ఏ.. తియ్.. ముసలోడిలెక్క గురువారం ఒక్కపొద్దు.. ఏంది?
‘‘రాజేష్.. నీ వంతు పైసలు రాలే’’ డబ్బులు లెక్కచూసుకుంటూ అడిగాడు శ్రీధర్.
‘‘ఇస్తా.. మొదలువెట్టిండ్రా’’ ఒకచేత్తో అద్దం పట్టుకొని ఇంకో చేత్తో తల దువ్వుకుంటూ అన్నాడు రాజేష్.
‘‘ఆ.. అందరూ రెడీ అయిపోయిండ్రు’’ రాజేష్ వైపు చేయిచాపుతూ శ్రీధర్.
అద్దం, దువ్వెన బంకర్ బెడ్ కింద ఉన్న బ్యాగ్‌లో పెట్టేసి ..జేబులోంచి దిర్హమ్స్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టాడు.
లెక్కపెట్టుకొని శ్రీధర్ వెళ్లబోతుంటే.. ‘‘దావత్ ఎక్కడ?’’ అడిగాడు రాజేష్.
‘‘మన రూమ్‌ల్నే’’ అని చెప్పి గబగబా గదిదాటి ఏదో గుర్తొచ్చినవాడిలా మళ్లీ వెనక్కి వచ్చి ‘‘రాజేష్.. కొంచెం రూమ్ సగవెట్టవా?’’ అంటూ తన బెడ్ మీదున్న టవెల్, లుంగీ, బనీను తీసి గబుకున్న బెడ్ కిందకు తోసి అంతే వేగంగా వెళ్లిపోయాడు శ్రీధర్.
ఆ హడావిడి చూసి ‘‘హూ.. ’’అని నిట్టూరుస్తూ గది సర్దే పనిలోపడ్డాడు రాజేష్... ‘‘ఒక్క గురువారం దావత్ చేసుకోకపోతే ఏమైతదో? ఒకదిక్కు పైసలు సగవడక పరేషాన్ అవుకుంటనే ఇంకోదిక్కు దావత్‌లు.. ఏందోఏమో ఈళ్ల కథలు? ఈ శ్రీధర్‌కి చెప్పాలే.. పైసలు కాపాయం చేసుకోమ్మని. మొన్ననే ఆళ్ల అయ్యకు గుండె ఆపరేషన్ చేయించిండు. తమ్ముడ్ని హైదరాబాద్‌ల సదివిస్తుండు. బొంబైల చెల్లె ఉంటది. ఆ బావగాడు పెద్ద ఫాల్తుగాడు. ఈడ కష్టపడి పనిజేస్కుంట శ్రీధర్ .. ఊర్లె రెండకెరాల పొలం కొనుక్కున్నడు. కరెక్టుగా రిజిస్ట్రేషన్ రేపనంగా గద్దలెక్క అచ్చిండు పెండ్లాంను తోల్కొని బావగాడు. ‘‘బిజినెస్‌ల లాస్ అచ్చింది. అప్పులోల్లు ఇంటిమీదికి అస్తుండ్రు.. పురుగుల మందే గతి’’ అనుకుంట. పాపం జేస్తడు శ్రీధర్? అయింత పొలం క్యాన్సల్ జేసుకొని ఆ పైసలు బావ చేతిల పోషిండు’’అని శ్రీధర్ కష్టాలు తలుచుకుంటూ!
‘‘రాజేష్.. నాలుగు గ్లాసులే పెట్టినవేంది? నీదేది?’’ అడిగాడు మల్లేష్.. ఫిష్ పీస్‌ను నోట్లోవేసుకొని గ్లాసుల్లో మందు పోస్తూ!
‘‘నాకు గురువారం ఒక్కపొద్దు మల్లేషన్నా... ’’ అన్నాడు బాయిల్డ్ కూరగాయ ముక్కలు తింటూ!
‘‘ఏ.. తియ్.. ముసలోడిలెక్క గురువారం ఒక్కపొద్దు.. ఏంది?’’ అని రాజేష్‌ను చనువుగా గదమాయిస్తూ.. ‘‘ఏ మల్లేష్.. పొయ్యవయ్యా... రాజేష్‌కి కూడా మందు వొయ్యి’’అని పురమాయించాడు గంగాధర్.
‘‘వద్దన్నా.. నిజంగానే నాకు ఒక్కపొద్దు...’’ మందుపోసిన స్టీల్ గ్లాస్‌ను ఇస్తుంటే గాబరాగా వారించాడు రాజేష్.
‘‘దుబాయ్‌ల ఏం గురువారం? అచ్ఛ.. ఇప్పుడు టైమ్ ఎంతవయా?’’ అడిగాడు గంగాధర్‌ను మల్లేష్.
‘‘పదిన్నర’’ వాచ్ చూసుకుంటూ చెప్పాడు జాన్.
‘‘ఇంకేంది ఒక్కపొద్దు ఇడిషే టైమ్ అయిపోయినట్టే.. అరే ముక్కేసుకో.. చుక్కేసుకో భాయ్’’ ఆటపట్టిస్తూ మల్లేష్.
‘‘అవును రాజేష్.. ఈడ పదిన్నర అంటే ఇండియాలో పన్నెండు కదా.. ఇయ్యాల్టి దినం ఎల్లిపోయినట్టే.. అంటే శుక్రవారం కింద లెక్క’’ నచ్చజెప్పాడు శ్రీధర్.
‘‘ఏందివయా.. నవ్వు సూత ఆల్లతోనే కల్సినవ్’’ చిన్నగా విసుక్కుంటూ రాజేష్.
‘‘ఆ.... సాయిబాబా ఏమనుకోడు తియ్’’ గంగాధర్.
‘‘దేవుడు ఏమనుకోడే.. నా పెండ్లాంకు తెలిస్తే మనసు చిన్నగా చేసుకుంటది’’ అన్నాడు రాజేష్.
అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరి మనసులూ ఒక్కసారిగా సొంతూళ్లకు వెళ్లిపోయాయి. అందరికీ తమ కుటుంబాలూ తలపుల్లోకి వచ్చాయి. చాలాసేపు నిశ్శబ్దం.. ఎవరి జ్ఞాపకాల్లో వాళ్లు ఉండడం వల్ల.
‘‘అన్నా... క్రిస్మస్‌కు ఇండియా పోతున్నా.. ఇంటికేమన్నా తీస్కపోవాల్నా ’’ భారంగా ఉన్న ఆ వాతావరణాన్ని తేలిక చేయడానికి అన్నాడు జాన్.
‘‘అరే..ఇప్పుడు చెప్తున్నవా? తీస్కపోవుడే.. ఖాళీ చేతులతో ఎట్ల పంపిస్తం నిన్ను ?’’ సరదాగా శ్రీధర్.
ఇంకా తన జ్ఞాపకాల్లోంచి బయటకు రాని గంగాధర్.. ‘‘రాజేష్.. నీకు తెల్సా.. పెండ్లయిన కొత్తల్నే నాకు మస్కట్ వీసా అచ్చిండే. మీ వదినకు నేను మస్కట్ పోవుడు అస్సలు ఇష్టంలేకుండే. మా ఆయన మస్కట్ వీసా క్యాన్సల్ అయితే శనివారం ఒక్కపొద్దుంటా అని దేవుడికి మొక్కుకుంది. ఒక వారం పట్టిందేమో ఒక్కపొద్దు గంతే.. ఆ మల్ల వారమే వీసా పక్కా అయింది. ఇగ జూస్కో మీ వదిన బాధ.. దేవుడికి గింత సుత కనికరం లేదని ఒకటే ఏడుపు. అరే.. ఏదైనా మనమంచికే. నేను మస్కట్‌వోతనే నాలుగు పైసలు పుడ్తయని దేవుడు నీ మొక్కు విన్లేదేమోనే అని జెప్పిన’’ అంటూ తన యాదిని పంచుకున్నాడు.
‘‘అప్పుడు వదిన ఏం అన్నదో తెల్సా.. అయితే నేను ఇడుస్తా.. నువ్వు పట్టు మల్లా వారం నుంచి ఒక్కపొద్దు అని మనోడితోని ఒట్టు కూడా ఏయించుకుంది’’ పూర్తి చేశాడు మల్లేష్.
అందరూ ఒకటే నవ్వు.
‘‘పట్టిండా మల్ల?’’ శ్రీధర్ ఆత్రం.
‘‘ఎందుకు వట్టలే.. మంచిగ. మస్కట్‌ల మేమిద్దరమే కదా కల్సి ఉన్నం. శనివారం పడ్తుండే. పాపమనిపిస్తుండే తన అవస్థ చూసి. పొద్దునంత తినకుండా ఉపాసముంటే ఎర్రటెండల శోషొచ్చి పడుడు ఖాయమని పట్టపగలు తింటుండే. మస్కన్నే లేచి.. వండుకొని టిఫిన్‌కట్టుకొని సైట్ మీదకు వోతే.. మనోడు టిఫిన్‌మూత తీషేటాళ్లకు అది పాశిపోయి.. నీళ్లకు నీళ్లు అయితుండే ఆ ఎండకు’’ బాధగా చెప్పాడు మల్లేష్.
ఒకరు గంగాధర్ భుజం తడితే ఇంకొకరు వీపు తట్టారు.. మరొకరు అతని భుజం మీద తలపెట్టారు.. మల్లేష్ అయితే గంగాధర్‌ను గట్టిగా వాటేసుకున్నాడు.
అందరి కళ్లల్లో నీటి చెమ్మ. అలాంటి కష్టాలను అక్కడున్న అయిదుగురూ దాటారు.. ఇంకా అనుభవిస్తున్నారు కూడా!
‘‘ఇంతకీ రాజేష్.. నువ్వెందుకు ఒక్కపొద్దు పట్టినవో చెప్పవా?’’ అడిగాడు జాన్.
‘‘మా అక్కకు పానం బాలేనప్పుడు పట్టినం మేమిద్దరం’’ చెప్పాడు రాజేష్.
‘‘ఇప్పుడు నువ్వు చికెన్ తిని, మందు తాగంగనే ఏంగాదు’’ అని అంటూనే ‘‘అరే.. మాటలల్ల మర్శేపోయినం.. టైమెంతయింది?’’ అడిగాడు గంగాధర్.
‘‘పన్నెండు’’ చెప్పాడు శ్రీధర్ టైమ్ చూస్తూ!
‘‘ఇంకేంది ఈడ సూత దినమెల్లిపోయినట్టే.. చీర్స్’’ అన్నాడు మల్లేష్ ఉత్సాహంగా.
మందు గ్లాస్ పెదవుల దగ్గరపెట్టుకుంటూ అనుకున్నాడు రాజేష్.. ‘‘అక్క పానం బాగుండాల. ఆమెకోసమే కాదు.. మా కోసం కూడా. ఆమె ఏ కొంచెం కిందిమీదచేసినా ఆల్ల అత్తగారు ఇంట్ల దిగవెడ్తరు. నా పెండ్లాం మిషీన్ కుట్టుడే కాకుండా రాత్రిపూట బీడీలు చేసుడూ మొదలువెట్టాలే.. నేనీడ ఓటీ స్టార్ట్ జెయ్యాలే’’అని.
ఒక్కపొద్దు
Published Sun, Dec 22 2019 12:47 AM | Last Updated on Sun, Dec 22 2019 12:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment