పాతికేళ్ల కిందట...నిజామాబాద్‌లో అప్పుడే బొంబాయి రైలు దిగిన సాయిలు.. స్టేషన్ బయటకు వచ్చాడు. పాన్ డబ్బా దగ్గర ఆగి.. చేతిలో ఉన్న బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుంటూ ‘‘అన్నా మారుతీ బీడీకట్టియ్యే ఒకటి’’ అడిగాడు.
షర్ట్ జేబులోంచి డబ్బులిచ్చి బీడీ కట్ట తీసుకుంటూ ‘‘టైమ్ ఎంతయిందే?’’ అడిగాడు డబ్బా అతణ్ణి.
‘‘పదకొండున్నర’’ చెప్పాడు డబ్బా యజమాని.
కొంచెం ముందుకు వెళ్లి.. పంటికింద బీడీ పెట్టుకుంటూ ప్యాంట్ జేబులోంచి అగ్గిపెట్టెను తీసి బీడీ వెలిగించి దమ్ము లాగుతూ ఆకాశం కేసి చూశాడు సాయిలు. వానాకాలం పూర్తయిపోలేదు. అయినా చుర్రుమనిపిస్తోంది ఎండ.
లోపలికి పోయిన చెంపలు.. మాసిన గడ్డం.. అతణ్ణి జబ్బుపడ్డ వాడిగా.. మతిస్థిమితం లేనివాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి.
చూపులను చుట్టుపక్కలకు సారించి.. బీడీ పీలుస్తూంటే గతం మెదడును ఆవరించింది.
పదిహేనురోజులైతుంది ఇల్లు ఇడిషి. తీస్కవోయిన పైసలు దగ్గరవడ్తుంటే.. ఇక అక్కడుండు వేస్ట్ అని నిజాంబాద రైలెక్కిండు. అబ్బ.. ఏం ఊరు బొంబై! ఆ మనుషులు.. ఆ కథనే వేరే! అంతకుముందు మస్కట్ వొయిన దోస్తులు ‘‘వారీ.. బొంబైల కామటిపుర ఆడోళ్లుంటరూ... సీన్మ యాక్టర్ల లెక్కనే’’ అని షెప్తుంటే.. సూతమని కామటిపుర వోయిండు....
ఒక్కసారిగా బీడీ చురక తగిలేసరికి ముంబై తలపులను వదిలి బీడీ నలిపేసిండు. భుజమ్మీదున్న టవెల్‌ను తలకు పాగాలా.. కాస్త మొహాన్నీ కవర్‌చేస్తూ చుట్టుకున్నాడు. బ్యాగ్ తీసుకొని స్టేషన్ ఆవరణ దాటి బస్‌స్టాండ్ వైపు నడక సాగించాడు.
లాస్ట్ బస్ వట్టుకోవాలే ఊరికి. ఎనిమిదికేమో ఉన్నట్టుంది. గప్పుడు వోతనే ఊర్లే అందరు పండుకుంటరు. తనను చూడంగనే ఇంట్లోళ్లు ఎట్ల అర్సుకుంటరో? పద్మకేం జెప్పాలే? అవ్వ (అమ్మ)కెట్ల మొఖం జూపియ్యాలే? బావ తాన అప్పు దీస్కున్నది గాక బావకు దెల్వకుండా షెల్లె బంగారం కూడా కుద్వవెట్టే.. ఇప్పుడు ఏం జెప్తడు? అప్పంటే యాదికొచ్చే.. యేడాదిల తీర్పుతాని ఉన్న మూడెకరాల పొలం కాయితాలూ సత్యనారాయణ సేuŠ‡ దగ్గర వెట్టే! హా రామచంద్రా.. ఎల్లదీసుడెట్లా? అసలు ఏ మొఖంబెట్టుకొని తిర్గాలే ఊర్లె? ఈ బెంగతోనే బస్టాండ్‌లోని ఉడిపి హోటల్లో భోజనం పూర్తి చేశాడు సాయిలు. టైమ్ చూసుకుంటే ఇంకా ఒంటిగంట దగ్గరే ఉంది. పక్కనే ఉన్న అశోక్ టాకీస్‌లోకెళ్లి కూర్చున్నాడు.
సాయం కాలం ఏడు గంటలు.. చీకటి పడింది..
‘‘పన్ల మీద నిజాంబాదకొచ్చి ఊర్లోల్లు మర్లిపొయ్యే యాళ.. ఈడ ఉండుడు మంచిదికాదు..’’ అనుకుంటూ రోడ్డు దాటి బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న బజార్లోకి వెళ్లాడు. రోడ్డు పక్కన.. టిబెటన్లు స్వెటర్లు అమ్మే పాకలు, చెప్పుల దుకాణాలు, పళ్ల బండ్లూ ఉన్నాయి.
చెప్పుల దుకాణనికి వెళ్లాడు. అందాజాతో పిల్లల పాదాల కొలతలు చెప్పి... కూతురి కోసం ఎత్తుమడమల చెప్పులు, కొడుకు కోసం కాన్వాస్ షూ కొన్నాడు. పేపర్ లిఫాఫాలో ప్యాక్ చేయించుకొని బ్యాగ్‌లో సర్దుకున్నాడు. ఆ బ్యాగ్ భుజానికేసుకొని.. గాం«ధీ చౌక్ వైపు నడవడం మొదలుపెట్టాడు.
దార్లో ‘‘రిక్షా చాహియే భాయ్?’’ అంటూ బెల్ కొట్టి మరీ రిక్షా వాళ్లు అడుగుతున్నా.. వినిపించుకోకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు..
పిక్చర్ ప్యాలెస్ లేన్‌లోకి మళ్లి.. థియేటర్ ముందున్న మిర్చీ బండి దగ్గరకు వెళ్లాడు. బిడ్డకు ఇష్టమని రెండు ప్లేట్ల మూంగ్ పకోడీ పార్సిల్ కట్టించుకుని తిరిగి బస్టాండ్ దారి పట్టాడు సాయిలు.
ముగ్గురు నల్గురు తప్ప బస్‌లో జనమే లేరు! తనూరు వాళ్లసలే లేరు. ‘‘హవ్వర గొండ (హమ్మయ్య)’’అనుకుంటూ ఊపిరిపీల్చుకున్నాడు సాయిలు. కిటికీ సీట్లో కూర్చున్నాడు. మూతి కనిపించకుండా టవల్ కొనను పంటి కింద పెట్టుకొని కిటికీ అద్దానికి తల ఆనించి బయటకు చూస్తున్నాడు.
‘‘ఆ టికెట్‌వయా.. టికెట్ దీస్కో’’ సాయిలు సీట్ దగ్గరున్న ఇనుపరాడ్‌కు ఆనుకొని చంకలో పెట్టుకున్న టికెట్ చెస్ట్‌ను కుడిచేతిలోకి తీసుకుంటూ అడిగాడు కండక్టర్.
‘‘మోర్తాడ్’’ అని సాయిలు అంటూండగా పంటి కిందున్న టవల్ అంచు బయటకు వచ్చి కిటికీలోంచి వస్తున్న గాలి విసురుకు మొహం మీద నుంచి టవెలూ పక్కకు జరిగింది.
టికెట్‌కు పంచ్ చేసి సాయిలు చేతిలో పెట్టబోతున్న కండక్టర్ అతణ్ణి చూశాడు.
‘‘అరే.. సాయిలూ...’’అన్నాడు ఒక్కసారిగా.
‘‘అయిపాయె.. గంగల గల్షిపాయే’’ అవమానంతో కూడిన దిగులు సాయిలులో.
‘‘అరే నువ్వు మస్కట్ వోయినవని జెప్పిండ్రు... గంతవోతే పదిహేన్ దినాలన్న అయిందో కాలేదో?’’ అడిగాడు కండక్టర్.
కండక్టర్ మొహం చూసిన సాయిలు ఖంగుతిన్నాడు. తమ ఊరోడే. కండక్టర్ కొలువచ్చినంక నిజాంబాదల మకాంబెట్టిండు.
‘‘ఏంది సాయిలూ గీడగనవడ్తివి?’’ అంటూ సాయిలు పక్కనే కూర్చున్నాడు కండక్టర్ అసలు కూపీలాగందే వదిలేది లేదన్నట్టుగా.
ఏమని జెప్తడు? ఏడని మొదలువెడ్తడు? గా భూకంపం.. గదాంతోని ఎల్కలు జచ్చి.. ప్లేగ్‌వాకి విమానాలు క్యాన్సలై.. విసా టైమెత్తిపొయ్యి.. మస్కట్ల ఉద్యోగం ఊష్టయిందని జెప్తే నమ్ముతరా? మస్కట్ వోతందుకు ఇగ రేపు బొంబై రైలు ఎక్కుతడనంగా.. ఎంత పెద్ద దావత్ ఇచ్చిండు? రెండు యాటలు తెగినయ్. సుట్టపోళ్లు.. కులపోళ్లనే గాదు.. ఊర్లందర్నీ విల్షి పోషమ్మ కాడ జాత్ర లెక్క జేషిండు. ఆడివిల్లకు బట్టలు వెట్టిండు. అవ్వను, పెండ్లాం బిడ్డల్ని చూస్కోమ్మని అత్తగారోల్లకు అప్పగింతలువెట్టిండు. బామ్మర్దికి పొలం జెయ్‌మని జెప్పిండు. దోస్తులైతే ‘‘మస్కట్ నుంచి అచ్చేటప్పుడు వాచ్‌లు, కండ్లద్దాలు దెచ్చుడే మాకోసం.. మస్కట్ సాయిలూ..’’ అని చిడాయించిండ్రు. బస్ ఎక్కియ్యనీకొచ్చిన అవ్వ ‘‘వారీ.. అంగీకి కుట్టిచ్చుకున్న దొంగ కీసాల వెట్టుకున్న నలపైవేలు పైలం రా’’ అని చెప్పుకుంట ఎంత గాయిజేసింది? గా లాతూర్ భూకంపం తన బత్కుల గింత పెద్ద ఆపద వెడ్తదని అనుకున్నడా? ప్లేగ్ ఏందీ? గదాంతోని సంబంధం లేని తన కొలువు పోవుడేంది? ఊర్ల తనకెమన్న ఇజ్జత్ ఉంటదా? ’’ అనుకుంటూ కండక్టర్ వంక చూసిన సాయిలు కళ్లల్లో నీళ్లు!
లాస్ట్ బస్
Published Sun, Nov 17 2019 3:39 AM | Last Updated on Sun, Nov 17 2019 3:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment