈ ఇద్దరికీ ఈ మధ్యే స్నేహం కుదిరింది. శ్యామలది తూర్పుగోదావరి, దీవెనది పశ్చిమ గోదావరి. తండ్రి లేడు. తల్లి చర్చిలో పనిచేస్తోంది. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. టెన్త్‌ వరకూ చదువుకుంది.  బాధ్యతల బరువు మోయడానికి  మేనమామ సహాయంతో ఈ మధ్యే దుబాయ్‌కి వచ్చింది  డొమెస్టిక్‌ వర్కర్‌గా. శ్యామలకు రూమ్మేట్‌గా చేరింది. ఇక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి చెప్పి దీవెనలో ధైర్యం నింపింది శ్యామలే. అయినా తన కుటుంబ విషయాలెప్పుడూ దీవెనతో పంచుకోలేదు ఆమె.  ఇంటికి ఫోన్‌ చేయాలనుకున్నప్పుడు కూడా సందులాంటి బాల్కనీలో నిలబడే మాట్లాడేది చిన్నగా. ఫోన్‌ సంభాషణ తర్వాత ప్రతిసారీ దిగులుతోనే నిద్రపోయేది. ఆ విషయాన్ని చాలాసార్లు గమనించినా గమనించనట్టే ఉండేది దీవెన.
ఇప్పుడు.. సంక్రాంతికి ఊరెళ్లడానికి ఆమె యజమాని సెలవు ఇచ్చిన సంబంరంలో మొదటిసారి తన కుటుంబం గురించి చెప్తోంది శ్యామల. 
‘‘నేను ఇక్కడికి వచ్చేరోజు.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పాలు తాగుతున్నవాడిని నా నుంచి బలవంతంగా విడిపించి నన్ను లోపలికి పంపాడు మా ఆయన. ఆ రోజు వాడు నా వైపు చేతులు చాస్తూ గుక్కపెట్టి ఏడ్చిన ఏడుపును జీవితంలో మరిచిపోలేను. ఈ నాలుగేళ్లలో ఏ రోజూ ప్రశాంతంగా నిద్రపోలేదు తెల్సా?’’ ఎంత దాచుకుందామనుకున్నా శ్యామలకు దుఃఖం ఆగట్లేదు. 
‘‘శ్యామలా... ’’అంటూ అనునయించే ప్రయత్నం చేసింది దీవెన. గబగబ బ్యాగ్‌లోంచి మంచినీళ్ల సీసా తీసి ఇచ్చింది. ఆ బాటిల్‌ పట్టుకొని పక్కనే సిమెంట్‌ చప్టా మీద చతికిలిపడింది శ్యామల. పక్కనే దీవెనా కూర్చుంది. 
శుక్రవారం కావడం మూలాన.. ఆ షాపింగ్‌ ఏరియాలో అంతా ఇండియన్సే ఉన్నారు. జంటలు.. మగవాళ్ల గుంపులు.. ఆడవాళ్ల గుంపులు.. ఎక్కడ చూసినా! వీళ్లు కూర్చున్న ప్రదేశానికి దగ్గర్లో తెలుగు అమ్మాయిలు, మలయాళం అమ్మాయిలూ షాపింగ్‌ చేసుకుంటున్నారు. 
‘‘ప్రతి శుక్రవారం ఇక్కడ పండగే’’ ఆ సందడిని చూస్తూ అంది దీవెన.. శ్యామలను తేలికపర్చడానికి.  
తనూ ఎదురుగా ఉన్న దుకాణాల మీద దృష్టిపెడుతూ . ‘‘ఇక్కడిక వచ్చిన కొత్తలో ఎంత ఇబ్బందిపడ్డానో! బాబును వదిలి ఉండలేకపోయా. షేక్‌ ఇంట్లో ఏ చిన్న పిల్ల ఏడ్పు వినపడ్డా నా కొడుకే గుర్తొచ్చేవాడు. పాల సలపరం భరించలేక ఒకసారి దొంగతనంగా.. షేక్‌ మూడో భార్య బిడ్డకు పాలిచ్చా. ఎక్కడి నుంచి చూసిందో ఏమో.. మహాతల్లి.. నా బిడ్డకు పాలిస్తావా? అంటూ వాతలు తేలేలా కొట్టింది. ఆ రోజు ఇక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేశా! పాస్‌పోర్ట్‌ లేకుండా బయట దొరికితే జైల్లో కూర్చోబెడ్తారని డ్రైవర్‌ రాజు ఉన్నాడే.. అతను భయపెట్టాడు. ఆ రాత్రి మా ఆయనకు ఫోన్‌ చేసి ఏడ్చా! అయినా ఆయన  కరగలేదు. బాబు ఎలా ఉన్నాడని అడిగినప్పుడల్లా ఆయనకున్న అప్పు గురించి ఏకరువు పెట్టేవాడు. ఇక్కడే ఉండక తప్పదని అర్థమైంది. అలవాటూ అయింది’’ అని నిట్టూరుస్తూ మంచి నీళ్లు తాగింది శ్యామల. 
గటగటా నీళ్లు తాగుతుంటే ఆమెనలా చూస్తూండిపోయింది దీవెన. 
 ఒకచేత్తో నీళ్ల బాటిల్‌ దీవెనకు ఇస్తూ.. ఇంకో చేత్తో చుబుకం కింద నుంచి కంఠం వరకు కారిన నీళ్లను చున్నీతో తుడుచుకుంది శ్యామల. 
‘‘అసలు ఎందుకొచ్చావ్‌ ఇక్కడికి?’’ శ్యామల కళ్లల్లోకి చూస్తూ దీవెన.
‘‘నా మొగుడికి ఏ పనీ చేతకాక. అప్పులపాలై ఉమ్మడిగా ఉన్న ఇంటినీ తాకట్టు పెట్టాడు. వాళ్ల అన్నదమ్ములకు తెలిసి గొడవై కొట్టుకున్నారు. పోలీస్‌ కేసైంది. అప్పుడు నేను నెల బాలింతను. ఒమన్‌లో ఉండే మా ఆయన పిన్ని కూతురే మా ఆయనకు సలహా ఇచ్చింది నన్ను ఇక్కడికి పంపమని. ఇప్పుడు వెళితే రానిక’’ చివరి మాటను కసిగా, స్థిరంగా పలికింది శ్యామల. 
‘‘సర్లే ఇన్నాళ్లకు నీ కొడుకును చూసుకోబోతున్నావ్‌. హాయిగా షాపింగ్‌ చేసుకో.. వాడికేమేం కావాలో కొనుక్కో. ఇంక ఆ పాతవాటిని గుర్తుచేసుకోకు. రా వెళదాం’’ అంటూ శ్యామలను ఉత్సాహపరుస్తూ సిమెంట్‌ చప్టా మీద నుంచి లేపింది దీవెన. 
పిల్లాడికి చాక్‌లెట్లు, స్కూల్‌ బ్యాగ్, ఖర్జూరాల ప్యాకెట్లు, డిజిటల్‌ వాచీ, చిన్న పిల్లల చలువ కళ్లద్దాలు, నడిస్తే సౌండ్‌ వచ్చే షూ.. అంటూ తనకు నచ్చినవన్నీ కొని అలిసిపోయి సాయంకాలానికి రూమ్‌కి చేరారు.
చేరీచేరంగానే.. వాటన్నిటినీ గబగబా బ్యాగులో సర్దేయడం మొదలుపెట్టింది శ్యామల. 
ఆమె ఆత్రం చూస్తుంటే ముచ్చటేసింది దీవెనకు. 
‘‘తర్వాత సర్దుకోవచ్చు కదా.. కాసేపు రెస్ట్‌ తీసుకో’’ అంది నేల మీద పరిచి ఉన్న పరుపు మీద వాలిపోతూ దీవెన. 
‘‘మళ్లీ మర్చిపోతా.. ఇప్పుడే సర్దుకోవడం బెటర్‌’’ అని శ్యామల చెప్తూండగానే ఆమె సెల్‌ మోగింది. బాల్కనీలోకి వెళ్లకుండా అక్కడే లిఫ్ట్‌ చేసింది. అవతల మాటలతో ఆమె మొహం వివర్ణమవుతోంది. కంగారు పడింది దీవెన. ఫోన్‌ కట్‌చేసి పరుపు మీద కూలబడింది శ్యామల. 
‘‘ఏమైంది?’’ అని దీవెన అడగబోతుండగానే..ఏదో గుర్తొచ్చిన దానిలా శ్యామల ఫోన్‌ కలిపింది. 
‘‘అమ్మా..నన్ను రావద్దని ఏదో కథచెప్తున్నాడేంటి మా ఆయన?’’ కోపంతో  శ్యామల. 
‘‘ఏం చెప్పమంటావ్‌.. నువ్వెళ్లిన యేడాదే ఎవరితోనే కాపురం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆవిడకు నెలలు నిండాయట..’’ అంటూ ఇంకేదో చెప్తోంది అవతలి స్వరం. 
స్థాణువై పోయిన శ్యామల చేతిలోంచి ఫోన్‌ జారిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement