చారులత వాళ్ల అమ్మ | Horror Story By Saraswathi Rama In Funday | Sakshi
Sakshi News home page

చారులత వాళ్ల అమ్మ

Published Sun, Aug 11 2019 12:34 PM | Last Updated on Sun, Aug 11 2019 12:35 PM

Horror Story By Saraswathi Rama In Funday - Sakshi

‘‘ఎదీ చూడనీ’’ అంటూ ఎర్రగా కందిపోయిన పదకొండేళ్ల  కూతురి లేత అరచేతులను తడిమింది తల్లి. ఆమె కళ్లల్లో నీళ్లను చూసిన చారులత  ‘‘ఏం కాలేదులే అమ్మా  ’’ అంటూ తన చేతులను విడిపించుకుంది. 
‘‘నీ కన్నా పెద్దవాడికి రోజూ కోడిగుడ్లు, మాంసం పెడుతూ ఆరోగ్యంగా పెంచుతున్నారు కదా! బరువైన పనులు వాడికి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నారు? చదువేమో వాడికి.. చాకిరి నీకా?’’ ఉక్రోషం ఆ తల్లి మాటల్లో!
‘‘నేనూ చదువుకుంటున్నా కదమ్మా నీ దగ్గర’’ తన రెండు చేతులతో తల్లిని గట్టిగా చుట్టేస్తూ  చారులత!
‘‘నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది చిట్టితల్లీ...’’ దుఃఖంతో తల్లి గొంతు పూడుకుపోయింది. 
‘‘మరెందుకు చేశావమ్మా?’’బాధతో కూతురి స్వరమూ వణికింది. ఆర్తిగా  కూతురిని హత్తుకుంది ఆ అమ్మ. 

‘‘ఒరే దివాకరం.. ఏదో మెసేజ్‌ వచ్చినట్టుంది కొంచెం చూడూ..’’అంటూ  వరండాలో కూర్చున్న పదమూడేళ్ల మనవడి దగ్గరకొచ్చాడు తాత. 
తన ఫోన్‌లో గేమ్‌ ఆడుతున్న దివాకరం తాతను పట్టించుకోలేదు.  అక్కడే ఆరుబయట గచ్చులో గిన్నెలు కడుగుతున్న చారులత తాత మాట  విన్నది. తన అన్న వైపు చూసింది. అసలు ఈ లోకంలోనే లేడు అన్న. మళ్లీ తన పనిలో తాను పడింది చారులత.
‘‘ఒరేయ్‌ నాన్నా.. నిన్నేరా...?’’ముద్దుగా పిలిచాడు ఇంకోసారి. 
ఈసారి తలెత్తి తాత వైపు చూశాడు దివాకర్‌. 
‘‘అబ్బా.. ఏంటి తాతా..?’’ విసుక్కున్నాడు వాడు.

‘‘ఇందాకా టింగ్‌ మందిరా ఫోన్‌. ఏదో మెసేజ్‌ వచ్చినట్టుంది చూసిపెట్టు నాన్నా..’’ బతిమాలుతూ తాత. 
‘‘బాబ్బాబూ.. చూసిపెట్టరా.. మీ నాన్న దగ్గర్నుంచి అయ్యుంటది’’  బియ్యం చెరగడానికి వరండాలోకొచ్చిన నానమ్మా  బతిమాలుతూ.  
విసురుగా తాత చేతిలోంచి ఫోన్‌ లాక్కున్నాడు దివాకర్‌. మెసేజ్‌ బాక్స్‌లోకి వెళ్లాడు. అన్‌రెడ్‌ మెసేజ్‌ తెరిచాడు. ఫోనెటిక్‌లో ఉంది ఆ సమాచారం. మైండ్‌లోనే కూడబలుక్కొని చదివాడు. ఒక్క ముక్క  అర్థమైతే ఒట్టు వాడికి.  
కడిగిన గిన్నెలను బుట్టలో వేసుకొని వంటింట్లోకి వెళ్తున్న చారులత గమనించింది అన్న అవస్థను. అయినా ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్లిపోయింది. 
ఇవతల తాత అడుగుతున్నాడు ‘‘మెసేజేనా? ఎక్కడి నుంచీ?’’అని. 
‘‘ఏదో  పనికిమాలిందిలే తాతా..’’ అంటూ ఫోన్‌ని ఆ ముసలాయనకిచ్చేసి మళ్లీ తన గేమ్‌లో పడిపోయాడు దివాకర్‌. 

రాత్రి ..
భోజనాలయ్యాక.. వంటిల్లంతా సర్దేసి టీవీ ఉన్న గదిలోకి వెళ్లింది చారులత. అప్పటికే నానమ్మ, తాత ఇద్దరూ టీవీలో లీనమయ్యారు. 
ఆ వృద్ధ జంట కంటపడకుండా నెమ్మదిగా అడుగులో అడుగువేసుకుంటూ వాళ్ల వెనకాల ఉన్న టీపాయ్‌ వైపు నడిచి దాని మీదున్న  ఫోన్‌ తీసుకొని మళ్లీ వంటగదిలోకి వెళ్లింది  చారులత. సాయంకాలం తన తాతకు వచ్చిన మెసేజ్‌ చూసింది. అది తన తండ్రి చేసిందే. సౌది అరేబియా నుంచి. ఎవరి ఫోన్‌ నుంచో పంపించాడు. లేబర్‌ క్యాంప్‌లోని అతని గదిలో ఫ్రెండ్స్‌ మధ్య జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలి వానై.. ఆ రూమ్మేట్స్‌లో ఒకరిని హత్యచేసేదాకా వెళ్లిందని, అందులో నిందితుడిగా అతనూ పోలీసులకు పట్టుబడ్డాడని, ఉద్యోగం పోయిందని, ఇక్కడి లాయర్‌తో ఎంబసీ వాళ్లతో మాట్లాడించి.. అక్కడ లాయర్‌ను ఏర్పాటు చేయించాలని ఆ మెసేజ్‌ సారాంశం. ఫోనెటిక్‌లోనే ఉంది.. వచ్చీరాని ఇంగ్లిష్, తెలుగు కలగలిపి.  
చదివి షాక్‌ అయింది చారులత.  వణుకుతున్న కాళ్లతో మళ్లీ ముందు గదిలోకి వచ్చి ఫోన్‌ను యథాస్థానంలో ఉంచింది.

ఈ విషయం నానమ్మ, తాతకు చెప్పాలా? వద్దా? అమ్మను అడిగితే సరి.. అనుకుంటూ చిన్న పడకగదిలాంటి తన గది దగ్గరకు వచ్చి తలుపు తెరిచెంది చారులత.  ‘‘బుమ్‌’’ అంటూ తలుపు చాటు నుంచి బిడ్డ ముందుకొచ్చింది అమ్మ భయపెడ్తున్నట్టుగా. 
 ‘‘అబ్బా.. అమ్మా.. నేనైమైనా చిన్నపిల్లనా?’’ 
‘‘అయితే భయపడలేదా?’’ అంటూ చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి చాప మీద చతికిల పడింది ఆ అమ్మ. 
‘‘ ఇంట్లోవాళ్లు భయపడ్తారు నీ గురించి తెలిస్తే..’’ అన్నది చారు..  తల్లి పక్కన తానూ చేరగిలపడుతూ!  
‘‘ఏంటలా ఉన్నావ్‌? ఆ మెసేజ్‌ గురించేనా దిగులు?’’అంది అమ్మ. అవునన్నట్టుగా తలూపింది చారులత. 
 నిట్టూరుస్తూ కూతురి పాదాలను తన ఒళ్లో పెట్టుకొని నెమ్మదిగా కాలివేళ్లను విరుస్తూ.. ‘‘మీ నాన్నకు పట్టాల్సిన గతే’’ అని.. అంతలోకే ఏదో గుర్తిచ్చినదానిలా  ‘‘అవునూ.. ఆడపిల్లవు నీకు చదువెందుకని వాడికి చదువు చెప్పిస్తున్నారు కదా.. కాన్వెంట్‌ స్కూల్లో వేసి మరీ! వాడికెందుకు అర్థంకాలేదు ఈ మెసేజ్‌?’’ అంటూ  కూతురిని ప్రశ్నించింది తల్లి. 
‘‘అన్నయ్యని తిట్టడం ఆపమ్మా’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే  ‘‘ఆపను. ఈ ఇంటి పరిస్థితిని నేను చక్కదిద్దకపోతే.. నీకు, రేపు ఈ ఇంటికి వచ్చే ఇంకో ఆడపిల్లకూ నా గతే పడ్తుంది’’ అన్నది కళ్లు పెద్దవి చేసుకుంటూ ఆ అమ్మ.

చారులతకు భయమేసింది.. ఒక్కసారిగా తల్లి ఒళ్లో ఉన్న తన కాళ్లను వెనక్కి లాక్కుంది. ఎప్పుడో అమ్మ చెప్పిన ఆమె గతం గుర్తుకురాసాగింది ఆ పిల్లకు. ఆ ఊళ్లో అమ్మ ఒక్కతే కాస్తోకూస్తో చదువుకుంది. తెలివైంది కూడా. చూడ్డానికీ చక్కగా ఉంటుంది. టెన్త్‌లో ఆ మండలానికే ఫస్ట్‌ వచ్చింది. ఇంకా చదువుకోవాలని.. అడ్వకేట్‌ కావాలని ఆశ పడింది. ఇంతలోకే దుబాయ్‌ నుంచి వచ్చిన నాన్న.. అమ్మను చూశాడు.. కట్నం లేకుండా పెళ్లి అన్నాడు.. నలుగురు ఆడపిల్లలో పెద్దయిన అమ్మకు ఆ సంబంధం రావడం వరమనుకున్నారు అమ్మమ్మ, తాత. ‘‘పెళ్లి వద్దు’’ అని అమ్మ మొరపెట్టుకున్నా వినకుండా పెళ్లిచేసేశారు. పెళ్లయ్యాక నాన్ననూ చాలా బతిమాలుకుంది అమ్మ.. చదువుకుంటానని. ‘‘ఆడపిల్లలకు చదువేంటి?’’ అని నానమ్మ, తాత కోప్పడ్డారు. నాన్ననూ కట్టడి చేశారు పెళ్లాం మాట వినొద్దని. పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే ఉంటానన్న నాన్నను బలవంతంగా మళ్లీ గల్ఫ్‌కి పంపేశారు. అమ్మను ఇంట్లో, పొలంలో పనిమనిషిని చేశారు. అన్నయ్య, తను పుట్టాక కూడా పట్టుబట్టింది అమ్మ.. ప్రైవేట్‌గా చదువుకుంటానని. పడనివ్వలేదు నానమ్మ, తాతలు. గొడవపడింది అమ్మ. అయినా పట్టు వీడలేదు ముసలాళ్లు. కనీసం కూతురునైనా  మంచి స్కూల్లో వేయిద్దామని నాన్నకు ఉత్తరాలు రాసింది. అమ్మవాళ్లు చెప్పినట్టే వినమని జవాబిచ్చాడు నాన్న. నానమ్మ, తాత తన విషయంలో కూడా మొండిగానే ఉన్నారు. ఆడపిల్లకు చదువొద్దని. తనను బడికి పంపించకుండా అమ్మతోపాటు పొలానికి పంపిస్తుంటే తట్టుకోలేని అమ్మ ఒకరోజు పొలంలోని బావిలో దూకి చనిపోయింది. 

‘‘చారూ.. ’’ అంటూ రెండు భుజాలు పట్టుకొని తల్లి ఊపేసరికి ఈ లోకంలోకి వచ్చింది చారులత. 
‘‘అమ్మా..’’ అంటూ కరుచుకుపోయింది ఆ పిల్ల. 
‘‘చారూ.. ’’  నానమ్మా పిలిచింది.  ‘‘అమ్మా.. నానమ్మ’’ అంది తల్లి నుంచి విడివడుతూ! 
‘‘అర్థమైంది.. పుస్తకం మూసేస్తావ్‌ కదూ’’అంది ఆ తల్లి దిగులుగా!
అవును అన్నట్టుగా తలూపుతూ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది చారులత.. ‘‘మీ నాన్న గురించి.. ’’ అని తల్లి ఏదో చెప్పబోతుంటే ‘‘నానమ్మ, తాతకు చెప్తాను.. వాళ్లు చూసుకుంటారులే ’’ అంటూ పుస్తకం మూసేసింది చారులత.
- సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement