భజనలో తల తెగిన శరీరం | A Horror Telugu Story | Sakshi
Sakshi News home page

క్యాబిన్‌

Published Sun, Sep 22 2019 8:16 AM | Last Updated on Sun, Sep 22 2019 8:25 AM

A Horror Telugu Story - Sakshi

‘‘సర్‌.. సర్‌...’’ భుజం తట్టి లేపేసరికి మెలకువ వచ్చింది పరశురామ్‌కి. నిద్ర బరువుతోనే  కళ్లు తెరిచి చూశాడు. చేతిలో ఏదో పట్టుకొని ఓ పిల్లాడు.. మసక మసకగా కనిపించాడు. కళ్లు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. 
‘‘ చాయ్‌’’ అంటూ ఆ పిల్లాడు పరశురామ్‌ మొహం మీదకి చేయి చాపాడు. 
‘‘ఏయ్‌.. ఏందిది? ఎవరు నువ్వు’’ చిరాకు పడుతూ  నెమ్మదిగానే ఆ అబ్బాయి చేతిని పక్కకు తోశాడు. ఆ పిల్లాడు ఆ టీ గ్లాస్‌ను అక్కడే ఉన్న బల్ల మీద పెట్టి నవ్వుతూ వెళ్లిపోయాడు.  
 పొగలు గక్కుతోంది టీ!
 సందేహంగానే టీ గ్లాస్‌ చేతుల్లోకి తీసుకున్నాడు పరశురామ్‌.
ఓ గంటకు..
‘‘సర్‌...’’ అంటూ గుమ్మం దగ్గర్నుంచి పిలుపు వినిపించింది. 
ఖాకీ యూనిఫామ్‌ను సరిగ్గా సర్దుకొని ‘‘ఎవరూ?’’ అంటూ గుమ్మం వైపు నడిచాడు పరుశురామ్‌.
అక్కడ ఓ పదమూడేళ్ల పిల్ల.. చేతిలో టిఫిన్‌ ప్లేట్‌తో.
‘‘టిఫిన్‌’’ అంది అతని ముందుకు టిఫిన్‌ ప్లేట్‌ను చాస్తూ! 
‘‘ఎందుకు? అసలు మీరెవరు?’’ ఉదయం చిరాకు కొనసాగింది అతనిలో.
‘‘తెలీదు’’ అన్నట్టుగా చేయి తిప్పతూ లోపలికి పరిగెత్తింది ఆ పిల్ల.  టేబుల్‌ మీద టిఫిన్‌ ప్లేట్‌ పెట్టేసి అంతే వేగంగా బయటకూ వెళ్లిపోయింది ఆ అమ్మాయి. 
పరశురామ్‌కి ఏమీ అర్థం కాలేదు.

ఇంతలోకే ట్రైన్‌  సిగ్నల్స్‌ అందేసరికి క్లియరెన్స్‌ ఇవ్వడానికి ఎర్ర జెండా, పచ్చ జెండా పట్టుకొని క్యాబిన్‌ బాల్కనీలోకి వెళ్లాడు. 
క్యాబిన్‌మన్‌గా రెండు రోజుల కిందటే ఆ ఉద్యోగంలో చేరి.. ఆ ఊరికొచ్చాడు పరశురామ్‌.‘‘ఊరవతల అడవిలో ఒంటి స్తంభం మేడలా ఉంటుందంట క్యాబిన్‌.. ఒక్కడివే ఎలా ఉంటావురా..’’ అంటూ శోకాలతో సాగనంపారు  ఇంట్లో వాళ్లు.   అడవిలో క్యాబిన్‌ ఉన్న మాట వాస్తవమే కాని తన పెద్దవాళ్లు భయ పడినట్టుగా.. భయపెట్టినట్టుగా ఏమీ లేదు. 
మూడోరోజు.. ఇదిగో ఇలా టీ, టిఫిన్ల సర్వీసూ మొదలైంది.. అని అనుకుంటూండగానే మళ్లీ ఠక్కున ఆలోచన వచ్చింది పరశురామ్‌కి.. ‘‘ఇంతకీ ఆ పిల్లలు ఎవరు?’’ అని. 
రోజుకు మూడు ట్రైన్లు ఇటు వస్తాయి.. ఇంకో మూడు ఇటు నుంచి వెళ్తాయి.  ఆ పూట  రెండు ట్రైన్లకు  సిగ్నల్‌ ఇచ్చేసి వచ్చి.. మళ్లీ పడుకున్నాడు పరశురామ్‌. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు.. తలుపు దబదబా బాదిన చప్పుడు.. దిగ్గున లేచి కూర్చున్నాడు పరశురామ్‌.  వెళ్లి తలుపు తీశాడు. ఓ నలుగురైదుగురు అమ్మాయిలు, అబ్బాయిల గుంపు... ‘‘సర్‌  లంచ్‌’’ అంటూ విస్తరాకులో చుట్టి ఉన్న భోజనం ప్యాక్‌ను పరశురామ్‌ మొహం ముందు పెట్టాడు ఆ గుంపులోని ఓ అబ్బాయి.

వింతగా అనిపించింది పరశురామ్‌కి. ఆ ప్యాక్‌ను తీసుకుంటూ ‘‘ మీరంతా ఎవరు? పొద్దున్నుంచి చూస్తున్నా. వేళకు టీ, టిఫిన్, భోజనం తెచ్చిస్తున్నారెందుకు? వీటికి డబ్బులు ఎంత? అసలు ఎక్కడుంటారు మీరు?’’ అంటూ ప్రశ్నలు కురిపించాడు. 
ఆ మాటలకు నవ్వారు వాళ్లంతా. ‘‘సర్‌.. సాయం కాలం.. టీ, రాత్రి భోజనం కూడా తెస్తాం! ఆ.. అన్నట్టు ఈ రోజు రాత్రి ఒంటి గంటన్నరకు భజన ఉంటుంది.. మీ ఇంట్లోనే. దానికి పర్మిషన్‌ ఇవ్వండి చాలు.. ఈ సర్వీస్‌కి డబ్బులేం వద్దు’’ అంటూ వెళ్లిపోయారు
‘‘‘రెండు గంటలకు భజనేంటో’’ అనే అయోమయంతోనే  లోపలికి వచ్చాడు పరశురామ్‌. విస్తరాకు విప్పాడు.. తనకు ఇష్టమైన మటన్‌ బిర్యానీ. తిన్నాడు. అద్భుతంగా ఉంది! ఎన్నడూ అలాంటి రుచి చూడలేదు. ఒకలాంటి మత్తు ఆవహించింది. మళ్లీ పడుకున్నాడు. 
సాయంత్రం... నాలుగు గంటలు.. 
‘‘సర్‌.. సర్‌’’ అంటూ తన కాలు పట్టి ఎవరో లాగుతున్నట్టనిపిస్తే ఒక్కసారిగా కాలు విదిల్చుకుంటూ లేచి కూర్చున్నాడు పరశురామ్‌. 
ఎదురుగా పదేళ్ల పిల్లాడు.. ఉదయం టీ తెచ్చిచ్చిన పిల్లాడు. ఇప్పుడూ టీ గ్లాస్‌తో నిలబడి ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా టీ గ్లాస్‌ తీసుకొని చేతికున్న గడియారం చూసుకున్నాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది అతనికి. వెంటనే ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉన్న గదిలోకి వెళ్లి  స్టేషన్‌కు ఫోన్‌ చేశాడు. ‘‘ఏ.. అలా అడుగుతున్నావ్‌? సిగ్నల్‌ క్లియర్‌ చేసింది నువ్వే కదా..’’ అని జవాబు వచ్చింది అవతలి నుంచి. ‘‘ఆ.. ఆ’’ అంటూ ఫోన్‌ పెట్టేసి ముందు గదిలోకి వచ్చేసరికి ఆ పిల్లాడు లేడు. ‘‘నేను సిగ్నల్‌ క్లియర్‌ చేయడమేంటి? అయినా ఇంత మొద్దు నిద్ర ఎలా పట్టింది?’’ అనుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. తల దిమ్ముగా అనిపించింది. చేతిలో ఉన్న టీ గ్లాస్‌లోంచి నెమ్మదిగా టీ సిప్‌ చేశాడు. అమృతం ఇలాగే ఉంటుందేమో అనిపించింది అతనికి ఆ రుచి చూడగానే!

ఆ క్షణం నుంచి రాత్రి భోజనం కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టాడు. ఎనిమిదింటికి భోజనం వచ్చింది. తిన్నాడు. అదీ అంతే. అమోఘమైన రుచి! తిన్న వెంటనే నిద్ర రాబోతుంటే.. బలవంతంగా ఆపుకున్నాడు. మధ్యాహ్నం లాగా ట్రైన్‌ వెళ్లిపోతుందేమో అనే భయంతో! ఏదో పుస్తకం చదువుతూ కాలక్షేపం చేశాడు. సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు.. ఆ టైమ్‌లో కుడి వైపు నుంచి వచ్చే రైలుకి క్లియరెన్స్‌ ఇవ్వాలి. ఇచ్చి మళ్లీ లోపలికి వచ్చాడు. ఇక నిద్ర ఆగలేదు.. కమ్ముకు వచ్చింది. మళ్లీ ఒంటిగంటన్నర ట్రైన్‌కి సిగ్నల్‌ ఇవ్వాలి.  ఎంతకైనా మంచిది అనుకొని అలారం పెట్టుకుని.. అలాగే కుర్చీలో కునుకు కోసం ఒరిగాడు. రాత్రి ఒంటి గంటా పదిహేను నిమిషాలకు.. పెద్ద పెద్ద రాగాలకు మెలకువ వచ్చింది పరశురామ్‌కి. పెడబొబ్బల్లాగే ఉన్నాయి ఆ స్వరాలు. అంతకంతకూ ఆ రాగాలు తన క్యాబిన్‌ దగ్గరకే వచ్చాయి. అప్పుడు గుర్తొచ్చింది.. ‘‘భజన’’ సంగతి. వెళ్లి తలుపు తీశాడు. పిల్లా..పెద్దాతో కలిసి పన్నెండు మంది సమూహం. వాళ్లలో తనకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్‌ తెచ్చిన వాళ్లూ ఉన్నారు.

ప్రారంభమైంది భజన... బీభత్సంగా! ఆ కంఠస్వరాలకు ముందు జడుసుకున్నాడు పరశురామ్‌. రానురాను శ్రావ్యంగా.. చెవుల్లో తేనెలు పోసినట్టుగా మారిపోయాయి వాళ్ల గొంతులు. సమ్మోహితుడయ్యాడు అతను.  తెలియకుండానే తనూ వాళ్లతో గొంతు కలిపాడు. పారవశ్యంతో ఊగిపోయాడు.
ఒంటిగంటన్నర... ఎవరో తలుపు తట్టారు.. తన్మయత్వంతోనే వెళ్లి తలుపు తీశాడు.. ఎదురుగా ఓ యువకుడు.. నవ్వుతూ! అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి ఆ గుంపుతో ఆ యువకుడిని కలిపి..వాళ్ల గానమాధుర్యంలో ఊగిపోయాడు పరశురామ్‌. 
ఉదయం ఆరున్నర గంటలు..  
బయట ఏదో కలకలం..  చెవి పక్కనే పోరుపెటినట్టు్ట అనిపిస్తే కళ్లు తెరిచాడు పరశురామ్‌. ఆ కలకలం ఏడుపులుగా మారింది. మత్తు దిగినట్టయి ఠక్కున లేచి  కిందికి పరిగెత్తాడు. జనాల గుంపును తోసుకుంటూ పోలీసులున్న చోటికి  వెళ్లాడు.. అక్కడ  తల, మొండెం.. వేరై ఉంది ఓ శరీరం. చూసి.. బిగుసుకుపోయాడు పరశురామ్‌. ఆ తల.. ఆ తల.. రాత్రి.. తలుపు.. కుర్రాడు.. లీలగా అతని మస్తిష్కంలో మెదులుతోంది ఆ రూపం!
- సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement