‘‘అందరూ పసుపు కల్పుకోతుండ్రు.. ఇయ్యాల్టికి మూణ్ణెల దినమాయే సర్పంచ్ సాబ్.. పీనుగ రాదు.. మమ్ముల పన్ల వెట్టుకోరు. సచ్చినోడు సచ్చిండు ఆడ.. బతికుండీ మా సావు అయితుంది ఈడ..’’ దుఃఖం కన్నా వేదన ఎక్కువగా వినిపించింది ఆమె మాటల్లో.
‘‘ముట్టుడున్నోల్లను కలుపుకోకు కదా ముత్తవ్వా? అందునా పసుపుతోట్లెకు ఎట్ల రానిస్తరు జెప్పు? శుభంగోలే.. అనుకుంటరు గదా...!’’ సముదాయించే ప్రయత్నం సర్పంచ్‌ది.
‘‘అవ్.. నేనుసుత ఏమంటలే.. కాని గిట్లెన్నొద్దులు మైలవట్టాలే? రోజూ ఆల్లీల్లు బువ్వ వంపిస్తే ఎట్లనిపిస్తది? ఎన్నిదినాలని మందింటి మొఖాలు జూస్కుంట కుసుంటం? పెద్దోడికి పనిలేదు.. షిన్న పోరగాండ్లను స్కూల్లకు రానియ్యరు.. ఉన్న నల్గురం చెర్వులవడి సద్దుమా?’’ నిస్సహాయంగా ఆమె.
‘‘ఏం జెయ్యమంటవ్ ముత్తవ్వా? ఈడికెంచి ఐడీ వోతే ఆడేమన్నా ముందుకు వడ్తది? నీ మొగడి పేరు ఒక కోపన్(రేషన్)కార్డ్‌ల లేకపాయే.. ఆధార్ టైమ్‌ల సూత రాకపోయే? అచ్చిండా?’’ అడిగాడు ఆమెను.
‘‘ఏడొచ్చే సర్పంచ్‌సాబ్.. నా షిన్నకొడుకు కడుపుల వడ్డంక నాలునెల్లకు వొయ్యిండటే.. గిప్పటిదాకా ఇంటిమొఖమే సూడకపోయే.. ఇప్పుడు మా షిన్నోడికిప్పుడు పదమూడేండ్లు..’’ చెప్పింది వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ!
‘‘సూడు మరి.. ఒక్కదాంట్ల పేరులేదు.. పోనీ పట్టాదార్ పాస్‌పుస్తకమన్నా పనికొస్తదనుకుంటే గుంటెడు భూమిలేకపాయే? ఏం జెయ్యమంటవ్?’’ అంటూ ఆమె వంక చూశాడు.
దీర్ఘాలోచనతో ఎటో చూస్తోంది. మూడు కాలాలూ ఆకాశం కిందే పనిచేయడం వల్లేమో నలభై ఏళ్లకే అరవయ్యేళ్ల దానిలా అయిపోయింది. మొహంమీదన్నీ ముడతలే. ఆమెను అలా చూస్తుంటే ఎక్కడలేని జాలేసింది సర్పంచ్‌కు. తన కండ్లముందే వెరిగింది. అయిదుగురు అక్కచెల్లెళ్లలో ఆఖరుది. తండ్రి సచ్చిపోయేనాటికి ఏడేండ్ల పిల్ల. మేనమామలే సాకిండ్రు. పదిహేనేండ్లకు పెండ్లిచేసిండ్రు. పెనిమిటి కంచెట్టిది సుత తమ ఊరే. ముగ్గురన్నదమ్ములల్ల రెండోడు. నాలుగెకరాల పొలం ఉంటే ఆడివిల్లల పెండ్లికి అమ్మేసుకున్నరు. ముత్తవ్వ ఆల్లింటికి వోయేనాటికే ఆస్తి ఏం లేదు.. పొత్తుల ఇల్లు దప్ప. కూలీచేసుకొని బతుకుడే. అన్నదమ్ములు వంచుకుంటే వచ్చిన తనవంతు రెండు రూమ్‌లను అమ్ముకొని సౌదీకి వొయ్యిండు. ఖలివెల్లి (వర్క్ పరిమిట్ లేని వీసా) మీదనే. ఆడి నుంచి ఏం పంపిండో ఏమో.. గాని ఈ పదమూడేండ్లల బిగెడు జాగ గొన్లే.. ఇంత రేకుల ఇల్లేసుకోలే! అప్పులు దీరుంటయ్.. పాపం.. ఈ పిల్లొక్కతే.. మొన్నమొన్నటిదాకా.. రెక్కలకు రికామ లేకుండా పనిజేసింది. గిప్పుడే పెద్దోడింత షేతికొచ్చిండు.. పనిజేస్తున్నడు ఇగ తిరబడ్తరనుకునేటాల్లకు హార్టొచ్చి మొగడి పానం బోయిందనే సంగతిదెల్సే! పీనుగును తొందర్గ తీస్కరాతందకు తానేం జేయాల్నో అది జేస్తుండు.. ఐడీ కారట్ లేకపోతే ఏం అయితలేదు ఆడ.. అని ఆలోచించుకుంటూండగానే ఏదో తట్టినట్టయి..
‘‘ముత్తవ్వా.. నీ మొగడు కంచెట్టిది ఇదే ఊరని..ఫలానోల్ల కొడుకని.. కుటుంబం ఫలానా ఇంట్ల ఉంటుందని నేనొక లెటరు రాసి.. సంతకం బెట్టి.. స్టాంపేసిస్తా.. ఎమ్మార్వో దగ్గరకు కొండవో. గిట్లేమన్నా పనైతదేమో సూతం’’ అన్నాడు సర్పంచ్.
సరే అన్నట్టుగా తలూపింది ముత్తవ్వ.
‘‘అమ్మా.. సాయిగాడి అక్కపెండ్లి. దోస్తులంతా దావత్ చేసుకుంటుండ్రే’’ షర్ట్ ఇస్త్రీ చేసుకుంటూ దిగులుగా చెప్పాడు ముత్తవ్వ పెద్దకొడుకు ప్రమోద్.
‘‘ఊ’’ అంది పరధ్యానంగా ముత్తవ్వ పాత సూట్‌కేస్‌లో తన భర్త ఐడీ తాలూకు ఆధారాలేమన్నా దొరుకుతాయేమో అని వెదుకుతూ.
‘‘అమ్మా... ఇయ్యాల రాత్రికేనే దావతూ’’రెట్టించాడు ప్రమోద్.
‘‘నన్నేంజెయ్‌మంటవ్రా... సద్దునా’’ అంటూ తమను ఈ దశకు నెట్టిన పరిస్థితిని ఎదర్కోలేక వచ్చిన కోపాన్నంతా ఒక్కసారిగా కొడుకు మీద చూపింది.
ఆమె అరుపుకి బిక్కచచ్చిపోయాడు పదిహేడేళ్ల కొడుకు.
ఇంతలోకే బయట నుంచి ‘‘ముత్తి.. ఓ ముత్తి’’ అంటూ ఓ స్త్రీ పిలుపు.
‘‘మల్లా ఎవడికి ఏంబుట్టే’’ అని చిరాకుపడుతూ లోపలినుంచి వాకిట్లోకొచ్చింది ముత్తవ్వ.
ఆమెను చూడగానే ఇందాకటి స్త్రీ ‘‘ఎన్నిసార్లు జెప్పాల్నే ముత్తీ.. నీ పిల్లల్ని అటెంకల రానియ్యద్దని? గుడిముంగట పిల్లగాండ్లు ఆడుకోంగ వొయ్యిండ్రట.. ఆ ఆటలల్లకలెవడి.. కోమటోల్ల పిల్లగాండ్లను తాకిండ్రట.. కోమటోల్ల సుశీల లొల్లిలొల్లి జేస్తుంది. నీ పిల్లగాండ్లకు పిలిపిచ్చుకో..’’ గట్టిగా చెప్పి విసావిసా వెళ్లిపోయింది.
ఇందాకటి కోపం ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు ఈ విషయం తోడై... విసురుగా లోపలికి వెళ్లి.. ఇస్త్రీ చేసుకున్న షర్ట్‌ను మడతపెట్టుకుంటున్న పెద్దకొడుకు జుట్టుపట్టుకొని.. పళ్లుబిగబట్టి.. తలను గొడకేసి నొక్కిపెడ్తూ..
‘‘ఈడ మీ అయ్యజచ్చి.. ముట్టుట్ల ఏడుస్తుంటే మీకు దావత్‌లు కావల్సొచ్చినయారా.. దావత్‌లు? దోస్తులు, దావత్‌లు అన్నవంటే కాళ్లిర్గొగొట్టి పొయ్యిల వెడ్త బిడ్డా.. ఏమనుకుంటున్నవో.. ఇయ్యాల్టిసంది ఎవ్వడన్నా కాలు బయటవెట్టిండ్రో సూడుండ్రి మీ తడాఖ ఎట్లుంటదో! పో.. పొయ్యి అశోక్‌ను, చరణ్‌గాడ్రి తొల్కరాపో.. నడువ్’’ అంటూ జుట్టు అలాగే పట్టుకొని వీధి గుమ్మం వైపు తోసింది ప్రమోద్‌ను.
ఆ తోపుకి గడపలో పడ్డాడు వాడు. కళ్లనిండా నీళ్లు.. అదిమిపట్టుకుంటూ లేచి వెనక్కి తిరిగి చూడకుండా బయటకి వెళ్లిపోయాడు.
తలుపేసేసి చేరగిల పడి వెనకనుంచి తలను తలుపుకి బాదుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టింది ముత్తవ్వ.
‘‘భగవంతుడా నేనేం పాపం జేసిన? నాకే ఎందుకు వెడ్తున్నవ్ ఈ పరీక్షలు? మొగడు సచ్చిండని ఏడ్వాన్నా? పీనుగు ఇంకా ఇంటికి రాలేదని ఏడ్వన్నా? కర్మ కాలేదని ఊరోల్లు దేంట్ల కలుపుకుంటలేరని..కల్వనిస్తలేరని ఏడ్వల్నా? ఇంట్ల మనుషులు రోగమొచ్చి మంచంల వడ్డా.. సచ్చినా తెల్లారే పనికి వోకపోతే ఎల్లరి పరస్థితికి ఏడ్వల్నా? పిల్లలు చెప్పిన మాటింటలేరని ఏడ్వల్నా? ఒక్కదాన్నే ఎన్నని జూస్కోవాలే? యేడికని వోవాలే? సౌదీకి వొయ్యి అప్పుల కుప్పనే వెట్టిండు ఒక్క రూపాయి వంపని మొగడు .. మంచి, చెడ్డ అర్సుకోని మొగడు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.. ఈ బాధ లోకంకేం ఎర్క? నా అసుంటోల్లు దినాం సచ్చుకుంటనే బత్కవడ్తిమి. ఏం మొగడు? ఏం సంసారం ఇది? బతికున్నప్పడూ సాధిచ్చే... సచ్చీ సాధించవట్టే.. ఎట్ల కొనముట్టుడు?’’ అనుకుంటూ తలచుకొని తలచుకొని గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయింది ముత్తవ్వ.
మైలు
Published Sun, Dec 1 2019 12:28 AM | Last Updated on Sun, Dec 1 2019 12:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment