పిల్లలను ఆటలు ఆడుకోనివ్వండి..! | Telugu Horror Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

పిల్లలను ఆటలు ఆడుకోనివ్వండి..!

Published Sun, Oct 6 2019 9:21 AM | Last Updated on Sun, Oct 13 2019 9:37 AM

Telugu Horror Story In Sakshi Funday

సాయం సంధ్యవేళ.. 
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్‌ చేసుకుంటోంది వినూత్న. పదమూడేళ్లుంటాయి. ఎనిమిదో తరగతి చదువుతోంది.  ఫుట్‌బాల్‌లో అంటే పిచ్చి. ఆమె ఉన్న టీమ్‌కి ఓటమి ఉండదు. తల్లిదండ్రులేమో బిడ్డను మెడిసిన్‌ చదివించాలనే పట్టుదలతో ఉన్నారు. టేబుల్‌ మీద నోట్‌బుక్‌.. చేతిలో పెన్నుందే కాని పిల్ల  చిత్తం మాత్రం  గేట్‌ వైపు పరిగెడ్తోంది.  
సరిగ్గా అదే సమయానికి ఆ కాలనీలోనే ఇంకో ఇంట్లో కూడా ఇంచుమించు ఇదే దృశ్యం..

‘‘ఒరేయ్‌ ... దిక్కులు చూడ్డం మానేసి.. పుస్తకంలోకి చూడు. రేపటి అసైన్‌మెంట్‌లో ఒక్క మార్క్‌ తగ్గినా ఒళ్లు పేలిపోతుంది జాగ్రత్త.. ’’ తర్జనితో బెదిరిస్తూ ఓ అమ్మ. 
ఆ మాటలోని తీవ్రత, అమ్మ మొహంలోని సీరియస్‌నెస్‌ను చూసి భయంతో ‘‘సరే’’అన్నట్లుగా తలూపాడే కాని పదకొండేళ్ల ఆ పిల్లాడి మనసూ మెయిన్‌ డోర్‌ దగ్గరే తచ్చాడుతోంది. ఈ రెండిళ్లలోనే కాదు ఆ కాలనీలో పిల్లలున్న అన్ని ఇళ్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆ పిల్లల ఆసక్తి అంతా ఆ ఇళ్ల ప్రధాన ద్వారాలకేసే ఉంది. 
కావస్తోంది.. టైమ్‌ కావస్తోంది.. ద్వారాలు తెరుచుకోకుండా విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు పెద్దలు..
టైమ్‌ అయింది...

భళ్లున తెరుచుకున్నాయి గేట్లు.. తలుపులు! ఆ విసురుకు  అడ్డుగా పెట్టిన బంధనాలన్నీ చెల్లాచెదురయ్యాయి. 
ఓ ఇంట్లోకి ఫుట్‌బాల్‌ ప్రవేశించింది... ఒక ఇంట్లోకి క్రికెట్‌ బాల్‌.. ఇంకో ఇంట్లోకి టెన్నీ కాయిట్‌.. మరో ఇంట్లో టేబుల్‌ టెన్నిస్‌ బ్యాట్‌.. వేరే ఇంట్లో షటిల్‌ బ్యాట్‌.. ఆ పక్కింట్లోకి టెన్నిస్‌ ర్యాకెట్‌... అంతే పిల్లల్లో ఊపు.. అది ఇల్లు అన్న ధ్యాసే లేకుండా.. ఫుట్‌బాల్‌... వాలీబాల్‌.. షటిల్‌.. టీటీ.. టెన్నిస్‌..కబడ్డీ.. జిమ్నాస్టిక్స్‌.. చెస్‌... స్కిప్పింగ్‌.. ఖో ఖో, జంపింగ్‌.. రన్నింగ్‌.. ఎవరికి నచ్చిన ఆటను వాళ్లు ఆడుతున్నారు.  ఆ పిల్లలను పట్టడం పెద్దవాళ్ల వల్ల కావట్లేదు. 

అలా ఓ గంట.. గంటన్నర వీరంగం తర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేసినట్టుగా పిల్లలంతా  సోఫాల్లో.. కుర్చీల్లో సాగిలపడ్డారు.  చెమటతో తడిసి ముద్దయిపోయారు. 
ఆట వస్తువులన్నీ వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరయ్యాయి.. తలలు పట్టుక్కూర్చున్నారు  పెద్దలు!
అలిసిపోయిన పిల్లలు స్నానం చేసొచ్చి.. బుద్ధిగా పుస్తకాలు ముందేసుకొని చదువుకోసాగారు. రెండునెలలుగా ఆ కాలనీలో జరుగుతున్న తీరిది. 
ఆ ఆట వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయో.. ఎవరు పంపిస్తున్నారో తెలియదు. పోలీస్‌ కంప్లయింట్‌ కూడా ఇచ్చారు. అయినా  జాడ దొరకలేదు. నష్టమైతే జరగట్లేదు కదా.. పోనీండి ఆడుకోనివ్వండి పిల్లలను అని పోలీసులూ ఆ కేస్‌ను వదిలేశారు. 

తల్లిదండ్రులే పట్టువదలని విక్రమార్కుల్లా ఉన్నారు .. ఆ ఆరా తీయడానికి. వంతుల వారీగా అన్వేషణ  జట్లు తయారయ్యాయి పెద్దలవి. అయినా లాభం లేకపోయింది. విడివిడిగా ఎవరిళ్లల్లో వాళ్లు పిల్లలను ప్రశ్నించారు.. ‘‘ఆ ఆటవస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. మీరెందుకలా ప్రవర్తిస్తున్నారు?’’ అని. తెలియక.. తెల్ల మొహాలు వేశారు పిల్లలు. ఈ పిడుగులు  నాటకాలు ఆడుతున్నారు అని పెద్దలు పిల్లల మీద స్పైని పెట్టారు. పాపం.. పిల్లలు అమాయకులని తేల్చింది ఆ స్పై టీమ్‌. మరి ఈ ఆట ఆడిస్తున్నదెవరు? 
ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి అయింది. ఒంటి గంటకు.. షరామామూలుగా పెద్దల చెవుల్లో మోత.. భరించరాని మోత.. ఆ తర్వాత హెచ్చరిక.. 
‘‘మీ కాలనీ గ్రౌండ్‌లో కట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను కూల్చేస్తారా? లేదా?’’ ఇసుక.. మట్టి.. కలగలిపి డబ్బాలో వేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి స్వరంతో! 
దిగ్గున లేచి కూర్చున్నారంతా!

పదే పదే ఆ హెచ్చరిక.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి! ఇదేమీ పట్టని పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పెద్దవాళ్లకు మాత్రం నిద్ర లేదు!
అలాగే తెల్లవారి పోయింది. 
అరవై రోజులుగా ఇది నిత్యకృత్యమే అయినా ఆ రాత్రి హెచ్చరికెందుకో పెద్దవాళ్లందరిలో గుబులు రేపింది. పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోయాక.. ఆఫీసులు మానేసి మరీ కమ్యునిటీ హాల్లో సమావేశమయ్యారు. 
‘‘ నిన్న రాత్రి వార్నింగ్‌ కొంచెం భయంగా ఉంది’’ అంది ఓ తల్లి. 
‘‘అవును.. ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూలగొట్టించకపోతే మన ఇళ్లే కూలిపోతాయ్‌ అన్నట్టుగా ఉంది ’’ అన్నాడు ఓ తండ్రి. 
‘‘ఏం చేద్దాం?’’ కొంతమంది బయటకి అనేశారు కొంతమంది మనసులోనే ప్రశ్నించుకున్నారు. 
‘‘అసలప్పుడు ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టకుండా అడ్డుకుంటే అయిపోయేది!’’ విచారంగా అన్నాడు మరో తండ్రి. 

‘‘అవున్నిజమే. అక్కడ గ్రౌండ్‌ ఉన్నప్పుడు పిల్లలెంత సంతోషంగా ఉన్నారు? ఎంత హెల్తీగా ఉన్నారు?’’ ఓ తల్లి గతంలోకి వెళ్లింది. 
స్కూల్‌ నుంచి రాగానే బ్యాగ్‌లు పడేసి గ్రౌండ్‌కి వెళ్లిపోయే వాళ్లు. ఆడినంత ఆడి ఇంటికొచ్చే వారు ఆకలితో నకనకలాడుతూ. స్నానం చేసొచ్చి ఏది పెడితే అది ఆవురావురంటూ  తిని హోమ్‌ వర్క్‌ చేసుకొని పక్క మీద వాలిపోతే తెల్లవారి గంట కొట్టినట్టుగా కరెక్ట్‌ ఆరింటికి లేచేవాళ్లు.  మెతుకు మిగల్చకుండా టిఫిన్‌ బాక్స్‌ తిరిగొచ్చేది. టీవీ పెట్టినా చూసేవారు కాదు పిల్లలు. ప్రాజెక్ట్‌ వర్క్‌ కోసం తప్ప కంప్యూటర్‌ వైపు కన్నెత్తే వారు కాదు. ఫోన్స్‌తో ఆటే లేదు. ఫ్రెండ్స్‌.. ఆటలే వాళ్ల లోకం. ఏ పని చెప్పినా.. పరిగెత్తడమే. నిదానమైన నడకే లేదు. అసలు ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్లు? కాలనీ కూడా గలగల్లాడుతూ ఉండేది. అనుకోవద్దు కాని ఆ  గ్రౌండ్‌లో షాపింగ్‌ మాల్‌ వచ్చినప్పటి నుంచి కాలనీకి ప్రేత కళొచ్చేసింది. పిల్లల్లో మునుపటి ఉత్సాహం లేదు. వేళ్లాడిపోతూ.. కళ్ల కింద నల్లటి చారలతో పదేళ్లకే పాతికేళ్ల వాళ్లలా తయారవుతున్నారు. పెద్దాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిల్లలంతా తమ కళ్లముందే నిస్సత్తువతో నిర్జీవంగా.. అకాల వార్ధక్యాన్ని మోస్తూ తిరిగుతున్నట్టనిపించింది వాళ్లకు. మొహమొహాలు చూసుకున్నారు అంతా! 

‘‘అది చెప్పినట్టే చేద్దాం.. ఈ రాత్రికే ముహూర్తం పెట్టుకుందాం’’ ముక్త కంఠంతో అన్నారు. 
అదృశ్య శక్తేదో ఆదేశించినట్టు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ రాత్రి తాము చేయబోయే పనికి రంగం సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు. 
మరుసటి రోజు ఉదయం..
స్కూల్‌కి వెళ్లబోతున్న పిల్లలు తమ ఇళ్లకు ఎదురుగా  సూర్యుడి కిరణాలతో ఆడుకుంటున్న గ్రౌండ్‌ను చూసి షాక్‌ అయ్యారు. తేరుకొని పుస్తకాల సంచీని అక్కడే పడేసి సంతోషంతో కేరింతలు కొడుతూ ఆ గ్రౌండ్‌లోకి పరిగెత్తారంతా!
-సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement