గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు? | Pranahita-Chevella project design!! | Sakshi
Sakshi News home page

గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?

Published Fri, Mar 11 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?

గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?

* కాళేశ్వరం ప్రతిపాదనపై అఖిలపక్ష నేతలు, ఉద్యమకారుల మండిపాటు
* గజ్వేల్, సిద్దిపేట కోసం రాష్ట్ర ప్రయోజనాలను సమాధి చేశారని విమర్శ

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దగ్గర్లోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అఖిలపక్ష నేతలు, జలసాధన సమితి, ప్రాజెక్టు పరిరక్షణ సమితి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల లబ్ధికోసం మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం సమాధి కడుతోందని విమర్శించారు.

ప్రాణహితకు అనుమతులన్నీ లభించి జాతీయ హోదా దక్కే సమయంలో డిజైన్ మార్పుతో  ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడమేనని అన్నారు. ఇప్పటికే జరిగిన ఒప్పందాలను విస్మరించి కొత్తగా రాష్ట్రానికి నష్టం కలిగేలా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమే అని ధ్వజమెత్తారు. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష నేతలు, జల సాధన సమితి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రాణహిత పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రతాప్, నీటి పారుదల రంగ నిపుణుడు సారంపల్లి మల్లారెడ్డిలు ఇందులో పాల్గొన్నారు.  
 
పరీవాహక జిల్లాలకే మొదటి హక్కు : టి.జీవన్‌రెడ్డి
‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 80 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. దీనిపై 2012లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. కానీ గత ఏడాది మహారా్రష్ట్ర గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారు.

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు చేశారు. నిజానికి గోదావరి పరీవాహకం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు గోదావరిపై మొదటి హక్కుంది. ఆ జిల్లాల అవసరాలు తీరాకే మెదక్‌కు నీటిని తరలించాలి. మెదక్ జిల్లాలో నిర్మించే  రిజర్వాయర్‌లను ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మించాలి. అలా కాకుండా ప్రతిపక్షాలు, మేధావుల సూచనలను పక్కనపెట్టి ఇష్టారీతి నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకోం’.
 
గ్రావిటీ వదిలి ఎత్తిపోతలా..: నైనాల గోవర్ధన్
‘మహారాష్ట్రతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంవల్ల గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రాష్ట్రం కోల్పోతుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలన్న నిర్ణయంతో అదనపు ఖర్చుతో పాటు అధిక విద్యుత్తు అవసరం. అదీగాక 152 మీటర్ల వద్ద మహారాష్ట్ర భూభాగంలో 1,852 ఎకరాలు మాత్రమే ముంపు ఉండగా, మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 3,075 ఎకరాల ముంపు ఉంటుంది. మహారాష్ట్ర అంత ముంపును ఎలా అంగీకరించిందో ప్రభుత్వం చెప్పాలి’.
 
కమీషన్ల కోసమే : యెన్నం
 ‘కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారు. ఆ డబ్బుతోనే జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు చేశారు’.
 
నాటకాలు ఆడుతున్నారు: రాజారాం యాదవ్
‘అధికారం రాకముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇప్పుడు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కూడబెట్టుకునేందుకు నాటకాలు ఆడుతున్నారు’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement