ప్రపంచంలో మొబైల్ ఫోన్లు మొదలై యాభై ఏళ్లయ్యింది. అవి ఇండియాలోకి ప్రవేశించి నలభై ఏళ్లయ్యింది. అప్పట్లో ఆ ఫోన్లు అడుగు పరిమాణంలో ఉండేవి. వాటితో కేవలం మాట్లాడగలం. మెసేజులు, ఫొటోలు పంపలేము. 1990లలో ఇండియాలో మొబైల్ సేవలు ఊపందుకున్నాయి. అప్పుడు కూడా ‘టాక్ టైమ్’ ఖరీదైన వ్యవహారం. కానీ తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి.
పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీచార్జ్, సర్వీస్ నెట్‌వర్క్‌ల విస్తరణ, స్థానిక తయారీ వంటివన్నీ కలిసి మొబైల్ ఫోన్ సేవలను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్!
ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్. భారతదేశం స్వాతంత్య్రం పొందిన పలు దశాబ్దాల తర్వాత సగటు కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలు సైకిల్, చేతి గడియారం, లేదా ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. 1960లు, 1970లలో నాలాగా భారత్‌లో పుట్టి పెరిగినవారు అప్పట్లో ఫోన్ కలిగి ఉండటం ఒక విలాసంగా ఉండేదని మీకు చెబుతారు.
టెలిఫోన్ కనెక్షన్ కోసం వేచి ఉండే సమయం అయిదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేది. ఫోన్ ఉన్న కుటుంబాలకు ఇరుగుపొరుగు వద్ద చాలా డిమాండ్ ఉండేది. తమ సంబంధీకుల కాల్స్ అందుకోవడానికి వారు ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకునేవారు. వారు ఆ నంబర్‌ను పీపీ (ప్రైవేట్ పార్టీ) అని పంచు కునేవారు. అనధికారికంగా తమ ఫోన్లను ఇతరులు వాడకుండా యజ మానులు వాటిని లాక్ చేసేవారు. (ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు స్క్రీన్ లాక్ లాగా అప్పుడు ఫోన్ డయలర్‌ని లాక్ చేసేవారు.)
నా తరం వారు నిజంగానే తమ జీవితకాలంలో లాండ్‌లైన్ ఫోన్ల నుంచి సర్వవ్యాపి అయిన స్మార్ట్ ఫోన్ల వరకు సంభవించిన సాంకేతిక వివ్లవానికి సాక్షీభూతులయ్యారు. మొబైల్ ఫోన్ ను 50 సంవత్సరాల క్రితమే ఆవిష్కరించారు. న్యూయార్క్‌లోని దాని ఆవిష్కర్త మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ కాల్‌ను 1973 ఏప్రిల్ 3న చేశారు. పాశ్చాత్య ప్రపంచంలో కూడా మొబైల్ ఫోన్ వినియోగదారీ వస్తువుగా మారటానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది.
లాండ్‌లైన్ లాగే, మొబైల్ ఫోన్ కూడా ప్రారంభంలో విలాసంగానే ఉండేది. 1980లలో దాని ధర అమెరికాలో 4,000 డాలర్లు. వాటి పరిమాణం పెద్దదిగా ఒక అడుగు ఉండేది. దాన్ని ‘ఇటుక ఫోన్’ అనేవారు. 1990ల మధ్యలో నేను ఉపయోగించిన తొలి మొబైల్ ఇటుక సైజు కంటే కాస్త చిన్నదిగా ఉండేది. అప్పటికీ అది ఏ జేబులోనూ పట్టేది కాదు.
ధర సుమారు యాభై వేలు. నేను పని చేస్తుండిన టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ, ఫీల్డ్ అసైన్ మెంట్ల కోసం వెళ్లే విలేఖరుల కోసం కొన్ని హ్యాండ్ సెట్లను అద్దెకు తీసుకుంది. అవి ఒక డయలింగ్ ప్యాడ్‌తో కూడిన భారీ పరికరం, పొడుచుకువచ్చిన యాంటెన్నా, మందమైన రింగ్‌టోన్ తో ఉండేవి. గుర్తుంచుకోండి, దాంతో కేవలం మాట్లాడగలరు. మెసేజ్ చేయలేరు, ఫొటోలు పంపలేరు.
మొబైల్ టెలిఫోన్ యుగంలోకి భారత్ 1987 జనవరి 1న ప్రవేశించిందని కొద్దిమందికే తెలుసు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ తన ‘మొబైల్ రేడియో ఫోన్ సర్వీస్’ను ఢిల్లీలో ప్రారంభించడం ద్వారా ఇది మొదలైంది. అది కారులో అమర్చిన ఫోన్ యూనిట్‌ని ఉప యోగించి ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడటానికి వీలయ్యే ఒక ప్రాథమికమైన కార్ ఫోన్ సర్వీస్. కొన్ని డజన్ల ఫోన్లను మాత్రమే అప్పట్లో వ్యవస్థాపించారు.
1992లో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సెల్యులార్ టెలిఫోన్ సేవలను అందించడానికి ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు. మొట్టమొదటి వాణిజ్యపరమైన సెల్యులార్ మొబైల్ కాల్‌ను 1995 జూలై 31న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి న్యూఢిల్లీలో ఉన్న సమాచార మంత్రి సుఖ్‌రామ్‌కు చేశారు. కలకత్తాలో మొబైల్ కాల్ సర్వీస్‌ను మోడీ–టెల్‌స్ట్రా (బీకే మోడీ గ్రూప్, ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్) అందించాయి. కొన్ని నెలల తర్వాత ఢిల్లీలో ‘భారతి’ సెల్యులార్ సేవలు ఆరంభించింది.
ఆ రోజుల్లో మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం ఖరీదైన వ్యవహారంగా ఉండేది – ఒక కాల్ చేయాలంటే నిమిషానికి రూ. 16.80, కాల్ రిసీవ్ చేసుకోవాలంటే రూ. 8.40 చెల్లించాల్సి వచ్చేది. ఫస్ట్ జనరేషన్ (1జి) డేటా టెక్నాలజీ అయిన జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ (జీఆర్‌పీఎస్) అందించడానికి ఫోన్ కంపెనీలకు మరి కొన్నేళ్లు పట్టింది.
తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీఛార్జ్, కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీలు, దూకుడైన రోలవుట్ ప్లాన్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ల విస్తరణ, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివన్నీ కలిసి భారతీయులకు మొబైల్ ఫోన్లను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. అధిక కాల్ ఛార్జీలు పాతకథ అయిపోయాయి.
జీఆర్‌పీఎస్ నుంచి, సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్ వరకు పయనించాం. మొబైల్ ఫోన్లు అంటే గతంలోలా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, వినోదం నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి అవసరానికీ ఉపయోగపడుతున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్‌లో మనం సమాధానం ఇస్తుండగా మనకు కాల్ చేస్తున్న వ్యక్తి చిత్రాన్ని చూడటం సరదాగా ఉంటుందని జోక్ చేయడం నాకు గుర్తుంది. వీడియో కాల్స్ నిజంగానే ఇప్పుడు చిన్నపిల్లలాట అయిపోయింది!
భారతీయ సెల్‌ఫోన్ విప్లవంలో మలుపులు
టాక్ టైమ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుండటం మొబైల్ ఫోన్లను సృజనాత్మకంగా ఉపయోగించడానికి దారితీసింది. సాధారణంగా, మీరు ఒక నంబరుకు కాల్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కాల్ తీసు కోలేనప్పుడు దాన్ని మిస్డ్ కాల్ అంటారు. టాక్ టైమ్ ఆదా చేయ డానికి, జనం మిస్డ్ కాల్స్ చేయడం ప్రారంభించారు.
ఉద్దేశపూర్వకంగా ‘కాల్ మి బ్యాక్’, ‘నేను చేరుకున్నాను’ వంటి ముందస్తుగా నిర్దేశించిన సందేశాలను తెలియచేయడానికి మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. యజమానులకూ, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు వంటి పరిమితమైన టాక్ టైమ్ ఉన్న వారికీ మధ్య సమాచారానికి ఇది అనుకూలమైన సాధనం. కంపెనీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విభాగాలు తరచుగా వాడే మార్కెటింగ్ సాధనమే మిస్డ్ కాల్.
సామాన్య ప్రజలకు మొబైల్ ఫోన్ ని రోజువారీ సాధనంగా చేసే ప్రయాణంలో ప్రీ–పెయిడ్ సర్వీస్ ఒక కీలక మలుపు. నెల చివరలో బిల్‌ని చెల్లించడానికి బదులుగా వినియోగదారులు టాక్ టైమ్‌ని కొని, దాన్ని నిర్దిష్ట కాలంలో తమ అవసరాల కోసం ఉపయో గిస్తారు. మరొక వినూత్న ఆవిష్కరణ ‘ఛోటా రీఛార్జ్’ లేదా మైక్రో రీఛార్జ్ కూపన్లు. నెలకు 200 లేదా 300 రీఛార్జ్‌కి బదులుగా కేవలం ఐదు రూపాయలకే చోటా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూరగాయల వ్యాపారి, వ్యవసాయ కూలీ వంటివారికి కూడా మొబైల్ సేవలను సరసమైన ధరకు అందించే గేమ్ ఛేంజర్ అయ్యింది.
ఎఫ్‌ఎమ్‌సీజీ సిమ్ కార్డులు, రీఛార్జ్ సేవల రూపంలో ఫోన్ సర్వీస్‌ని స్థానిక పచారీ కొట్లు, ఫార్మసీలు, పాన్ షాపుల్లో విస్తృతంగా అందుబాటులో ఉంచడం జరిగింది. టెలికామ్ సంస్థల కోసం ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ లాగా సేవ చేయడమే కాకుండా, ఈ ఫ్రాంచైజీలు కంపెనీ స్టోర్లలోని కస్టమర్ రిలేషన్స్ ఉద్యోగుల లాగా చందాదారుల సమస్యలను లాంఛనప్రాయంగా పరిష్కరి స్తాయి. ఫోన్లు, వాటి సేవలు వేగంగా అమ్ముడయ్యే వినియోగ సరుకులు (ఎఫ్‌ఎమ్‌సీజీ)గా మారిపోయాయి.
దినేష్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment