భారతీయులకు ఒక్కటంటే ఒక్క వ్యాక్సిన్ కూడా బుక్ చేయకముందే వ్యాక్సిన్ ఎగుమతి అంశం భారత ప్రభుత్వ ఎజెండాలో చేరిపోయింది. జనవరి 28న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, కోవిడ్–19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం ద్వారా భారత్ అనేక దేశాల ప్రజలను కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. అంతే కానీ కోట్లాదిమంది తన ప్రజానీకానికి వ్యాక్సిన్ ఎలా వేయడం అనేది ప్రభుత్వాధినేత తలంపులో కూడా లేకుండా పోయింది. ఎన్నికల కేంపెయిన్ల కోసమే ఉచిత వ్యాక్సిన్‌లపై వాగ్దానం చేశారు. రానురాను టీకా కొరత తప్పదని తేలడంతో ప్రజాగ్రహం మిన్నుముట్టింది. దీనికి సెకండ్ వేవ్ మరింత ఆజ్యం పోసింది. రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచుతూ ప్రకటనలు వచ్చాయి. 2020 ప్రారంభంలో కోవిడ్–19పై పోరులో భారత్ ముందంజ వేసిన కారణంగా వ్యాక్సిన్ సమృద్ధిగా లభ్యమవుతుందన్న అంచనాలు చెదిరిపోయాయి.
నెహ్రూ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖామంత్రి రాజ్‌కుమారి అమృత్ కౌర్ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పెన్సిలిన్ బాక్సును అందుకుంటున్న నలుపు–తెలుపు చిత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పలు వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టింది. సాంక్రమిక వ్యాధులపై పోరాటానికి గాను కెనడియన్ రెడ్ క్రాస్ సంస్థ నుంచి భారత్‌కు అందిన బహుమతి అది. 2021లో భారత్ నుంచి కోవిడ్–19 వ్యాక్సిన్ కోసం అదే కెనడా ఎదురు చూస్తున్న వార్త.. అమృత్ కౌర్ చిత్రం పక్కనే అచ్చయింది. 1947లో మనకు కావలసిన మందులకోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడ్డామని, కానీ ఆనాడు మనకు మందులను పంపించిన దాతలే ఈరోజు వ్యాక్సిన్‌ల కోసం భారత్‌పై ఆధారపడుతున్నారని చెప్పడానికి ఇదొక పరోక్ష సూచన.
తదనుగుణంగానే కొన్ని వారాలు గడిచేసరికి ఉన్నట్లుండి పరిస్థితి నాటకీయంగా ఎదురుతన్నింది. దాదాపు పన్నెండు దేశాల నుంచి విమానాల కొద్దీ వైద్య సరఫరాలు దిగుమతవుతున్న దృశ్యాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పంచుకోవడం ప్రారంభించింది. ఆ వైద్య సామగ్రిని విమానాశ్రయం నుంచి సుదూర ప్రాంతాలకు నేరుగా పంపించడం అనేది 1950లు, 1960లలో విదేశాల నుంచి ఆహార దిగుమతులను వచ్చినవి వచ్చినట్లుగా ఓడల నుంచి నేరుగా ప్రజల నోటికి అందించిన పాడుకాలాన్ని తలపింపచేశాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి మనల్ని ప్రశంసించి ఎంతో కాలం కాలేదు. కానీ అలాంటి భారత్ ఇంత వేగంగా సొంత ప్రజలకు వ్యాక్సిన్ అందించలేని దేశంగా ఎలా దిగజారిపోయింది? మనకు కనీస ప్రణాళిక అన్నది లేకపోవడమే దీనికి కారణం.
2009లో హెచ్1ఎన్1 మహమ్మారి విస్తరించిన సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన అనుభవంతో భారతీయ కంపెనీలు కోవిడ్–19 వ్యాక్సిన్ పరుగుపందెంలో చాలా ముందుగానే అడుగుపెట్టాయి. ఆనాడు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ అందించిన సీడ్ స్ట్రెయిన్ మద్దతుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, పనాక్కా బయోటెక్ వంటి భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు కేవలం 12 నెలలలోపే హెచ్1ఎన్1 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయగలిగాయి. జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి భారతీయ ఔషధ సంస్థలు అత్యవసరంగా ఉపయోగించే అధికారాన్ని కూడా త్వరగా సాధించుకున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో ఎంతో ప్రోత్సాహకరంగా నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న సార్స్ వైరస్‌కి వ్యతిరేకంగా భారత్ అసాధారణ స్థాయిలో ఔషధ నిల్వలను ఉంచుకోగలిగింది. ప్రైవేట్ కంపెనీల నష్టభయాన్ని తప్పించే విషయంలో ముందస్తు కొనుగోలుకు సిద్ధపడటం అనేది కీలకంగా ప్రభావం చూపింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్లను భారీ స్థాయిలో నిల్వకు తగిన యంత్రాంగం అవసరం గురించి 2011లో తీసుకొచ్చిన జాతీయ వ్యాక్సిన్ విధాన పత్రం నొక్కి చెప్పింది.
అయితే 2009లో మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన విధానాన్ని 2020లో తక్షణం అమలు చేయకపోవడానికి కారణాలను ఆరోగ్య శాఖే వివరించాల్సి ఉంటుంది. 2009లో వ్యాక్సిన్‌ని పెద్దమొత్తంలో నిల్వ చేసిన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు నాటి హెచ్1ఎన్1 కంటే నేటి కోవిడ్–19 మరింత సవాలు విసిరిన నేపథ్యంలో ముందస్తు కొనుగోలు నిబద్ధతలో పాలుపంచుకున్నాయి. కానీ ఈ సారి సవాలు హెచ్1ఎన్1 ని మించిపోవడంతో పరిస్థితి తల్లకిందులై పోయింది. దీనికి భిన్నంగా పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రభుత్వాలు బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యాక్సిన్ అభివృద్ధిపై గుమ్మరించడమే కాకుండా ఏఎమ్‌సీల ద్వారా తమ ఔషథ కంపెనీలకు సహాయపడ్డాయి. ఈ కారణంతోటే ఆ దేశాలు ఇప్పుడు తమ జనాభాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయడంలో విజయవంతం కావడమే కాకుండా మహమ్మారి విస్తృతిని తగ్గించుకోగలిగాయి.
ప్రపంచ మార్కెట్లకు 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని 2020 జూన్ 4న అస్ట్రాజెనెకాతో సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 2020 జూన్ 29న భారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ తయారీ గురించి ప్రకటించింది. కానీ మన విధాన నిర్ణేతలు ఎఎమ్‌సీ వంటి అవకాశాలను అందిపుచ్చుకుని, అందుబాటులోని ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకునే దిశగా ఎలాంటి సంకేతాలను పంపించలేదు. 2021 ప్రారంభంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థిరంగా ఆర్డర్లు వెళ్లాయి. కానీ ఆ సమయానికి సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరాపై వాణిజ్య ఒడంబడికలు కుదుర్చుకున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు గానీ, ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందానికిగానీ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రయత్నాలూ చేపట్టలేదు.
ఫైనాన్సింగ్, లైసెన్సింగ్‌తో సహా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలతో కోవిడ్–19ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై జాతీయ నిపుణుల గ్రూప్ తొలి సమావేశం 2020 ఆగస్టు 12న జరిగింది. స్థానికంగా వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యాన్ని భారత్ సంతరించుకుందని భారత్‌లోనే కాకుండా స్వల్పాదాయ, మధ్య ఆదాయ వనరులున్న దేశాలకు కూడా వ్యాక్సిన్‌ని ముందుగానే సరఫరా చేసే విషయంలో అంతర్జాతీయ సంస్థలతో కూడా భారత్ సంప్రదింపులు జరుపుతోందని ఈ నిపుణుల బృందం పేర్కొంది. 2020 ఆగస్టు 15న నిపుణుల గ్రూప్ తొలి సమావేశం జరిగిన మూడురోజుల తర్వాత ప్రధాని ప్రకటన చేస్తూ, వ్యాక్సిన్ల భారీ ఉత్పత్తికి ప్రాతిపదికను సిద్ధం చేశామనీ, వీలైనంత తక్కువ సమయంలో ప్రతి వ్యక్తికీ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను తన ప్రభుత్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
భారతీయులందరికీ 200 కోట్ల డోసులను సేకరించి టీకాలను అందించడానికి ఆగస్టు 12, 15 తేదీల మధ్య నిపుణుల బృందం చేసిన ప్లాన్ ఇదే అని చెప్పవచ్చా?! ఏమాత్రమూ కాదు. ఆ తర్వాత కొద్ది రోజులకే కేంద్ర ఆరోగ్య మంత్రి 2021 మధ్యనాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోసులను అందివ్వగలమని ప్రకటించారు. డిసెంబర్ 1న ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. మొత్తం జనాభాకు వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని పేర్కొంటూ ప్రధాని ప్రకటనను ఒక్కసారిగా పూర్వ పక్షం చేశారు. 2020నాటికి భారత్‌కు రెండు వ్యాక్సిన్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం కాగా, 2021 ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్ సంబంధిత విధాన నిర్ణయం చతికిలబడిపోయింది.
ఈలోగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ స్వదేశీ ఉత్పత్తని, ఇది ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత విజయమని చెబుతూ పాలకపార్టీ రాజకీయం చేయడం మొదలెట్టింది. ఎన్నికల కేంపెయిన్ల కోసమే ఉచిత వ్యాక్సిన్‌లపై వాగ్దానం చేశారు. రానురాను టీకా కొరత తప్పదని తేలడంతో ప్రజాగ్రహం మిన్నుముట్టింది దీనికి సెకండ్ వేవ్ మరింత ఆజ్యం పోసింది. దీంతో వివిధ వయస్కుల వారికి వ్యాక్సిన్ షెడ్యూళ్లను ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు రెండు రకాల ధరలు ప్రకటించారు. రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచుతూ ప్రకటనలు వచ్చాయి. మొత్తంమీద 2020 ప్రారంభంలో కోవిడ్–19పై పోరులో భారత్ ముందంజ వేసిన కారణంగా వ్యాక్సిన్ సమృద్ధిగా లభ్యమవుతుందన్న అంచనాలు చెదిరిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని అనే భ్రమ కనీవినీ ఎరుగని గందరగోళంలో పడిపోయింది.
వ్యాసకర్త :దినేష్ సి. శర్మ
సైన్స్ వ్యాఖ్యాత (ట్రిబ్యూన్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment