దునియా అంతా గులామే కరోనాకు | Saraswathi Rama Telugu Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

గులామ్‌

Published Sun, Apr 12 2020 9:58 AM | Last Updated on Sun, Apr 12 2020 10:28 AM

Saraswathi Rama Telugu Story In Sakshi Funday

‘యేందో ఏమో. ఏడికివొయ్యి... ఏడికొస్తదో గిదంత!కొలువులు ఉండయ్‌.. యేడికెంచి అచ్చినోల్లు ఆడికి వోవాల్సిందే... అంటున్నరే....’ అన్న భర్త గొంతులోని  దిగులు వినపడింది భూలతకు.
‘పోనితియ్‌.. అందరం ఒక్కతాడ్నే ఉండచ్చు. గంజి అండుకున్నా కలిసి తాగుతమన్న తుర్తన్నా ఉంటది. ఎట్లయితే అట్లాయే.. గవన్ని మనసుల వెట్టుకొని రందిపడకు.. మంచిగుండు’ దుబయ్‌లో ఉన్న భర్తకు ఫోన్‌లో ధైర్యం చెప్పింది భూలత. 

‘ఊ... మీరు సుత పైలం.. అవ్వ, బాపు, పిల్లలు.. అందరూ పైలం..’ చెప్పి ఫోన్‌ కట్‌ చేసి... తన రూమ్మేట్స్‌ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మధుకర్‌ 
అప్పుడు దుబాయ్‌లో రాత్రి తొమ్మిది గంటలు..  కరోనా పరిస్థితులు  ఆ లేబర్‌ క్యాంప్‌లోని వాళ్లను  రోజూ రాత్రి అలా ఒక్కచోటికి చేరుస్తున్నాయి... రేపు ఎలా ఉంటుందో అన్న బెంగతో.  ఆ క్యాంప్‌లో మధుకర్‌తోపాటు అతని ఊరికే  చెందిన ఇద్దరు .. పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్‌.. ముగ్గురూ ఉన్నారు. 
బ్లాక్‌ టీ కాచుకొని.. నెమ్మది నెమ్మదిగా సిప్‌ చేస్తున్నారు  సొంత విషయాలు.. ఇంటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ.
ఫోన్‌ సంభాషణ ముగించుకొని వచ్చిన మధుకర్‌ను అడిగాడు సాయిలు.. ‘అంతా మంచిదేనటనా ఊర్లే?’ అని.

‘ఆ... ’ పొడిగా జవాబిచ్చాడు మధుకర్‌. 
అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. భాష రాకపోయినా భావం అర్థమై అబ్దుల్‌ కూడా సైలెంట్‌ అయిపోయాడు. 
‘భాయ్‌... హమారా ముల్క్‌ మే భీ సేమ్‌ సిట్యుయేషన్‌.. కరోనా సబ్‌ కో ఏక్‌ కర్‌రహా హై ’ అన్నాడు అబ్దుల్‌.
‘సచ్‌ హై... పూరీ  దునియాకో ఏక్‌ కర్రాహా హై... నో పాకిస్తాన్‌... నో ఇండియా... ముసల్‌మాన్‌... హిందూ... క్రిస్టియన్‌... సిక్‌.. సబ్‌ ఏక్‌ హో రహా హై...’ అన్నాడు కిషన్‌.
‘హోజానేదో... కమ్‌సే కమ్‌ ఇస్కీ  వజేసే.. యే దునియా ఇకట్టా హోరహీ హై...’ అన్నాడు సాయిలు నవ్వు ఆపి.. బ్లాక్‌ టీ సిప్‌ చేస్తూ..!
‘అరే... గప్పట్ల స్కైలాబ్‌తో కూడా గిదే పరేషానీ వచ్చినట్టుంది లే.. మా తాత చెప్తుండే గా ముచ్చట ’ అన్నాడు కిషన్‌. 
ఒక్కసారిగా అందరికీ కథలుగా విన్న స్కైలాబ్‌ సంగతులు గుర్తొచ్చినట్టున్నాయి. నవ్వులు ఆపేశారు. 
‘హౌ.. హమారే ముల్క్‌ మే భీ కిస్సా సునాతే రహెతే బడే లోగ్‌...’ అబ్దుల్‌.

‘ఔ.. స్కైలాబ్‌ పడేటప్పుడు మా బాపు పదేళ్ల పిల్లగాడట. గప్పట్లనే మా తాత మస్కట్‌ వోయిండట. మా ఊర్లెకెంచి మస్కట్‌ వోయినోల్లలో మా తాత ఒకడు. ముగ్గురేమో వోయిండ్రట.. గదీ ఓడల. ఇచిత్రమేందో ఎరికేనా... గాల్లు మస్కట్‌కు చేరిన వారం రోజులకే స్కైలాబ్‌ పడ్తుంది.. ప్రపచం మంత నాశనమైపోతుందనే ముచ్చట తెల్శిందట. మా తాతోల్లు గాదు కని..వేరేటోల్లు ఎట్ల ఓడల అచ్చినటమో అట్లనే ఓడల దేశం పారిపోదమని ట్రె సుత చేసిండ్రట. ఆల్లను జైల్లో వెట్టుడు.. ఈడున్నోల్లు ఆల్ల పేరుమీద కోళ్లు, గొర్రెలు కోస్క తినుడు .. మా తాత ఆల్ల మేనేజర్‌ను వట్టుకొని ఇంటికి ఉత్తరం రాయించిండట... మల్ల ఒకల్లనొకల్ల సూస్కుంటమో లేదో.. మస్కట్‌ వోతందుకు షేసిన అప్పు ఎగవెట్టమని.. పోషమ్మ కాడ యాటలు కోసి దావత్‌ చేస్కొమ్మని.. తన వంతుది కూడా ఆల్లనే దినమని.. గిట్ల గమ్మతి గమ్మతి మచ్చట్లతోని లెటర్‌ రాయించిడట. ఇంకో విషయం ఎరికేనా? గా స్కైలాబ్‌ యేడనో సముద్రంలో వడి.. ప్రపంచమంతా మంచిగనే ఉన్నది కదా. యాటలు, కోళ్లు కోస్కోని దావత్‌ చేస్కున్నోల్లు, అగ్వసగ్వకు పొలాలు అమ్ముకొని ఆ పైసలతోని తినితాగినోళ్లకు లాస్ట్‌కొస్తే అప్పులే మిగిలినై. గసుంటోళ్ల దాంట్ల మా మేనమామ సూత ఉన్నడు’ అంటూ కిషన్‌ ఇంకేదో చెప్పబోతుంటే.. ‘ఇంకో విషయం ఎరికేనా అన్నావ్‌..గది చెప్పు ముందుగల్ల’ అంటూ అడ్డు తగిలాడు మధుకర్‌.

‘గాడికే అస్తున్నా.. మస్కట్‌కి వోయిన అప్పు ఎగ్గొట్టమని మా తాత రాయించిన ఉత్తరంను మా నాన్నమ్మకు సదివి ఇనిపించిందెవరంటే.. మస్కట్‌వోతందకు మా తాతకు అప్పు ఇచ్చిన కోమటి శంకరే’ అంటూ నవ్వడం మొదలుపెట్టాడు కిషన్‌. 
మిగిలిన వాళ్లూ శ్రుతి కలిపారు. అర్థంకాని అబ్దుల్‌కు కిషనే ట్రాన్స్‌లేట్‌ చేశాడు విషయాన్ని. 
‘ఔ... శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌తోని .. మనూరి మీద కాల్వ పొయ్యేసరికి.. మస్తుమందికి భూమి  కొనుక్కోవాల్నని పట్టిందిలే. గందుకు మీ తాత మస్కట్‌ వోతే... మా తాత మా నాయనమ్మ పుస్తెలు అమ్మి భూమి కోసం బయాన వెట్టిండట. స్కైలాబ్‌ ఆపతి రాంగనే.. ఆ బయాన తీస్కున్నోడు ఆ కాయితం చింపేశిండట. తర్వాత బయాన్నే ఇయ్యలేదు అని ప్లేట్‌ ఫిరాయించేసరకి ఊర్లె ఉన్న మర్రికి ఉరేస్కున్నడట మా తాత’ అంటూ ఒక్కసారిగా మౌనంగా అయిపోయాడు సాయిలు. 

అందరూ సైలెంట్‌ అయిపోయారు. ఆ గంభీర పరిస్థితి అర్థమైన అబ్దుల్‌.. ‘అరే.. హమారా కహానీ జెరా అలగ్‌ హై’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.. ‘మీ నానమ్మ నగలు అమ్మి తాత పొలం కొంటే.. మా దాదీ మాకున్న గొర్రెలు, కోళ్లు అమ్మి నగలు చేయించమని తాత ప్రాణం తిన్నదట. అర్రే... నిఖా అయ్యి ఇన్నేండ్లయి ఒక్క నగ కూడా చేయించలేదు.. ఇప్పుడు అందరం సచ్చిపోయే దినమొచ్చే... ఇప్పుడన్నా ఒక్కటి చేయించు.. పెట్టుకొని సంతోషంగా ప్రాణం వదులుతా.. ’ అని మా తాతను నిద్రపోనివ్వలేదట మా దాది. 
‘మరి చేయించిండా?’ ఆత్రంగా అడిగాడు సాయిలు. 

‘చేయించక పోతే మా దాదీ ఊరుకుంటదా? చేయించిండు..గొర్రెలు గయాబ్‌.. స్కైలాబ్‌ గయాబ్‌.. అప్పు మిగిలింది. మా తాత పరిస్థితి సూడాల్నట అప్పుడు.. మా తాత వాళ్లమ్మ అమ్మి.. మా తాతను ఒక్కటే తిట్టుడట.. జోరు కా గులామ్‌ కైక అని’ చెప్పాడు అబ్దుల్‌. 
మళ్లీ నవ్వులు.
‘గిప్పుడు గీ కరోనా ఏం నౌబత్‌ తేనుందో మరి?’ నిట్టురుస్తూ అన్నాడు మధుకర్‌. 
‘గిప్పుడు దునియా అంతా గులామే కరోనాకు’ అన్నాడు కిషన్‌. 
అంగీకరి స్తున్నట్టుగా మిగిలిన వాళ్లంతా మౌనంగా ఉండిపోయారు నవ్వులు ఆపేసి. 
-సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement