జేఈఈ అడ్వాన్స్‌డ్ -2015లో మార్పులు | Changes in JEE Advanced -2015 | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్ -2015లో మార్పులు

Published Mon, Oct 6 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్ -2015లో మార్పులు

జేఈఈ అడ్వాన్స్‌డ్ -2015లో మార్పులు

దేశంలో లక్షల మంది ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సుల విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకునే ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2015 కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. 2012 నుంచి అమలు చేస్తున్న బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనలను సడలిస్తూ కొత్త ప్రవేశ విధానాన్ని ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ కొత్త ప్రవేశ విధానం, విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశాలపై విశ్లేషణ..

జాయింట్ ఎంట్రెన్‌‌స ఎగ్జామ్ (జేఈఈ)-అడ్వాన్స్‌డ్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్‌‌స- ధన్‌బాద్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి 2012 నుంచి అమలు చేస్తున్న అడ్వాన్స్‌డ్ విధానం దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థుల్ని నిరాశకు గురి చేసింది. కారణం.. బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలనే నిబంధన విధించడం. దీనివల్ల ఎందరో విద్యార్థులు ఎంట్రెన్స్‌లో రాణించినా టాప్-20 పర్సంటైల్‌లో నిలవలేక అవకాశాలు చేజార్చుకున్నారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు వచ్చినా టాప్-20 పర్సంటైల్‌లో లేకపోవడంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. ఈ టాప్-20 పర్సంటైల్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై అధికంగా కనిపించింది. బోర్డ్ పరీక్షల్లో 91 శాతం పొందిన విద్యార్థులు
 సైతం టాప్-20 పర్సంటైల్ జాబితాలో చోటు పొందలేక ఐఐటీలో సీటు సాధించలేకపోయారు.
 
సరికొత్త విధానం.. విద్యార్థుల్లో ఆనందం
 జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ విధానం, కౌన్సెలింగ్‌లకు సంబంధించి మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అడ్మిషన్ బోర్డ్.. జేఈఈ-అడ్వాన్స్‌డ్- 2015 ద్వారా ఐఐటీల్లో ప్రవేశాల నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. అవి..
- జేఈఈ-మెయిన్ పరీక్షలో 1,50,000 మందిలో ఒకరిగా నిలవాలి.
- విద్యార్థులు టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి లేదా ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించాలి.
 ఈ రెండింటిలో ప్రధానంగా రెండో నిబంధన ఇప్పుడు విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తోంది. ఐఐటీ-జేఈఈ స్థానంలో 2012 నుంచి జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటోంది. తాజా సడలింపుల ఫలితంగా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవకపోయినా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి, బోర్డ్ పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు పొందితే ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది.
 
జేఈఈ మెయిన్.. యథాతథం
జేఈఈ-మెయిన్..ఐఐటీలు మినహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో (ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు తదితర) ప్రవేశానికి అవసరమైన పరీక్ష. తాజా సడలింపుల్లో మెయిన్ విషయంలో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. గత మూడేళ్ల మాదిరిగానే 2015లోనూ యథాతథంగా జరగనుంది. ఈ క్రమంలో.. కౌన్సెలింగ్ సమయంలో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగనుంది. విద్యార్థులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
 
మార్కులా.. పర్సంటైలా
 జేఈఈ- మెయిన్, అడ్వాన్స్‌డ్ ఔత్సాహిక విద్యార్థులు ఇప్పుడు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి..
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కుల నిబంధన నేపథ్యంలో ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో నిలిచేలా మార్కులు సాధించడం.
- జేఈఈ మెయిన్‌లో యథాతథంగా బోర్డ్ పరీక్షల్లో మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగించనున్న నేపథ్యంలో బోర్డ్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధన దిశగా కృషి చేయాలి.
- ఫలితంగా జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండింటికీ సంపూర్ణ సంసిద్ధత సొంతం చేసుకోవచ్చు.
- కేవలం ఐఐటీలనే లక్ష్యంగా పెట్టుకుంటే బోర్డ్ పరీక్షలో 75 శాతం పొందే విధంగా అకడమిక్‌గా కృషి చేసి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం దిశగా సిద్ధం కావొచ్చు.
- కానీ ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ నిబంధనను అనుక్షణం గుర్తుంచుకోవాలి.
 
ప్రిపరేషన్.. విశ్లేషణాత్మకం
- జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలు కూడా వెల్లడైన నేపథ్యంలో ఔత్సాహిక విద్యార్థులు ఇప్పటినుంచే తమ ప్రిపరేషన్‌ను వ్యూహాత్మకంగా కొనసాగించాలి.
- ‘ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు కనీసం 75 శాతం మార్కులు’ అనే సడలింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఎంట్రెన్స్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేయాలి.
- జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండు పరీక్షల్లో గత మూడేళ్లుగా ప్రశ్నలు పూర్తిగా అనువర్తిత, విశ్లేషణాత్మక దృక్పథంతో ఆలోచించి సమాధానం ఇవ్వాల్సినవిగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సిలబస్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సదరు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల అన్నిటిలోకి సులువైన మార్గంపై అవగాహన వస్తుంది. పరీక్షలో సమయ పాలనకు ఎంతో తోడ్పడుతుంది.
- ప్రశ్న- సమాధానం అనే దృక్పథాన్ని వీడి అనువర్తిత ఆధారిత పరిష్కార మార్గాలను అన్వేషించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
- ఇంటర్మీడియెట్ సిలబస్‌ను, జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్‌డ్ సిలబస్‌లతో బేరీజు వేసుకోవాలి.
- వాటిలో తాము ఇప్పటికే పట్టు సాధించిన అంశాలు.. బలహీనంగా ఉన్న టాపిక్స్‌తో ఒక పట్టిక రూపొందించుకోవాలి.
- బలహీనంగా ఉన్న అంశాలకు మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఉంటున్న ప్రాధాన్యతను గత ప్రశ్నపత్రాల విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా ఆయా అంశాలకు ప్రిపరేషన్ పరంగా ప్రాధాన్యం ఇవ్వాలి.
- తాము బలహీనంగా ఉన్న అంశాలకు.. ఇతర ముఖ్యమైన టాపిక్స్ మధ్య అనుసంధానం ఉంటే కచ్చితంగా వాటిపై పట్టు సాధించాలి. ముఖ్యంగా ఇలాంటి ఇంటర్-రిలేటెడ్ అంశాలు ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా ఉంటాయి.
- జేఈఈ-మెయిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో, అడ్వాన్స్‌డ్ మే 24,
 2015న జరగనుంది. అంటే.. విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించడం సులభమే.
- ఇంటర్మీడియెట్ సిలబస్‌ను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు జేఈఈ ప్రిపరేషన్‌కు కేటాయించడం ఉపయుక్తంగా ఉంటుంది.
- ఫిబ్రవరి 15 తర్వాత నుంచి బోర్డ్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
- సాధారణంగా మార్చి చివరి వారానికి బోర్డ్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత మెయిన్‌కు కనీసం నెల రోజుల వ్యవధి లభిస్తుంది. ఈ సమయంలో పూర్తిగా జేఈఈ సిలబస్ రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు మరో నెల రోజుల సమయం లభిస్తుంది. అప్పుడు కూడా రివిజన్‌కే ఎక్కువ సమయం కేటాయించాలి.
- అంటే ఔత్సాహిక విద్యార్థులు ఫిబ్రవరి నాటికి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేయాలి. లేదంటే ఆ తర్వాత బోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్స్ వంటి వాటికి సమయం సరిపోతుంది. ఆ తర్వాత లభించే సమయంలో జేఈఈ సిలబస్ ప్రిపరేషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు.
- ఇప్పట్నుంచే బోర్డ్ పాఠ్యాంశాలను, జేఈఈ సిలబస్ అంశాలను తులనాత్మక అధ్యయనం చేస్తూ.. తమకు అనుకూలమైన రీతిలో ముఖ్యాంశాలు, షార్ట్‌కట్ మెథడ్స్‌తో కూడిన సొంత నోట్స్‌ను రూపొందించుకోవాలి.
- గత పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి, నెగెటివ్ మార్కింగ్ వంటివి పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కేటాయించిన మార్కు ల్లో 50 నుంచి 60 శాతం మార్కులు సాధిస్తే కౌన్సెలింగ్ కాల్ ఆశించొచ్చు. ఈ మేరకు విద్యార్థులు తమ వ్యూహాలకు పదును పెట్టాలి.
 
ఉత్సాహాన్ని నింపే మార్పులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి తాజా మార్పులు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. కానీ ఇదే సమయంలో విద్యార్థులు కనీస అర్హత నిబంధనకే పరిమితం కాకుండా.. అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలి. ఫలితంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి అవసరమైన మెయిన్ పరీక్ష విషయంలో లాభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు విశ్లేషణాత్మక దృక్పథంతో ఆయా అంశాల్లో పట్టు సాధించాలి. ఒక అంశాన్ని చదివే సమయంలో సదరు అంశానికి గత నాలుగైదేళ్లలో లభించిన ప్రాధాన్యం, ప్రశ్నల క్లిష్టత స్థాయిని పరిశీలిస్తూ చదివితే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
 - ఆకాశ్ చౌదరి, డెరైక్టర్, ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్
 
మంచి ర్యాంకే ప్రధాన లక్ష్యం
జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు పరీక్షలో మంచి ర్యాంకు ప్రధాన లక్ష్యం కావాలి. నిబంధనల్లో సడలింపు ఉపశమనం కలిగించే మాట వాస్తవం. కానీ లక్షల మంది పోటీ పడే పరీక్షలో అకడమిక్ మార్కులు, అర్హత నిబంధనల విషయంలో కనీస అంశాలనే పరిగణనలోకి తీసుకోకూడదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లోనూ అత్యధిక మార్కులు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది.
 - ఎం. అరవింద్ కుమార్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు డెరైక్టర్ టి.ఐ.ఎం.ఇ. ఇన్‌స్టిట్యూట్
 
 
స్వీయ ప్రణాళిక.. వ్యూహాత్మక ప్రిపరేషన్‌తో విజయం
జేఈఈ-అడ్వాన్స్‌డ్ విధానంలో తాజా సడలింపు వల్ల చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. టాప్-20 పర్సంటైల్ నిబంధన కారణంగా మా బ్యాచ్‌లో చాలా మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చినా ఐఐటీల్లో సీటు లభించలేదు. జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే ముందుగా మానసిక సంసిద్ధత ఉండాలి. పోటీ పడే వారి సంఖ్యను చూసి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సరైన సమయపాలన, తమ వ్యక్తిగత బలాలు, బలహీనతలను అనుసరించి ప్రాక్టికల్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి నాటికి ఇంటర్ సిలబస్‌ను పోటీ పరీక్షలో కోణంలో చదవాలి. తర్వాత వీలైనంత ఎక్కువగా మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి.
  - రావూరి లోహిత్,ఫోర్‌‌త ర్యాంకర్, జేఈఈ అడ్వాన్స్‌డ్-2014
 
జేఈఈ- 2015 సమాచారం
జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ : అక్టోబర్ రెండవ వారం
జేఈఈ మెయిన్ పరీక్ష : 2015, ఏప్రిల్ చివరి వారం
 జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2015 ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 2, 2015 నుంచి మే 7, 2015 వరకు
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం:
మే 9, 2015 నుంచి మే 12, 2015 వరకు
పరీక్ష తేదీ: మే 24, 2015
మార్కుల వెల్లడి: జూన్ 13, 2015
తుది ఫలితాల వెల్లడి: జూన్ 18, 2015
వెబ్‌సైట్: http://jeeadv.iitkgp.ac.in/
 
 జేఈఈ పరీక్ష విధానం
- జేఈఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో, పెన్-పేపర్ విధానంలో జరుగుతుంది.
- మెయిన్స్ ఒకే పేపర్‌గా మూడు గంటల వ్యవధిలో మూడు విభాగాల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉంటుంది.
- అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం మూడు గంటలు. ప్రశ్నించే విభాగాలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
 
ఎడ్యు న్యూస్ 
ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్
పాఠశాల, యూనివర్సిటీల స్థాయిలో విద్యార్థులను పరిశోధన దిశగా ఆకర్షితులను చేసే క్రమంలో ప్రభుత్వం కొత్త చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో పరిశోధన కార్యకలాపాలను పెంచేందుకు తలపెట్టిన రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకంలో భాగంగా.. ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ ఇన్నోవేషన్ ల్యాబ్‌లను.. ఇండస్ట్రీ, అకడమిక్ వర్గాల భాగస్వామ్యంతో సంబంధిత ఉన్నత విద్యా మండళ్లకు అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. దేశానికి అవసరమైన పరిశోధనల విషయంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం.
 
ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకుల రాక
భారతీయ యూనివర్సిటీల్లో ఇక నుంచి ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకులు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్ విభాగంలో ఈ లెక్చర్స్ ఇచ్చేందుకు ఎంపిక చేసిన వేయి మంది అమెరికా అధ్యాపకులు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలకు రానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ త్వరలో రూపొందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement