మంచి చలికాలం.. అమావాస్య రాత్రి... పన్నెండు దాటి ఒక్కనిముషం..
ఆ ఊళ్లో ఎవరిళ్లల్లో వాళ్లే ఉన్నా.. ఎవ్వరికీ కంటి మీద కునుకు లేదు. ఈ అమావాస్య.. ఏ ఇంటి తలుపు మీద దరువు పడ్తుందో? ఎవరికి మూడుతుందోననే భయం.. ఊళ్లో వాళ్ల నిద్రలేమికి కారణం. దుప్పట్లో దూరి భయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ల వల్ల కావడంలేదు. గడియారం సెకన్ల ముల్లు చప్పుడుతోపాటు తమ గుండె చప్పుడూ వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది.
ఊహ తెలియని పిల్లలు మాత్రమే ఆదమరిచి నిద్రపోతున్నారు. అనుకున్నట్టే.. ఒక వీధిలోని తలుపు మీద దరువు మొదలైంది. ఎంతలా అంటే ఆ ఊరంతటికీ వినిపించేంత. ఆ ఊళ్లోని చెట్టు, చేమ, కొండ, గుట్టా కదిలేంతగా.. వాగువంకలు ఉలిక్కిపడి తమ ప్రవాహాన్ని ఆపుకొనేంతగా!
అలా ఆ ఇంటి తలుపు మోగుతూనే ఉంది... పది నిమిషాలదాకా! అల్లకల్లోలం ఆ పదినిమిషాల కాలం.
మోత ఆగిపోయాక.. తలుపు తెరుచుకుంది. యాభై ఏళ్ల మనిషి బయటకు వచ్చాడు.
వాకిట్లో ఓ విచిత్రమైన ఆకారం. నేలను ఊడుస్తున్న జుట్టు.. మర్రి ఊడలకు మల్లె జడలు కట్టి.
కళ్లల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. లావుపాటి పెదవులు... విశాలమైన నుదుటి మీద పడమటి సూర్యుడు లాంటి బొట్టు!
ఆ మనిషిని చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. తలుపు తెరుచుకొని వచ్చిన వ్యక్తి పరిస్థితీ అలాగే ఉంది. ఇప్పటిదాకా ఆ ఊళ్లో వాళ్లెవరూ వాకిట్లో నిలబడ్డ ఆకారాన్ని చూడలేదు.. చూసే అవకాశం రాలేదు. తలుపు మీద దరువు పడ్డ ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తులు తప్ప. ఆ వ్యక్తులు ఈ మనిషి గురించి ఊళ్లో వాళ్లకు వర్ణించి చెప్పే అవకాశం రాలేదు. వాళ్లెవరూ ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరలేదు కాబట్టి.
ఆ దరువు ఆగిన తర్వాత వాకిట్లో ఓ ఆకారం ప్రత్యక్షమవుతుందని.. అసలు ఆ దరువు వేస్తోంది ఆ ఆకారమే అని కూడా ఎవరికీ తెలియదు.
దరువు అంటే భయం.. ఆ ఇంట్లో మనుషుల తప్పులు ఎంచే టైమ్ వచ్చిందని. ఆ తప్పులు చేసిన వాళ్లే తమ తప్పును గ్రహించి.. బయటకు రావాలని.. అలా వెళ్లిన వాళ్లకు అవే ఆఖరు ఘడియలని మాత్రమే తెలుసు. అందుకే అందరికీ అమావాస్య రాత్రవుతుందంటే భయం.. తెల్లవారుతుందంటే భయం!
ఊరి నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ దగ్గర శవం పడి ఉంటుంది... అప్పుడు తెలుస్తుంది.. కిందటి రాత్రి ఎవరికి మూడిందోనని!
వాకిట్లో ఆకారం గిర్రున తిరిగి ముందుకు నడవసాగింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి మారు మాట్లాడకుండా.. ఆ ఆకారాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు.
‘‘ఏమేం చేశావ్?’’ కటువుగా, కరుకుగా అడిగింది ఆకారం.
‘‘చాలా చేశాను. పెద్ద కులం వాడిననే గర్వంతో నేను పనిచేసే.. నా దగ్గర పనిచేసే వాళ్లను కించపరిచాను. ఆడవాళ్లను చులకనగా చూశాను. పిల్లల్నీ హింసించాను. డబ్బులు వడ్డీలకు ఇచ్చి.. వాళ్ల రక్తం తాగాను. సంపాదన విషయంలో ఏనాడూ న్యాయంగా ఆలోచించలేదు.. ప్రవర్తించనూ లేదు. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా అలా అన్యాయంగా తీసుకున్నదే’’ మరబొమ్మలా చెప్పుకుపోతున్నాడు ఆ వ్యక్తి.
‘‘ఇవన్నీ పాతవి. మరి కొత్తది?’’ అదే కటువు, కరుకు స్వరం గద్దించింది.
‘‘ఒక పదిహేనేళ్ల పిల్లను.. ’’ ఆపాడు.
అప్పటిదాకా ఏదో ట్రాన్స్‌లోంచి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా చుట్టుపక్కలంతా చూశాడు.
ఊరి నడిబొడ్డు అయిన క్లాక్ టవర్..
‘‘ఇందాకే కదా.. నా ఇంటిముందున్నా.. అంతలోకే ఇక్కడికెలా వచ్చాను’’ అనుకుంటూ అంతెత్తున ఉన్న క్లాక్ టవర్ వైపు చూశాడు. మెదడులేకుండా.. ఖాళీగా ఉన్న మనిషి పుర్రెలా అనిపించింది.. కనిపించింది క్లాక్‌టవర్ లేని ఆ చోటు.
వణికిపోయాడు. పెదవులు తడారిపోతున్నాయి.
ఆ ఆకారం గిర్రున్న వెనక్కి తిరిగింది.
ఆ రూపం.. తన కళ్లముందు స్పష్టంగా కనిపించే సరికి అతని శరీరంలో వణుకు మరింత ఎక్కువైంది.
‘‘నీ.. నీ.. నీళ్లు.. క్కక్కక్కక్కావాలి... ’’ అడిగాడు కంపిస్తున్న స్వరంతో.
అతని ఎదురుగా ఉన్న ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. చింతనిప్పుల్లాంటి కళ్లను పెద్దవి చేసి చూసింది.
‘ఎఎఎఎఎఎవరు నువ్వు?’’ జారిపోతున్న ధైర్యాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నంతో అడిగారు.
భీకరంగా నవ్వింది ఆ ఆకారం. క్లాక్ లేని టవర్ వైపు తలతిప్పి చూసి.. మళ్లీ ఆ వ్యక్తి వంక దృష్టి మరల్చుతూ అన్నది.. ‘‘కాలాన్ని’’ అని.
ఆ వ్యక్తిలో చిక్కుబడిన కాస్త ధైర్యమూ చటుక్కున పారిపోయింది.
‘‘న్నన్నన్నన్నన్నన్ను ఏం చ్చే...చ్చేచ్చే.. చ్చేయోద్దు..ప్లీజ్’’ బట్ట తల నుంచి చెమటలు వరదలు కట్టాయి అతనికి.
మళ్లీ భీకరంగా నవ్విందా ఆకారం.. నోరంతా తెరిచి. తెరిచిన నోరు.. అలాగే ఉంచింది.. మూయలేదు! అర్థమైంది ఎదురుగా ఉన్న మనిషికి.
మోకాళ్ల మీద కూర్చోని ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు.. నా భార్య, పిల్లలు దిక్కులేని వాళ్లవుతారు. ఇక నుంచి బుద్ధిగా ఉంటా..ప్లీజ్.. అంటూ.
మళ్లీ వికటాట్టహాసం.. తెరలు తెరలుగా!
‘‘ఇలాంటి వేడుకోళ్లు, ప్రార్థనలు నీకూ ఎదురైన జ్ఞాపకం ఉందా?’’ ఆ ఆకారం అదే కరుకుదనంతో.
‘‘ఉంది.. ప్లీప్లీప్లీజ్.. ’’అంటూ ఆ ఆకారం కాళ్ల మీద పడబోయి షాక్ అయ్యాడు. అంత దుఃఖమూ మాయమైపోయింది ఆ షాక్‌కి.
ఆ ఆకారం.. నేల మీద నిలబడి లేదు. గాల్లో ఉంది. నేల మీదున్నట్టు భ్రమపడ్డడాడు.
గ్రహించినట్టుంది ఆ ఆకారం .. ‘‘కాలాన్ని కదా.. చేతికి చిక్కినట్టే కనపడ్తాను.. కాని నా ఆనవాలును కూడా పట్టుకోలేరు మీరు’’ అంది వ్యంగ్యంగా.
చటుక్కున లేచి పరుగెత్తాడు అక్కడి నుంచి పారిపోవాలని. వెనక్కి తిరిగి చూస్తూ మరీ ముందుకు ఉరకసాగాడు.
ఉన్న చోటు నుంచి ఆ ఆకారం ఒక్క అంగుళం కూడా కదల్లేదు.
అతను పరుగుపెడ్తూనే ఉన్నాడు.. పెడ్తూనే ఉన్నాడు. ఎన్నో కోసులు.. పరుగెత్తి పరుగెత్తి అలుపొచ్చి.. సొమ్మసిల్లబోతూ ఒక చోట ఆగాడు. ఆయాసం తీర్చుకునేందుకు.. కాస్త వంగాడు. మెలిపెడ్తున్న కడుపును కుడిచేతి గుప్పిట్లో పట్టుకుంటూ తలను కాస్త పైకెత్తాడు. ఎదురుగా టవర్.. క్లాక్ లేకుండా.. మెదడు లేని పుర్రెను తలపిస్తూ!
భయం.. తలలో బాంబు పేలి.. ఆ శబ్దం చెవుల గుండా వెళ్తూన్నట్టుగా!
తనకెదురుగా చూశాడు.. అదే ఆకారం.. నోరు తెరిచి.. కర్కశంగా నవ్వుతూ!
అంతే బిక్కచచ్చిపోయాడు ఆ వ్యక్తి!
ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు.
తెల్లవారింది...
ఊళ్లోని క్లాక్ టవర్ నాలుగు గంటలు కొట్టింది.
ఊళ్లోని తలుపులన్నీ దాదాపు ఒక్కసారిగా తెరుచుకున్నాయ్. దరువు పడిన ఇంటి తలుపులు కూడా. ఆ ఇల్లాలు.. గుండెలు బాదుకుంటూ ఉరకసాగింది ఊరి నడిబొడ్డు వైపు.. ఆమె వెనకాలే ఊరి జనం.
టవర్ ముందు తల పగిలి.. కడుపు చీరి.. పడున్న తన భర్తను చూసి స్థాణువైంది.
జనాలకూ నోట మాటరాలేదు. ప్రతి అమావాస్య తెల్లవారి చూసే దృశ్యమే అయినా!
ఆ గుంపులో ఓ వ్యక్తి.. ఆ ఊరికి కొత్తగా వచ్చిన యువకుడు..ఎందుకో క్లాక్ టవర్ వంక చూశాడు. ఆ గడియారం మీద రక్తం మరకలు!
- సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment