మళ్లీ పరిశ్రమలు మైనస్..
♦ ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి -0.8 శాతం క్షీణత
♦ తయారీ రంగం పేలవ పనితీరు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి సంబంధించి ఇటీవల వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు తీసుకువచ్చిన ఉత్సాహం కొద్ది రోజులు కూడా నిలవలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలలో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -0.8 శాతం క్షీణించింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం అతి పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ విభాగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది.
2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం. రెండు నెలలు స్వల్ప వృద్ధిలో కొనసాగిన ఐఐపీ సూచీ మూడో నెల ఏప్రిల్‌లో తిరిగి క్షీణతలోకి జారిపోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలు గడచిన ఆర్థిక సంవత్సరం 7.6 శాతం వృద్ధి, క్యూ4లో 7.9 శాతం వృద్ధి తీరును ప్రదర్శించి ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఐఐపీ తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాల తీరును చూస్తే..
♦ క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, పెట్టుబడులకు, భారీ యంత్ర పరిశ్రమల ఉత్పత్తికి సూచికైన క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తి పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 5.5 శాతం వృద్ధి బాట నుంచి - 24.9 శాతం క్షీణతకు జారిపోయింది.
♦ విద్యుత్: ఉత్పత్తి -0.5 శాతం క్షీణత నుంచి 14.6 శాతం వృద్ధికి మళ్లింది.
♦ మైనింగ్: ఈ రంగం ఉత్పత్తిలో కూడా -0.6 శాతం క్షీణత 1.4 శాతం వృద్ధికి మళ్లింది.
♦ వినియోగ వస్తువులు: ఉత్పాదకత 2.8% వృద్ధి నుంచి 1.2 శాతం క్షీణతకు పడింది.
♦ తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో కేవలం తొమ్మిది మాత్రమే సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి.
♦ రేటు కోత తప్పదు: పరిశ్రమలు బ్యాంకులు తమకు అందిన రెపో ప్రయోజనాన్ని పూర్తిగా బదలాయించడంతోపాటు, ఆర్‌బీఐ తాజా రేటు కోత ద్వారానే వృద్ధి ఊపందుకుంటుందని పారిశ్రామిక రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.