లిస్టింగ్ లో క్విక్ హీల్ కుదేలు..
సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్‌హీల్ టెక్నాలజీస్.. లిస్టింగ్ రోజున భారీగా క్షీణించింది. ఇష్యూ ధర రూ. 321తో పోలిస్తే బీఎస్‌ఈలో దాదాపు 20.73 శాతం నష్టపోయి రూ. 254.45 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 23.3 శాతం మేర క్షీణించి రూ. 246 స్థాయిని కూడా తాకడం గమనార్హం. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ 20.91 శాతం పతనంతో రూ. 253.85 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,782 కోట్లుగా ఉంది. ఈ ఏడాది లిస్టయిన కంపెనీల్లో టీమ్‌లీజ్ సర్వీసెస్, ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్ తర్వాత క్విక్‌హీల్ మూడోది. ఫిబ్రవరి 10తో ముగిసిన ఐపీవోలో కంపెనీ రూ. 451 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర రూ. 311-321 శ్రేణిలో ఉండగా.. ఇష్యూ 11 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. చివరికి రేటును రూ. 321గా నిర్ణయించారు. మరోవైపు క్విక్‌హీల్ పూర్తి షేర్‌హోల్డింగ్ వివరాలు వెల్లడించలేదంటూ ఎన్‌సీఎస్ కంప్యూటెక్ సంస్థ ఎండీ మనోహర్ మలానీ సెబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.