బాబా.. నేను నానీని | Saraswathi Rama Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

బాబా.. నేను నానీని

Published Sun, Dec 15 2019 10:12 AM | Last Updated on Sun, Dec 15 2019 10:12 AM

Saraswathi Rama Story In Sakshi Funday

ఆ ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంది రెహాన్‌కి.  దాదాపు ఎనిమిదేళ్ల  తర్వాత నానిని చూడబోతున్నాడు. తనకు బాగా గుర్తు... చిన్న తమ్ముడు పుట్టినప్పుడు వచ్చింది నానీ తమ దగ్గరకి. అప్పుడు తనకు అయిదేళ్లనుకుంటా. అప్పటిదాకా అమ్మకూచిగా .. వెనకాలే తిరిగిన తను .. అమ్మ ఒళ్లోకి బుజ్జి తమ్ముడు రాగానే ఒక్కసారిగా అమ్మ అటెన్షన్‌కు దూరమై ఒంటరైపోయాడు. అప్పుడు పట్టుకుంది నాని.. తన  చేతిని. ఎంత భరోసా ఆ స్పర్శలో. అమ్మలాగే.. కాదు అమ్మే! ఎవరూ లేనప్పుడు ‘‘అమ్మీ’’ అనే పిలిచేవాడు. అలా పిలిచినప్పుడల్లా.. భయంతో అటూ ఇటూ చూసేది నానీ.. ఎవరైనా వింటున్నారేమోనని. అలా పిలిపించుకున్నందుకు నానీ వీపు మీద కొరడా మోతే. పిలిచినందుకు తనకూ   తన్నులే. నానీ భయం కూడా అదే.. తనెక్కడ దెబ్బలు తినాల్సివస్తుందేమోనని.  ‘‘బాబా.. నేను నానీని’’ అనేది. అవును నానీయే తన తోబుట్టువులకు. తనకు మాత్రం అమ్మే.. అనుకుంటూ కారు కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న పచ్చని పొలాలు. కొబ్బరి చెట్లను చూశాడు. 

ఎంత బాగుంది... అచ్చం తన బాల్యంలాగే పచ్చగా! చిన్నప్పుడు అంతా బాగుండేది.. ఇంట్లో నానీ ఉండేది కాబట్టి! మమా (అమ్మ), బాబా (నాన్న)కూడా బాగా ఉండేవాళ్లు. అక్కలు, అన్నలు, చెల్లెళ్లు.. చక్కగా ఉండేది ఇల్లు. చిన్నన్న, నడిపి అక్క ఎప్పుడు చూసినా తనతో గొడవపెట్టుకునేవారు. ఏడుస్తూ  నానీకి షికాయత్‌ చేసేవాడు. ‘‘పరాయివాళ్లు కాదుగా.. అక్కా, అన్నేగా అన్నది అంటూ కళ్లు తుడిచి ఖర్జూరాలతో చేసిన హల్వా తినిపించేది. తినేలోపు అక్క, అన్న మీద కోపం పోయేది.. కాదు మర్చిపోయేవాడు. అలా ఎదురు తిరిగే అలవాటే కాకుండా పోయింది. అన్నిటికి సర్దుకుపోయే తత్వం వచ్చేసింది. ఎంతలా అంటే..  తన నడిపి అక్క ఈడున్న అమ్మాయిని కొత్త మమాగా బాబా ఇంట్లోకి తెచ్చినా.. సర్దుకుపోయేంతగా! 

ఆ రోజు,.. జ్ఞాపకాల్లో  ఇంకా తాజాగానే ఉంది. హైదరాబాద్‌ నుంచే ఒక అమ్మాయిని తెచ్చాడు బాబా... నిఖా చేసుకొని. తనకన్నా పెద్దవాళ్లెవరికీ ఆశ్చర్యం కలగలేదు. మమాకు కూడా. తనెందుకు అంత బాధపడ్డాడు? ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ రాత్రి ఇంట్లో పార్టీ అయింది. ఒక్క ముక్క తింటే ఒట్టు. అందరూ పార్టీలో ఉంటే తను మాత్రం తన గదిలో ఏడుస్తూ కూర్చున్నాడు.భోజనం ప్లేట్‌తో నానీ తన గదిలోకి వచ్చింది.. ఆమెను చూడగానే పట్టుకొని ఏడ్చేశాడు వెక్కివెక్కి. మమా ఎందుకు ఏమీ పట్టనట్టు ఉందని నానీని అడిగాడు.  అప్పుడు చెప్పింది నానీ.. మమా కూడా  బాబా లైఫ్‌లోకి మూడో భార్యగా వచ్చిందని. అందుకే కొత్తమ్మాయి రావడం ఆమెకేమీ ఆశ్చర్యాన్ని, బాధను, ఇబ్బందినీ కలిగించట్లేదని. ఆ వయసులో అదంతా తనకు అర్థమయ్యీ కానట్టుగా ఉండింది. పెద్దక్క భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యేంత వరకు కూడా!  దించిన కారు కిటికీలోంచి సన్నని జల్లు చల్లగా మొహాన్ని తాకింది. నాని ఊరడింపును తలపించింది  ఆ  తుంపర స్పర్శ. ‘‘ఇంకా ఎంతదూరంలో ఉన్నాం?’’ అడిగాడు ట్యాక్సీ డ్రైవర్‌ను. 

‘‘ఆధా ఘంటా సాబ్‌’’ చెప్పాడు డ్రైవర్‌. విండో గ్లాస్‌ మూసేసి సీట్‌కి చేరగిలబడి తల వెనక్కి వాల్చుతూ కళ్లు మూసుకున్నాడు రెహాన్‌. ఊహ తెలిశాక.. ప్రీ యూనివర్శిటీ చదువుకోసం లండన్‌కు వెళ్లబోతూంటే  నానీ చెప్పిన, నానీకి తను చెప్పిన  మాటలు చెవుల్లో రింగుమంటూనే ఉంటాయ్‌ ఎప్పుడూ! 
వంటింటి గోడ చాటుగా ఉన్న నానీ దగ్గరకు వెళ్లాడు. అటూఇటూ చూసి చటుక్కున ఆమె కాళ్లకు దండం పెట్టాడు. 
‘‘బాబా..’’ అంటూ అదిరిపడింది నానీ. ఆమె కళ్లల్లో సుళ్లు తిరిగిన నీటిని ఎన్నటికీ ... ఎన్నటికీ మరిచిపోలేడు... ఆ  యాది ఇబ్బంది పెట్టినట్టుంది అతనికి కళ్లు తెరిచి ముందుకు వంగుతూ రెండు అరచేతులతో మొహం తుడుచుకుని.. అలాగే  తన చేతుల్లో మొహం దాచుకున్నాడు.

‘‘బాగా చదువుకో.. నువ్వనుకున్నది సాధించు. కాని.. మీ బాబాలాగా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకోవద్దు..’’ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది నానీ. ‘‘నానీ.. బాగా చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చేసుకొని.. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. ఒకటే పెళ్లి సరేనా..’’ కన్నుగీటుతూ కొంటెగా చెప్పాడు నానీతో.  ‘‘నిన్ను లండన్‌కు తీసుకెళ్లిపోతా.. నువ్వు నా దగ్గరే ఉండాలి.. నువ్వు నానీవి కాదు.. నాకు  మమావే’’ చెప్తూ  వెళ్లిపోయాడు.తల విదిలించి రెండు చేతులను జుట్టులోకి పోనిచ్చి... మెడ పైకెత్తాడు రెహాన్‌. తను లండన్‌ వెళ్లిన మూడు నెలలకే నానీని ఇండియా పంపించేసింది తన కుటుంబం. ఆమె  వెళ్లిపోయాక.. తనకూ దుబాయ్‌ రావాలని అనిపించలేదు. అక్కడే స్పానిష్‌ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఒక కొడుకు కూడా!  ఫోన్‌లో స్క్రీన్‌ సేవర్‌ మీదున్న తన ఫ్యామిలీపిక్‌ చూసుకుంటూండగా.. 

‘‘సాబ్‌.. వచ్చేసినం’’డ్రైవర్‌ మాట వినిపించింది. కారు విండోలోంచి చూశాడు. రేకుల షెడ్డు ముందు ఆగింది కారు.  వాకిట్లోని గట్టు మీద కూర్చుని .. కాళ్ల మధ్య అద్దం పెట్టుకొని.. తల దువ్వుకుంటూ కనిపించింది ఒక ముసలావిడ. గబగబా కారు దిగి.. ఆ దూరం నుంచే ఆమెను పోల్చుకున్నాడు. నానీయే! ఇంత వయసు మీదపడిందేంటి? అనుకుంటూ వడివడిగా ఆమె వైపు అడుగులు వేశాడు. కళ్ల ముందు ఆరడుగుల తెల్లటి ఆకారం కనిపించే సరికి పళ్ల మధ్య దువ్వెన పెట్టుకొని రెండు చేతులతో జుట్టు ముడివేసుకుంటూ లేచి నిలబడింది.

అద్దం జారి రెహాన్‌ కాళ్ల మీద పడింది.. ‘‘మమా..’’ అన్నాడు కొంచెం బాధతో!
ఆ మాటతో గుర్తుపట్టింది నానీ.. ‘‘బాబా’’ అంటూ! వంగి పాదం నులుముకుంటున్నవాడల్లా లేచి ‘‘నానీ.. గుర్తుపట్టావా?’’ అంటూ సంతోషంగా ఆమెను అక్కున చేర్చుకున్నాడు. 
ఆమెకు మాట కరువు. గట్టిగా పట్టేసుకుంది రేహాన్‌ను. ధారాపాతంగా ఆమె కంట కన్నీళ్లు. అలాగే అతణ్ణి  పొదివి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లింది. కుశల ప్రశ్నలయ్యాయి. ఫోన్‌లో తన కొడుకు ఫోటో చూపించాడు. 
‘‘పేరు?’’ అడిగింది నానీ. 
‘‘నానీ’’ అన్నాడు.
‘‘ఊ.. వీడి పేరు బాబా..?’’ రెట్టించింది నానీ. 
‘‘నానీ..’’ చెప్పాడు రెహాన్‌.
ఆమె కళ్లల్లో సంభ్రమాశ్చర్యం! 
- సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement