
సౌది అరేబియా.. రాబిక్ ప్రాంతంలోని లేబర్ క్యాంప్..
రాత్రి ఎనిమిది గంటలు..
కంటైనర్ గదిలో బంకర్ బెడ్ మీద కూర్చుని పక్కనే ఉన్న చిన్న కిటికీలోంచి ఆకాశంలో చుక్కల్ని చూస్తున్నాడు దశర«థ్ ఏదో ఆలోచిస్తూ!
తన మీద ఎవరో నీరు చిలకరించినట్టనిపించి ఒక్కసారిగా దృష్టిమరల్చాడు.
అజహర్.. స్నానం చేసివచ్చినట్టున్నాడు.. తన మీద జుట్టు దులిపి నవ్వుతున్నాడు ‘‘ఏమాలోచిస్తున్నావ్ దాస్ భాయ్’’ అంటూ!
చేతుల మీద, మొహం మీద పడ్డ నీటి చుక్కల్ని తుడుచుకుంటూ ఏం లేదు అన్నట్టుగా నవ్వాడు దశరథ్.
అజçహర్.. అటు తిరిగి టవెల్‌తో వీపు తుడుచుకొని... జబ్బల బనీను వేసుకొని.. ధోతీ చుట్టుకొని కాలు కిందనుంచి ఓ అంచు తీసి కుచ్చిళ్లు మడిచి నడుములో దోపుకుంటూ ఇటు వైపు తిరిగాడు. ఈ క్రమాన్నంతా ఆసక్తిగా గమనించిన దశరథ్.. ‘‘అజహర్.. పాకిస్తాన్‌లో ధోతీ ఎవరూ కట్టుకోరు కదా.. నీకెట్లా అలవాటైంది’’ అజహర్‌తో స్నేహం కుదిరిన ఈ అయిదేళ్లలో నూటముప్పయో సారి అడిగాడు.
చెదరని చిరునవ్వుతో.. ‘‘మా తాత కట్టుకునేవాడు.. అదే మాకూ అలవాటైంది.. పార్టిషనప్పుడు ఇండియా నుంచే పాకిస్తాన్ వెళ్లారు కదా మా పెద్దలు.. అట్లా ధోతీ కల్చర్ మాకూ వచ్చుంటుంది’’ అజహర్‌ది కూడా అదే జవాబు నూటముప్పయోసారి.
కిషన్‌తో అజహర్ పరిచయమయ్యాడు. అప్పుడు అజహర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. దశరథ్ ఆజాద్ వీసా మీద కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా ఉన్నాడు. అతను, కిషన్ ఇంకొంతమంది కలిసి ఒకటే రూమ్‌లో ఉంటూండేవాళ్లు. అప్పటికి కిషన్‌కు సరైన పనిలేదు. ఆ టైమ్‌లోనే ఒకసారి అజహర్ టాక్సీ ఎక్కాడు కిషన్. ఆ రోజు దశరథ్‌కు ఇంకా గుర్తుంది.. రూమ్‌కొచ్చిన కిషన్ తనను పట్టుకొని ఏడ్చేశాడు. ‘‘అన్నా...మన దేశం దాటినంకనే మనుషులు అర్థమైతుండ్రు నాకు.. హిందు, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ కొట్లాటలన్నీ దేశంలోపల్నే. దాటితే లోకమంతా ఒకటేనే’’ అంటూ అజహర్ గురించి చెప్పాడు. తనకు ఉద్యోగం లేదని తెల్సి టాక్సీ సవారీ తీసుకోలేదట అజహర్. అప్పుడే కాదు.. కిషన్‌కు పని దొరికేదాకా ఎప్పుడు అజహర్ టాక్సీ ఎక్కినా పైసలు తీసుకోలేదు అతను. అట్లా వాళ్లిద్దరికీ దోస్తానా కుదిరి.. తనకూ అజహర్ దోస్తయి.. ఇప్పుడు పెయింటింగ్ పనిలోనే కాదు కంటైనర్ రూమ్మేట్ కూడా అయ్యాడు.
సౌదీ అరేబియా పాతదవుతున్నా కొద్దీ కొత్త విషయాలెన్నో తెలిశాయి దశరథ్‌కు. అజహర్‌లాంటి వాళ్లు ఇంకొంతమంది ఉన్నారనీ అనుభవంలోకి వచ్చింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి సౌదీకి బతకడానికి వచ్చిన టాక్సీవాలాలు కూడా పనిదొరకని ఇండియన్స్ ఎవరు తమ టాక్సీ ఎక్కినా డబ్బులు తీసుకోరని. చాలా స్నేహంగా ఉంటారని. ఇదే విషయం తన చిన్నబాపుతో చెప్తుంటే గుండె బరువెక్కే ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నాడు అతను.
ఇరవై ఏండ్ల కిందట సౌదీకొచ్చిండు చిన్నబాపు. ఆరేండ్లున్నడు ఇక్కడ. అతనొచ్చిన కొత్తల్నే కార్గిల్ యుద్ధం అయింది. పాకిస్తానోళ్లు, మనోళ్లు కల్సే ఒకరూమ్‌లో ఉన్నరటప్పుడు. అన్నం తినే రూమ్‌ల టీవీ ఉండేదట. కార్గిల్ యుద్ధం వార్తల్ని వింటే ఇటు హిందుస్తానోళ్లు బాధపడ్తరేమో అని పాకిస్తానోళ్లు.. పాకిస్తానోళ్లు బాధపడ్తరేమోనని మనోళ్లు వార్తలే చూడకపోదురట. చిన్నబాపు ఆ ముచ్చట చెప్తుంటే కండ్లకెంచి నీళ్లుగారినయ్. ఇసుంటి సంగతులెన్నో అని దశరథ్ అనుకుంటూండగానే ‘‘క్యా భాయ్.. ఇత్నా క్యా సోంచ్‌రే?’’ అంటూ అజహర్ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు.
‘‘ఏం లేదు’’ అంటూ ఆప్యాయంగా అజహర్ తొడ మీద చరిచాడు దశరథ్.
‘‘భాయ్.. జెడ్డాల్నే పని కాబట్టి కలుస్తూ ఉండు.. మర్చిపోకు’’ అన్నాడు దశరథ్ చేయిని తన చేతిలోకి తీసుకుంటూ అజహర్.
‘‘యాదిమర్చిపోయే దోస్తాన్నా ఇది? నువ్వు నా తమ్ముడిలాంటోడివి. కాదు తమ్ముడికంటే ఎక్కువే’’ అని అంటున్నప్పుడు దశరథ్ కళ్లు చెమ్మగిల్లాయి.
అజహర్‌లో కూడా దిగులు మొదలైంది. నిజంగానే దశరథ్ తనకు అన్నలాంటివాడు. తను టాక్సీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు అమ్మకు సుస్తీ చేసిందిæ. ట్రీట్మెంట్ కోసం కాస్త ఎక్కువ డబ్బే పంపించాల్సిన అవసరం వచ్చింది. రాత్రింబవళ్లు కష్టపడ్డానికి సిద్ధమయినా పని దొరకాలి కదా? ఆ వఖ్త్‌లో తనను ఆదుకుంది ఈ హిందుస్తానీ దోస్తులే. దాస్ భాయే.. తనూరోళ్లందరికీ చెప్పి.. ఓటీ చేసి.. వచ్చిన డబ్బంతా తనకు ఇప్పించాడు. భాయ్ అయితే ఓటీతోపాటు ఒకనెల జీతంకూడా ఇచ్చేశాడు.
‘‘చలో అజహర్.. నువ్వు రేపు తొందర్గా వెళ్లాలి కదా.. తిందాం రా..’’ అంటూ చేయిపట్టుకొని అజహర్‌ను లేపాడు.
అప్పటికే తమ రూమ్మేట్స్ అంతా భోజనాల బల్ల దగ్గరున్నారు వీళ్లకోసం వెయిట్‌చేస్తూ. బల్ల మీద పెద్ద విస్తారాకులో భోజనం ఉంది. చుట్టూ అయిదుగురు కూర్చున్నారు. అందరూ తలా ఒక్క ముద్ద కలిపి దశరథ్‌కు తినిపించారు. దశరథ్ కూడా అందరికీ తినిపించాడు. తను తింటూ చివరి ముద్దలు మళ్లీ అజహర్‌కు పెట్టాడు.
ఆ రాత్రంతా యాదితో జాగారమే అయింది దశరథ్‌కు. ఊర్లో ఇల్లు తప్ప జానెడు జాగలేదు. చిన్నబాపుకి ఉన్న పరిచయాలతో సౌదీకొచ్చిండు. మంచిపనే దొరికింది. సంపాదిస్తున్నగదాని కొంచెం అప్పు జేసి ఊర్లె పొలం గూడా కొన్నడు మొన్ననే. ఆ సంబ్రం ఇంకా పోనేలేదు గాయింతల్నే కఫీల్ (యజమాని) చెప్పిండు ఇంక నీకు నా దగ్గర పన్లేదు వేరే కఫీల్‌ను ఎతుక్కో అని. నెత్తిమీద పిడుగువడ్డట్టే అయింది. ‘‘హారి భగవంతుడా.. గిప్పటిగిప్పుడు ఏడికని వోవాలే? ఏ ఖఫీల్ దొరకాలే? అవ్వతోడు రందితోని నెలరోజులు మెతుకు ముట్టలేదు. యెట్ల కనివెట్టిండో కనివెట్టింటు అజహర్.. చెప్పేదాకా మనసున వట్టనియ్యలే.. ఏమైంది దాస్ భాయ్... బోలో అనుకుంట.సంగతిని. పరేషానే అయిండు కాని.. ధైర్యం జెప్పిండు. ఆ దినం నుంచి వారం కిందటిదాకా తనకు పనిప్పియ్యడానికి ట్రై చేస్తనే ఉండు. లాస్ట్‌కు సిరియా కాంట్రాక్టర్‌ను వట్టుకొని జెడ్డాల తనకు పనిదొర్కవట్టిండు... ఈ తలపులతో తెల్లవారు జామునెప్పుడు నిద్రలోకి జారుకున్నాడో దశరథ్!
‘‘దాస్‌భాయ్..’’ అంటూ భుజం తట్టినట్టనిపించేసరికి మత్తుగా కళ్లు తెరిచాడు దశరథ్.
అజహర్.. సైట్‌కు వెళ్లడానికి రెడీ అయ్యి కనిపించాడు.
‘‘అరే.. మోటరొచ్చిందా?’’ అంటూ టైమ్ చూసుకున్నాడు. ఆరు అయింది. లాస్ట్ ట్రిప్ అన్నమాట. తనకోసం లాస్ట్ ట్రిప్‌దాకా ఉన్నట్టున్నాడు. లేచి అజహర్‌ను హత్తుకున్నాడు. అజహర్‌కూడా దశరథ్‌ను గట్టిగా పట్టుకుని ‘‘భాయ్.. కలుస్తుండు. ఈ తమ్ముడ్ని మర్చిపోకు’’ అని అంటూంటే మరింత గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు దశరథ్. విడివడ్డాక.. ఆ ఆప్యాయతను షేక్‌హ్యాండ్ రూపంలో కూడా వ్యక్తికరించి వెళ్లలేక వెనుదిరిగాడు అజహర్.
Comments
Please login to add a commentAdd a comment