కేఫ్‌.. కాఫీ | Horror Story By Saraswathi Rama In Sakshi Funday | Sakshi
Sakshi News home page

కేఫ్‌.. కాఫీ

Published Sun, Sep 8 2019 10:40 AM | Last Updated on Sun, Sep 8 2019 10:40 AM

Horror Story By Saraswathi Rama In Sakshi Funday

ఎప్పటిలా ఆ కెఫేలో అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మకరంద్‌. కేఫ్‌ అంతా కిక్కిరిసి ఉంది. చోటు లేదు. అసలే మనసు చెదిరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అతను చెప్పే నాలుగు మాటలతో ఊరట పొందుదామనుకుంటే..  నిలబడ్డానిక్కూడా జాగా దొరక్కపోయేసరికి మరింత చిరాకు పడింది మనసు. 
కేఫ్‌ బయటే.. ఫుట్‌ పాత్‌ మీద నిలబడి  షర్ట్‌ జేబులోంచి సిగరెట్‌ తీసి వెలిగించాడు. 

దమ్ములాగబోతున్న మకరంద్‌ నోట్లోంచి చటుక్కున సిగరెట్‌ లాగి అవతలపారేశాడు అతను. మకరంద్‌ కళ్లల్లో వెలుగు. అప్పటిదాకా ఆవహించి ఉన్న నైరాశ్యం ఒక్కసారిగా ఎగిరిపోయింది. 
‘‘ఎక్కడికెళ్లారు సర్‌.. కనిపించలేదు’’అంటూ అతనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు మకరంద్‌. 

‘‘ఎప్పుడూ ఉండే చోటే ఉన్నాను..’’ అంటూ మకరంద్‌ భుజాల చుట్టూ చేయి వేసి ఆ కుర్రాడిని లోపలికి తీసుకెళ్లాడు అతను. 
ఎప్పుడూ కూర్చునే చోట.. ఐసోలేటెడ్‌గా ఉన్న కార్నర్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నారిద్దరూ. 
‘‘ఇందాక ఈ టేబుల్‌ కూడా ఖాళీ లేదు సర్‌’’ అన్నాడు మకరంద్‌. 
‘‘సర్లే ఏంటీ విషయాలు?’’ అన్నాడు అతను. 

‘‘సర్‌.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అన్నాడు మకరంద్‌ ఒక్కసారిగా.. కళ్లనిండా నీళ్లతో. 
‘‘హూ... నీ నోటి నుంచి ఈ మాట వినకూడదనే కదా.. నీతో స్నేహం చేస్తోంది’’ నిట్టూర్చాడు అతను. 
‘‘లేదు సర్‌.. నాకింకే దారీ లేదు. ఈ డీల్‌ కుదిరి ప్రాజెక్ట్‌ వస్తుందేమోనని ఆశతో వెయిట్‌ చేశా. కాని రాలేదు. ఈ రోజే తేలింది. ఈ ప్రాజెక్ట్‌ తప్ప నా కష్టాలు తీరే ఇంకే ఆధారమూ లేదు నా దగ్గర. అదీ పోయింది. చావొక్కటే..’’ అంటూ టేబుల్‌ మీద రెండు చేతులను ఆనించి తల దాచుకున్నాడు మకరంద్‌. 
‘‘మకరంద్‌..’’ అంటూ ఆ అబ్బాయి  తల నిమిరాడు అతను. 

32 ఏళ్ల కుర్రాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో  చదివొచ్చాడు. మెరిట్‌ స్టూడెంట్‌. చిన్నవయసులోనే వ్యాపార మెలకువలను ఔపోసన పట్టాడు. 27 ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 

అలాంటి పిల్లాడు.. ఇప్పుడు.. ఇక్కడ బేలగా.. బతుకుంటే భయంతో చావడానికి సిద్ధంగా కనిపిస్తున్నాడు.  మకరంద్‌ను అలా చూస్తుంటే తన గతం గుర్తొచ్చింది అతనికి. 
అతనూ అంతే. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని కాదనుకొని కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. యువత తమ ఆలోచనలను తేనీటితో పదును పెట్టుకోవడానికి ప్రపంచంలోనే మొదటి వేదికను ప్రారంభించాడు. థాట్స్‌ విత్‌ టీ.. కాఫీ.. చైన్‌ షాప్స్‌ను ఓపెన్‌ చేశాడు. దేశంలోని యూత్‌ అంతా బాగా ఇష్టపడ్డారు. వ్యాపారం బాగా సాగింది. లోన్స్‌తీసుకొని మరీ స్ప్రెడ్‌ చేశాడు. ఆ కుర్రాడికి వచ్చిన పరిస్థితే తనకు వచ్చింది.. ఏం చేశాడు?

వెన్నులో వణుకుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడుతను. ‘‘ఈ పిల్లాడికి సాయం చేయాలి.. ’’ అనుకున్నాడు. 
కళ్లు తుడుచుకుంటూ తల పైకెత్తాడు మకరంద్‌. 
ఎదురుగా అతను లేడు. చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కుర్చీలోంచి లేచి అతణ్ణి వెతకడానికి ఎంట్రెన్స్‌ వైపు వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో ఒక లెటర్‌ కనిపించింది.. గాలికి ఎగిరిపోకుండా కాఫీ మగ్‌ పెట్టి. తీసుకుని చదువుకుంటూ బయటకు వెళ్లాడు. 

‘‘సర్‌.. ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను మీ కోసం.. లేట్‌ అయిందే?’’  తనకు ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కొని కూర్చుంట్ను వ్యక్తిని ఉద్దేశిస్తూ అంది వందన. 
‘‘ఇక్కడే ఉన్నాను వేరే పనుల్లో’’ అన్నాడు అతను. 
‘‘చెప్పమ్మా ఏంటీ విశేషాలు?’’ రెండు కాఫీలు ఆర్డర్‌ చేస్తూ అడిగాడు ఆ అమ్మాయిని. 
‘‘ఉద్యోగం పోయింది సర్‌’’ అతని కళ్లల్లోకి చూస్తూ చెప్పింది ఆమె. 
ఆ అమ్మాయి కళ్లల్లో దిగులు.

గత యేడాదిగా అతనికి పరిచయం ఆ పిల్ల. బాధ్యతగల అమ్మాయి. తాగుబోతు తండ్రి బాధ్యత మరిచిపోయి ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతుంటే.. ఉద్యోగం చేస్తూ ఇంటి పెద్ద బాధ్యతను మోస్తోంది. అలాంటి ధైర్యం గల అమ్మాయి  ఈ మాట అంటుందేంటి? షాక్‌ అయ్యాడు అతను. 
‘‘ఏమైందమ్మా’’ అనునయంగా అడిగాడు. 

అంతే ఆ కాస్త అనునయానికే కట్టలు తెంచుకుంది ఆమె దుఃఖం. రెండు చేతుల్లో మొహం దాచుకొని భోరుమంది. ఎమ్మెఎస్‌ కోసం తమ్ముడిని అమెరికా పంపడానికి లోన్‌ తీసుకొని మరీ డబ్బు సమకూర్చింది. వాటిని  దొంగతనం చేశాడు తండ్రి. ఆ సమస్యను గట్టెక్కలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటోంది వందన. 
తండ్రి వల్ల చిన్నప్పటి నుంచి తాము పడ్డ కష్టాలను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చి.. తేరుకొని  .. 

‘‘సారీ సర్‌.. ’’అంటూ ఎదురుగా చూసింది. 
ఖాళీగా ఉంది కుర్చీ. అతను లేడు.  ఎక్కడికెళ్లాడో అని చూడ్డానికి వెళ్లబోతుంటే అతను కూర్చున్న కుర్చీలో కాఫీ మగ్‌ కింద మడతపెట్టి ఉన్న ఒక కాగితం కనపించింది. తీసుకుంది ఆమె. 

‘‘నేను ఈ ఊరొచ్చినప్పుడల్లా భలే కాఫీ ఇప్పిస్తావ్‌ బాబూ..’’ కాఫీ సిప్‌ చేస్తూ అన్నాడు నర్సయ్య.
చిర్నవ్వుతో చూశాడు అతను. 
అంతలోకే చిన్నబుచ్చుకుంటూ  నర్సయ్య.. ‘‘ఏంటో బాబు... అప్పులు తప్ప  వ్యవసాయంలో ఏమీ మిగలట్లేదు. అవి తీర్చడానికి బతుకే తాకట్టుపెట్టాల్సి వస్తోంది..’’  అంటూ  తన జబ్బకున్న సంచీలోని పురుగుల మందు డబ్బాను తడుముకున్నాడు నర్సయ్య. 

‘‘అంత మాటంటున్నావ్‌ ఏంటి పెద్దాయనా?’’ గాబరాపడ్డాడు అతను. 
ఎప్పటి నుంచి దాచుకున్న వేదనో.. కళ్లలోంచి ఉబికి వచ్చి భుజం మీది కండువాలో మొహం దాచుకున్నాడు నర్సయ్య. ఆత్మాభిమానం తన ప్రెజెన్స్‌ను గుర్తుచేసినట్టుంది. కండువాతో మొహం తుడుచుకుంటూ చూశాడు. అతను లేడు. తన జబ్బకున్న సంచీ కూడా మాయం. కాని ఆ టేబుల్‌ మీద రికార్డర్‌ లాంటిదేదో కనపడింది. తీసుకున్నాడు నర్సయ్య. 

రెండు రోజుల తర్వాత..  కేఫ్‌లో.. 
మకరంద్, వందన, నర్సయలతోపాటు ఇంకో పదిమంది అతని కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఏ దిగులూ లేదు. సంతోషంగా ఉన్నారు. వాళ్లకున్న సమస్యలు ఇంకా తీరిపోలేదు. కాని తీర్చుకుంటామన్న ధైర్యం.. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్నారు. అందరి చేతుల్లో ఏవో గిఫ్ట్‌లు.. అతనికి ఇద్దామని. అంతలోకే వాళ్లకు ఆ కేఫ్‌లోని గోడ మీద ఆ వ్యక్తి ఫోటో కనిపించింది దండతో. 

షాక్‌ అయ్యారంతా! ఫోటోలోని అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఓ సర్వర్‌ను అడిగింది వందన... ‘‘అతను...’’ అంటూ! ‘‘మా బాస్‌.. యేడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.ఈరోజు ఆయన సంవత్సరీకం’’ చెప్పాడు సర్వర్‌. 
‘‘అంటే తనకు ఇచ్చిన ఉత్తరంలోని ఆత్మహత్య కథ ఇతనిదేనా?’’ అనుకుంది వందన. 
-సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement