
నీరసపడిన ఇండిగో
బడ్జెట్ క్యారియర్ ఇండిగో కు చెందిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ జూన్తో ముగిసిన ఆర్థిక ఫలితాల్లో నీరస పడింది.
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఇండిగో కు చెందిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ జూన్తో ముగిసిన ఆర్థిక ఫలితాల్లో నీరస పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 7.4 శాతం క్షీణతతో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1లో 7.4 శాతం క్షీణించి రూ.592 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 639 కోట్ల లాభం ఆర్జించింది. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోమొత్తం ఆదాయం మాత్రం 9.7 శాతం పెరిగి రూ. 4,741.45 కోట్లకు చేరింది. గత ఏడాది ఇది రూ 4,211.54 కోట్లు. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1577 కోట్ల నుంచి రూ. 1554 కోట్లకు తగ్గింది. ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈలో ఇండిగో షేర్లు 1.6 శాతం నష్టంతో రూ. 974 వద్ద నిలిచింది.టికెట్ ధరల్లో నెలకొన్న పోటీ కారణంగా ఈ పరిణామమని కంపెనీ తెలిపింది. గుర్గావ్ ఆధారిత ఈ బడ్జెట్ క్యారియర్ పాసింజర్ల ఆదాయంలో 6.9 శాతం పెరిగి రూ 3971.73 కోట్ల కు చేరింది. ఎయిర్లైన్స్ యొక్క మొత్తం అప్పులు రూ 2785.7 కోట్ల మేరకు తగ్గాయి.
ప్రధానంగా గత ఏడాది కంటే తక్కువ లాభాలను ఆర్జించామని ఇండిగో డైరెక్టర్ ఆదిత్య ఘోష్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సీటు ఆక్యుపెన్సీ 4.7 శాతం క్షీణించి 83.3గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 88 శాతం. మొత్తం రుణం ఇండిగో విమానాలకు సంబంధించే తప్ప సంస్థకు వర్కింగ్ క్యాపిటల్ అప్పులేవీ లేవని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వివరించింది.