గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌తోపాటు ఓ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ‘వేదాంత’ గ్రూపు ప్రకటించింది. రెండు కారణాల వల్ల ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మొదటిది వీటి ఏర్పాటుకు ఏకంగా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూండటం.
ఇక రెండోది, ఈ ప్లాంట్ ముందు నుంచి సూచిస్తూ వచ్చిన మహారాష్ట్రలో కాకుండా గుజరాత్‌లో ఏర్పాటు కానుండటం! ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. వేదాంత గ్రూపు భాగస్వామిగా తైవాన్‌కు చెందిన హోన్ హై టెక్నాలజీ(ఫాక్స్‌కాన్) గ్రూపు వ్యవహరిస్తూండటం. సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ పెట్టింది పేరన్నది తెలిసిన విషయమే.
కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు కొరత ఏర్పడటం కనువిప్పు లాంటి దని చెప్పాలి. ఒకరిద్దరు తయారీదారులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవని రుజువు చేసిందీ మహమ్మారి. ఈ కాలంలో సెమీకండక్టర్ చిప్‌లు కార్లు మొదలుకొని వాషింగ్ మెషీన్ల వరకూ అన్నింటిలో చేరి పోతున్నాయి.
కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో చాలామంది తయారీ దారులు తైవాన్‌లోని ఫ్యాబ్‌లపై (చిప్ తయారీ కేంద్రాలను ఫ్యాబ్‌లని పిలుస్తారు) ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందుకే ఈ మార్కెట్‌లో సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సము పార్జించుకోవడం భారత్‌కు ఎంతైనా అవసరం.
ఈ ఏడాది అమెరికా ‘చిప్స్’ పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా మైక్రోప్రాసెసర్లు లేదా చిప్‌లు తయారు చేసే లేదా పరిశోధనలు చేసే అమెరికన్ కంపెనీలకు దాదాపు 5,200 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాలు అందించనున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.
దక్షిణ కొరియా దేశీ సంస్థలకు సబ్సిడీలతో కలుపుకొని సుమారు 45,000 కోట్ల డాలర్లతో సెమీ కండక్టర్ల తయారీకి భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. మన దేశంలో ‘సెమీ కండక్టర్ మిషన్’లో భాగంగా సుమారు 76 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు చిప్స్, డిస్‌ప్లే ఫ్యాబ్స్‌కు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టుకయ్యే ఖర్చులో దాదాపు 50 శాతం సబ్సిడీగా అందిస్తున్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన పునాదులు 1974లో పంజాబ్‌లో పడ్డాయని చెప్పాలి. సెమీ కండక్టర్ల డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్లలో మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ ఇందుకోసం విదేశీ సాయం తీసుకోవాలని తొలినాళ్లలో నిర్ణయించింది. ‘సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్‌సీఎల్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన తరువాత 1976లో నిపుణుల బృందం మొహాలీ, మద్రాస్‌లలో ఒకచోట ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచిం చింది.
ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ మద్రాస్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సిఫారసు చేసింది. అయితే అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్‌సింగ్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఈ కాంప్లెక్స్ మొహాలీలో ఏర్పాటయ్యేలా చేసుకున్నారు. ఈ కేంద్రంలో అత్యధిక నైపుణ్యం ఉన్న వారి అవసరం ఎక్కువగా ఉంటుందనీ, దీని వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలేవీ పెరగవన్న విషయాన్ని జైల్ సింగ్‌కు వివరించాల్సిందిగా ఇందిరాగాంధీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారి అశోక్ పార్థసారథిని పురమాయించారు.
అయినాసరే మొహాలీలోనే ఆ కాంప్లెక్స్ ఏర్పాటు కావాలని జైల్‌సింగ్ పట్టు పట్టడంతో భారత్‌లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం 1978లో మొహాలీలో ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఫ్యాబ్‌కు రూ.15 కోట్లు ఖర్చు అయ్యింది. 1983లో అమెరికన్ మైక్రోసిస్టమ్స్ నుంచి పొందిన టెక్నా లజీ ఆధారంగా ఈ ఫ్యాబ్‌లో చిప్‌ల తయారీ మొదలైంది.
ఎస్‌సీఎల్ ఏర్పాటయ్యే సమయానికి కొంచెం అటూయిటుగానే దేశంలో సెమీ కండక్టర్ డిజైనింగ్ కార్యకలాపాలు కూడా మొదల య్యాయి. చిప్ డిజైనింగ్‌లో అమెరికాలో పెద్ద పేరు సంపాదించిన ఐఐటీ – కాన్పూర్ పూర్వ విద్యార్థి ప్రభాకర్ గోయెల్ ఈ దిశగా చొరవ తీసుకున్నారు. ప్రభాకర్ మొదలుపెట్టిన ‘గేట్‌వే డిజైన్ ఆటోమేషన్’ సంస్థ చిప్‌లను పరీక్షించేందుకు వెరిలాగ్ పేరుతో టెస్టింగ్ టూల్‌ను తయారు చేసింది.
వెరిలాగ్‌కు జపాన్, తైవాన్‌లలోని చిప్ తయారీ దారుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో ప్రభాకర్ గోయెల్ సంస్థ లక్షల డాలర్లు ఆర్జించగలిగింది. వెరిలాగ్ రూపకల్పన కొంత శ్రమతో కూడిన వ్యవహారం కావడంతో ప్రభాకర్ ఈ ప్రక్రియను భారత్‌లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలోని ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌లో 1985లో కొంతమంది ఇంజినీర్లతో ఓ చిన్న యూనిట్‌ను మొదలుపెట్టారు.
నాలుగేళ్ల తరువాత అమెరికాకు చెందిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రభాకర్ కంపెనీని కొనేసింది. ఈ రకంగా కాడెన్స్ సంస్థ భారత్‌లోనూ కాలుపెట్టిందని చెప్పాలి. సెమీ కండక్టర్ డిజైనింగ్ రంగంలోనే ఉన్న ఇంకో రెండు కంపెనీలు టెక్సస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎస్‌టీ మైక్రోఎలక్ట్రానిక్స్ కూడా ఈ సమయంలోనే దేశంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఆ తరువాత పదేళ్ల కాలంలోనే ఇంటెల్ లాంటివాటితో కలుపుకొని ప్రపంచంలోని 25 సెమీకండక్టర్ డిజైనింగ్ కంపెనీల్లో 17 భారత్‌లో కేంద్రాలను తెరి చాయి. ఫలితంగా సెమీకండక్టర్ డిజైనింగ్ రంగంలో భారత్ ఓ బలీయమైన శక్తిగా మారింది.
మైక్రోప్రాసెసర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు అమెరికా, యూరప్ కంపెనీలు భారతీయ ఇంజినీర్ల డిజైనింగ్ నైపు ణ్యాన్నీ, తైవాన్‌లోని తయారీ కేంద్రాలనూ ఉపయోగించుకోవడం మొదలైంది. ఇంకోవైపు ఎస్‌సీఎల్ ఈ పోటీలో వెనుకబడి పోయింది.
తయారీ టెక్నాలజీని ఆధునికీకరించే ప్రయత్నంలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఒకటి చోటు చేసుకోవడం... పునర్నిర్మాణానికి చాలా సమయం పట్టడంతో కంపెనీ మళ్లీ కోలుకోలేకపోయింది. కాకపోతే సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై విదేశాలు నిషేధాలు విధించిన సమ యంలో అంతరిక్ష, రక్షణ రంగాల అవసరాలను తీర్చేందుకు మాత్రం ఉపయోగపడింది. తాజాగా ఎస్‌సీఎల్‌ను వాణిజ్యస్థాయి ఫ్యాబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సెమీ కండక్టర్ రంగంలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టలేకపోవడం, స్థానికంగా మైక్రోప్రాసెసర్లకు డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం వంటివి మచ్చుకు కొన్ని. సెమీ కండక్టర్ రంగంలో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది.
వేదాంత సంస్థ ఏర్పాటు చేయదలచుకున్న ఫ్యాబ్‌లో 28 నానోమీటర్ల టెక్నాలజీ నోడ్‌లను తయారు చేసేందుకు నిర్ణయించారు. కంప్యూటర్లకు గుండె వంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసర్లు, నెట్‌వర్కింగ్ చిప్స్, స్మార్ట్‌ఫోన్స్, కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లలో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లను ఇక్కడ తయారు చేయవచ్చు. అయితే తైవాన్‌లో ప్రస్తుతం ఇంతకంటే చాలా సూక్ష్మమైన స్థాయిలో టెక్నాలజీ నోడ్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇవెంత సూక్ష్మమైన వంటే... కేవలం మూడు నానోమీటర్ల సైజున్నవన్నమాట!
మొహాలీలో ఏర్పాటైన ఎస్‌సీఎల్‌లో ఐదు మైక్రాన్ల (5,000 నానో మీటర్లు) సైజున్న ట్రాన్సిస్టర్ల తయారీ చేపట్టారు. ఈ సైజును 1.2 మైక్రాన్లకు(1,200 నానోమీటర్లు) తగ్గించేందుకు జరిగిన ప్రయత్నం లోనే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా అంత ర్జాతీయ సంస్థలు 0.8 మైక్రాన్ల సైజులో మాత్రమే ట్రాన్సిస్టర్ల తయా రీలో ఉండేవి. పదేళ్లలోపు ఎస్‌సీఎల్ ఈ అంతరాన్ని సొంతంగానే తగ్గించుకుని ఉండేది.
విదేశీ టెక్నాలజీలను ఆపోశన పట్టడంలో భారతీయులు నైపుణ్యం కలవారన్నది తెలిసిందే. ఎప్పటి కప్పుడు మారిపోతూండే ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్ రంగంలో మనదైన ముద్ర వేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవడం ఎంతైనా అవసరం. ఇందుకు పరిశోధనలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటికైతే వేదాంత ప్రతిపాది స్తున్న జాయింట్ వెంచర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై మాట విప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఉంటుందా, లేదా అన్నది కూడా అస్పష్టం. భారత్ మరోసారి సెమీ కండక్టర్ రంగంలో లభిస్తున్న గొప్ప అవకాశాన్ని కోల్పోదనే ఆశిద్దాం!
వ్యాసకర్త: దినేశ్ సి. శర్మ, వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment