చిన్నప్పుడు గోరుముద్దలు తిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వెన్నెలలో ఎంజాయ్ చేసేదాకా.. చందమామ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఇప్పటికే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అక్కడ ఇండ్లు కట్టుకుని ఉండిపోయే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. మరి అలాంటి చందమామపై బాంబులు పేలాయి తెలుసా? అదీ ఒకటీ రెండు సార్లు కాదు చాలా సార్లు. మరి ఎవరు బాంబులు వేశారు? ఎందుకు వేశారు? బాంబులు వేస్తే ఏం జరిగింది? బాంబులు వేయడమే కాకుండా ఇంకా ఏమేం చేశారు? అనే వివరాలు తెలుసుకుందామా?
చంద్రుడిపై అడుగుపెట్టి 52 ఏళ్లు
చందమామపై మనిషి అడుగుపెట్టి దాదాపు 52 ఏళ్లు అవుతోంది. 1969 జూలై 11న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేశాడు. అమెరికా నిర్వహించిన అపోలో ప్రయోగాలతో మొత్తంగా 24 మంది చందమామపైకి వెళ్లారు. చివరిగా 1972 డిసెంబర్ 19న చంద్రుడిపై గడిపారు. ఇలా వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై పలు రకాల పరిశోధనలు చేశారు. అక్కడి భూమి, వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి, ఇతర అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. చంద్రుడి మట్టి, రాళ్లను భూమిపైకి తీసుకువచ్చారు.
గోల్ఫ్ ఆడి.. ఎగిరి దుమికి..
చంద్రుడిపై వ్యోమగాములు ఏమేం చేశారో తెలుసా? అక్కడగోల్ఫ్ ఆడారు. ప్రఖ్యాత ‘హ్యామర్ అండ్ ఫెదర్ (పక్షి ఈకను, ఒక సుత్తి ని ఒకే ఎత్తు నుంచి వదిలి ఏది ముందు కింద పడుతుందో పరిశీలించడం)’ ప్రయోగాన్నీ చేశారు. గాల్లోకి ఎగిరి దూకారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? చంద్రుడిౖ గురుత్వాకర్షణ (గ్రావిటీ)ని పరీక్షించడానికి. ఇక రోవర్‌ను నడుపుకొంటూ తిరగడం, అక్కడి ఉపరితలంతోపాటు భూమిని, నక్షత్రాలను ఫొటోలు తీయడం వంటివీ చేశారు. వీటన్నింటితోపాటు చేసిన మరో పరీక్షే బాంబులు వేయడం. అదెందుకో చూద్దామా..
గ్రనేడ్లు, మోర్టార్లతో..
అమెరికా చేసిన అపోలో 14, అపోలో 16 ప్రయోగాల్లో చంద్రుడిపైకి గ్రెనేడ్లు, మోర్టార్లు పంపారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగిన ప్రదేశం నుంచి ఒకసారి కిలోమీటర్ దూరంలో, మరోసారి 3.5 కిలోమీటర్ల దూరంలో వాటిని పేల్చారు. రోవర్‌ను నడుపుకొంటూ వెళ్లి వాటిని అమర్చారు. ఇదంతా చంద్రుడి నేల నిర్మాణాన్ని పరిశీలించేందుకు చేపట్టిన ‘యాక్టివ్ సిస్మిక్ ఎక్స్‌పెరిమెంట్’లో భాగమే. బాంబులు పేలిన తర్వాత అక్కడి నేలలో ఏర్పడిన ప్రకంపనలను ప్రత్యేక పరికరాలతో నమోదు చేశారు. తర్వాత నాసా శాస్త్రవేత్తలు ఆ డేటాను విశ్లేషించి చంద్రుడి ఉపరితలం నిర్మాణాన్ని అంచనా వేశారు.
ప్రయోగాల్లో తేలింది ఏమిటి?
సాధారణంగా భూమిలో ఏర్పడిన ప్రకంపనలతో ప్రత్యేకమైన తరంగాలు (సిస్మిక్ వేవ్స్) ఏర్పడి.. నేల పొరల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు ఘన, ద్రవ పదార్థాలు, వివిధ మూలకాల ద్వారా వెళ్లేటప్పుడు వాటి వేగం, తీవ్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించి నేల పొరల్లో ఏముంది, ఎలా ఉన్నాయన్నది గుర్తిస్తారు.
► భూమ్మీద సహజంగానే భూకంపాలు వస్తుంటాయి కాబట్టి.. శాస్త్రవేత్తలు సులువుగానే విశ్లేషిస్తారు. అదే చంద్రుడి నేల స్థిరంగా ఉండటంతో ప్రకంపనలు అతి తక్కువ. అందువల్ల బాంబులతో ప్రకంపనలు సృష్టించి, పరిశీలించారు.
► బాంబులు పేల్చిన ప్రాంతంలో 1.4 కిలోమీటర్ల మందంతో బసాల్ట్ (భూమిపై ఉండే తరహాలో మట్టి, రాళ్లతో కూడిన) పొర ఉన్నట్టు గుర్తించారు. చంద్రుడి నేల లోపల చాలా వరకు పగుళ్లు ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై పడిన పెద్ద పెద్ద ఉల్కలే దీనికి కారణమని అంచనా వేశారు.
ఆ బాంబులు ఇప్పటికీ అక్కడే..
అపోలో 14 మిషన్లో 22 గ్రనేడ్లు, ఒక మోర్టార్ తీసుకెళ్లారు. అందులో 13 గ్రనేడ్లు మాత్రమే పేలాయి. అపోలో 16 మిషన్‌లో మరో 22 గ్రనేడ్లు, 4 మోర్టార్లు తీసుకెళ్లారు. ఇందులో 19 గ్రనేడ్లు, 3 మోర్టార్లు పేలాయి. రెండుసార్లు కలిపి 12 గ్రనేడ్లు, రెండు మోర్టార్లు అలాగే చంద్రుడిపై పడి ఉన్నాయి. వీటన్నింటిలో ‘హెక్సానైట్రోస్టిల్బేన్’ అనే పేలుడు పదార్థం ఉంది. దానికి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉండటంతో.. ఇప్పటికీ గ్రనేడ్లు, బాంబులు చంద్రుడిపై అలాగే ఉండి ఉంటాయని భావిస్తున్నారు.
రెండు దేశాలు.. ఏడు జెండాలు
చందమామపై రెండు దేశాల జెండాలు మాత్రమే ఉన్నాయి. ఆరు మిషన్లలో వేర్వేరు చోట్ల దిగిన అమెరికా వ్యోమగాములు ప్రతిసారి తమ దేశ జెండా ఒకదానిని పాతారు. తర్వాత చైనా తమ జెండాను చంద్రుడిపై పాతింది. అయితే చైనా వ్యోమగాములెవరూ చంద్రుడిపై దిగలేదు. కానీ రోవర్ ద్వారా పంపిన జెండాను పెట్టారు. ఇప్పటివరకు ఆరు ప్రయోగాల్లో చంద్రుడిపై మనుషులు దిగారు. అవన్నీ అమెరికా నిర్వహించిన అపోలో సిరీస్ మిషన్‌లే.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment