countrys economy
-
ఒకే జీఎస్టీ రేటు ఉండాలి..
అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరసి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్ తిరిగి గాడినపడాలని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్లో ప్రకటించబోయే ఉద్దీపనలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను శ్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ► ఎఫ్ఎంసీజీ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిపడ నగదు లభ్యత లేక చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సంప్రదాయ వ్యాపారాలు బలహీనపడుతున్నాయి. ► పంటలకు సరైన ధర, వ్యవసాయేతర ఆదాయాలు తగ్గడం వంటి అంశాల్లో ప్రభుత్వ మద్దతు కొరవడి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ నిరుత్సాహపరుస్తోంది. ► భారతావనిలో వినియోగం పరంగా సుమారు 75% గ్రామీణ ప్రాంతమే. ఈ నేపథ్యంలో పంటలకు మద్ధతు ధర, ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల టర్నోవర్ మెరుగవుతుంది. ► ద్రవ్య సరఫరాను పెంచే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. అయితే డిమాండ్ లేకపోవడంతో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మందగమనం నుంచి గట్టెక్కడానికి ఖర్చుచేయతగ్గ ఆదాయం పెరగాలంటే పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. ► విక్రయాలు తిరిగి పుంజుకుంటే ఎఫ్ఎంసీజీ కంపెనీలు సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు చేస్తాయి. నియామకాలను చేపడతాయి. ► వేతనాలు అధికమైతే సేవింగ్స్ పెరుగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలను తేవాలి. పలు రంగాల్లో ఉద్దీపనలు ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే వాతావరణం కల్పించాలి. ► జీఎస్టీ రేట్లను తగ్గించాలి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులన్నింటికీ ఒకే పన్ను రేటును అమలు చేయాలి. తయారీపై ప్రణాళికగా వెళ్లేందుకు కంపెనీలకు మార్గం ఏర్పడుతుంది. తయారీ పెరిగితే కింది స్థాయిలో తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు అధికమవుతాయి. ► ఈ–కామర్స్ కంపెనీల కారణంగా సాధారణ బిస్కట్లు, చవక తృణధాన్యాలు, గింజల అమ్మకాలు లేకుండాపోయాయి. వ్యాపారాలు గాడినపడేందుకు చిన్న కిరాణా వర్తకులు, ఎఫ్ఎంసీజీ దుకాణదారులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. ► మందగమనం నుంచి గట్టెక్కాలంటే వినియోగం పెరగాలి. కార్పొరేట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, పన్ను ఆదాయం తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయంపైనా ఆ మేరకు ప్రభావం చూపుతోంది. సెంటిమెంటు బలపడడానికి, పన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సమతులంగా వ్యవహరించాలి. బడ్జెట్‌పైనే ఆశలన్నీ..! కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపులు, ప్రాధమ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మాత్రమే కాదు, దేశ యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ శాతం పెరిగిపోయి 6.1 శాతంగా నమోదైంది. అలాగే ఉన్న ఉద్యోగులికిచ్చే వేతనాలు కూడా అరకొరగానే ఉంటున్నాయి. అసలే వృద్ధి రేటు తక్కువగా ఉన్న ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అలాగే కొత్త పెట్టుబడులతో కోల్డ్ స్టోరేజీలు, ఆహారశుద్ధి పరిశ్రమలు, లాజిస్టిక్ క్లస్టర్ల ఏర్పాటుతో గ్రామీణ నిరుద్యోగాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంది. పట్టణాలు, నగరాలలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. రియల్టీ రంగం, నిర్మాణ రంగాలకు ప్రోత్సాహకాలు అందివ్వడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మన దేశానికి వరంగా మారిన విద్యావంతులైన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడం ద్వారా వృద్ధి రేటు సాధించడంతోపాటు గణనీయంగా ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని తగ్గించవచ్చు. – శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్ గ్రూప్ -
నకిలీ నోట్ల కుంభకోణంలో కదులుతున్న డొంక
► పశ్చిమ బెంగాల్ టూ విజయవాడ ► ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టిన తాడిపత్రి పోలీసులు ► నిందితులను కలిపింది బెంగళూరు జైలు ► కోల్‌కతా ప్రాంతానికి చెందిన అసలు సూత్రధారుల కోసం గాలింపు దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే నకిలీ నోట్ల కుంభకోణాలకు మూలం మన పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ దేశమే. అక్కడి నుంచి కలకత్తా మీదుగా మన రాష్ట్రానికి చేరి, అన్ని ప్రాంతాలకు నకిలీ నోట్లు సరఫరా అవుతున్నాయనే విషయం తాడిపత్రి పోలీసుల విచారణలో వెల్లడైంది. లోతుగా దర్యాప్తు చేసేకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.- తాడిపత్రి తాడిపత్రి పోలీసులు వలపన్ని నకిలీ నోట్ల ముఠాను శనివారం అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ నోట్లు, ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దొంగనోట్లు దొరకడం, దాని వెనుక పెద్ద రాకెట్ ఉండడం కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు... విజయవాడ కేంద్రంగా... విజయవాడకు చెందిన శ్రీరామవాసుదేవా ఓ హత్య కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో కలకత్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. తాము పశ్చిమబెంగాల్ నుంచి నకిలీ నోట్లు సేకరించి ఇస్తామని, వాటిని చెలామణి చేయాలని కోరగా అందుకు శ్రీరామవాసు దేవా సరేనన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక కలకత్తాకు వెళ్లి తనకు పరిచయమైన వారిని కలుసుకున్నాడు. అక్కడి నుంచి కొన్ని నకిలీ నోట్లు తీసుకువచ్చాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో మరికొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ధర్మవరం చెందిన మోహన్, సాంబశివుడు కూడా బెంగుళూరు జైలులో శ్రీరామవాసుదేవాకు పరిచయస్తులే. వారి ద్వారా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తన కార్యకలాపాలు కొనసాగించాడు. విజయవాడ, తిరుపతి, ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి ప్రాంతాలలో చాలా మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారే టార్గెట్. ప్రధాన నిందితుడు శ్రీరామవాసుదేవా తన అనుచరులైన మోహన్, సాంబశివుడు ద్వారా నియమించుకున్న ఏజెంట్లను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పంపేవాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారిని గుర్తించి సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని సూచించేవారు. రూ.60 వేలు ఒరిజనల్ నోట్లు ఇస్తే, అందుకు బదులుగా రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తామని ఆశపెట్టేవారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు, ముగ్గురు కలసి శివారు కాలనీలు, హోటళ్లు, కిరాణా కొట్లలో రూ.100 నుంచి రూ.200 వరకు బిల్లు చేస్తారు. అందుకు రూ.500 లేదా రూ.1000 నకిలీ నోట్లు ఇస్తారు. ఆ తరువాత చిల్లర తీసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోతారు. జాతర్లు, ఉత్సవాల్లో నకిలీ నోట్ల మార్పిడి మరింత జోరుగా సాగిస్తారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను పరిశీలిస్తే... రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే పట్టుబడ్డాయి. అవి అసలుకు ఏమాత్రం తీసిపోవు. ఎవరికీ అనుమానం కూడా రాదు. కీలక సమాచారంతో... పట్టుబడిన ముఠాలో కీలక నిందితుడి నుంచి సేకరించిన సమాచారం మేరకు అసలు సూత్రధారుల కోసం తాడిపత్రి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
మళ్లీ పరిశ్రమలు మైనస్..
♦ ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి -0.8 శాతం క్షీణత ♦ తయారీ రంగం పేలవ పనితీరు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి సంబంధించి ఇటీవల వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు తీసుకువచ్చిన ఉత్సాహం కొద్ది రోజులు కూడా నిలవలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలలో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -0.8 శాతం క్షీణించింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం అతి పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ విభాగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం. రెండు నెలలు స్వల్ప వృద్ధిలో కొనసాగిన ఐఐపీ సూచీ మూడో నెల ఏప్రిల్‌లో తిరిగి క్షీణతలోకి జారిపోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలు గడచిన ఆర్థిక సంవత్సరం 7.6 శాతం వృద్ధి, క్యూ4లో 7.9 శాతం వృద్ధి తీరును ప్రదర్శించి ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఐఐపీ తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాల తీరును చూస్తే.. ♦ క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, పెట్టుబడులకు, భారీ యంత్ర పరిశ్రమల ఉత్పత్తికి సూచికైన క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తి పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 5.5 శాతం వృద్ధి బాట నుంచి - 24.9 శాతం క్షీణతకు జారిపోయింది. ♦ విద్యుత్: ఉత్పత్తి -0.5 శాతం క్షీణత నుంచి 14.6 శాతం వృద్ధికి మళ్లింది. ♦ మైనింగ్: ఈ రంగం ఉత్పత్తిలో కూడా -0.6 శాతం క్షీణత 1.4 శాతం వృద్ధికి మళ్లింది. ♦ వినియోగ వస్తువులు: ఉత్పాదకత 2.8% వృద్ధి నుంచి 1.2 శాతం క్షీణతకు పడింది. ♦ తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో కేవలం తొమ్మిది మాత్రమే సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. ♦ రేటు కోత తప్పదు: పరిశ్రమలు బ్యాంకులు తమకు అందిన రెపో ప్రయోజనాన్ని పూర్తిగా బదలాయించడంతోపాటు, ఆర్బీఐ తాజా రేటు కోత ద్వారానే వృద్ధి ఊపందుకుంటుందని పారిశ్రామిక రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం
డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అంచనా ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, కీలక సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలు సైతం జీడీపీకి జోష్‌నిస్తాయని కంపెనీ సీనియర్ ఆర్థికవేత్త అరుణ్ సింగ్ చెప్పారు. ఇక ఈ ఏడాదికి(2014-15) జీడీపీ వృద్ధి 5.3%గా నమోదు కాగలదని అంచనా వేశారు. సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం తీరు, పారిశ్రామిక పురోగతి, క్షీణిస్తున్న చమురు ధరలు వంటివి వృద్ధికి కీలకంగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇంధన సబ్సిడీలను తొలగించడం, సామాజిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం వంటి వివిధ ప్రభుత్వ విధానాలకుతోడు, ఆర్బీఐ చేపట్టనున్న ఆర్థిక రంగ సంస్కరణలు వృద్ధికి దోహదం చేస్తాయని వివరించింది. -
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం వార్షికోత్సవ సభలో మాగ్నజీల్ చైర్మన్ రేపాల గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని మ్యాగ్నజీల్ చైర్మన్ రేపాల రవికుమార్ చెప్పారు. సీఏ లక్ష్యంగా గల యువత లక్ష్య సాధనకు అవసరమైన శిక్షణ, ప్రేరణతో భావి జీవితంలో నెగ్గుకు వచ్చే మార్గదర్శనం చేస్తున్నామని చెప్పారు. బ్రాడీపేట 3వ లైనులోని కార్యాలయంలో మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రవికుమార్‌తోపాటు సంస్థ డెరైక్టర్ రేపాల భానువిజేత, విద్యార్థులతో కలిసి గాలిలోకి బెలూన్లు వదిలి సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన రవికుమార్ మాట్లాడుతూ దేశానికి ప్రతిభావంతులైన సీఏ విద్యార్థులను అందించే లక్ష్యంతో రెండేళ్ళ క్రితం నెలకొల్పిన మ్యాగ్నజీల్ అదే స్ఫూర్తితో ప్రగతి పధంలో దూసుకెళుతోందన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ వైఎల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యానగర్‌లోని సంస్థ హాస్టల్ క్యాంపస్‌లో సాయంత్రం జంబోరీ పేరుతో విద్యార్థినులు డ్యాన్సులతో హోరెత్తించారు. సినీ, పాప్ గీతాలకు నృత్యాలతో హుషారెత్తించారు. పలువురు విద్యార్థినులు గీతాలాపనతో ఆకట్టుకున్నారు. -
ఐదేళ్లలో రూ.280 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 7% చొప్పున వృద్ధి సాధించాలంటే 4.7 లక్షల కోట్ల డాలర్ల(రూ. 280 లక్షల కోట్లు) పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పారిశ్రామిక సమాఖ్య సీఐఐ అభిప్రాయపడింది. గత ఐదేళ్లలో లభించిన పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా, ఇందుకు ద్రవ్య, ఆర్థిక, వాణిజ్య విధానాలను పునఃసమీక్షించాల్సి ఉందని ఒక నివేదికలో పేర్కొంది. సీఐఐ అంచనా ప్రకారం గత ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 2.9 ట్రిలియన్ డాలర్ల(రూ. 139 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకట్టుకుంది. పారిశ్రామిక రంగం కీలకం రానున్న ఐదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగం సైతం సగటున 6.3% వృద్ధిని సాధించాల్సి ఉందని సీఐఐ అంచనా వేసింది. గత ఐదేళ్లలో సగటున వార్షికంగా 5.2% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. తాజా అంచనాలను అందుకోవాలంటే ఇందుకు రూ. 146 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరపడతాయని లెక్కకట్టింది. వీటిలో తయారీ రంగానికే రూ. 98 లక్షల కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది. తయారీ రంగం పుంజుకుంటే ఉద్యోగ కల్పన సైతం విస్తరిస్తుందని, తద్వారా పెరుగుతున్న ఉద్యోగార్థులకు పలు అవకాశాలు లభిస్తాయని వివరించింది. సర్వీసుల రంగం గత ఐదేళ్ల స్థాయిలోనే 8% చొప్పున దూసుకెళ్లాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు ఐదేళ్ల కాలంలో రూ. 98 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాల్సి ఉంటుందని తెలిపింది. అంచనా వేసిన విధంగా త యారీ రంగం పుంజుకుంటే, ఇది సర్వీసుల రంగానికి కూడా బదిలీ అవుతుందని వెల్లడించింది. ఆరోగ్యం, విద్య...: ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, ఫైనాన్షియల్ సర్వీసులు, టూరిజం వంటి రంగాలలోనూ భారీ అవకాశాలున్నాయని, వీటిని వెలికితీయాల్సి ఉన్నదని సీఐఐ డెరైక్టర్ జనర ల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు తగిన విధానాలు రూపొందించడం ద్వారా అనూహ్య వృద్ధిని సాధించవచ్చునని చెప్పారు. ఇక వ్యవసాయ రంగంపైనా దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నదని సీఐఐ నివేదిక అభిప్రాయపడింది. పూర్తిగా వర్షాలపై ఆధార పడటంతో ఉత్పాదకత పడిపోతున్నదని తెలిపింది. రానున్న ఐదేళ్లలో వ్యవసాయ రంగం సగటున 4% వార్షిక వృద్ధిని అందుకోవలసి ఉందని పేర్కొంది. ఇందుకు రూ. 36 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోవాలని తెలిపింది. మౌలిక సదుపాయాలు.... మౌలిక సదుపాయాల రంగం విషయానికివస్తే పెట్టుబడులు రూ. 64.3 లక్షల కోట్లకు పెట్టుబడులు పెరగాల్సి ఉందని సీఐఐ నివేదిక పేర్కొంది. ఈ రంగానికి గత ఐదేళ్లలో రూ. 24 ల క్షల కోట్ల పెట్టుబడులు లభించాయని తెలిపింది. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక రంగానికి లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరపడతాయని ప్రణాళికా సంఘం అంచనా వేయగా, వీటిలో 40% ప్రయివేట్ రంగం నుంచే సమకూర్చుకోవలసి ఉన్నదని సీఐఐ తెలిపింది. -
వృద్ధి..ఉపాధి..సంస్కరణలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి మళ్లీ గాడిలోపెట్టి.. ఉద్యోగాలను భారీగా సృష్టించడమే తమ ప్రథమ కర్తవ్యమని మోడీ సర్కారు తేల్చిచెప్పింది. ఇందుకోసం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బుధవారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2013-14 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేలో గత సంవత్సరం గణాంకాలకుతోడు భవిష్యత్తు కార్యాచరణను ఆవిష్కరించారు. నేడు(గురువారం) మొట్టమొదటి బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వృద్ధి, ఉపాధి పునరుత్తేజానికి ముఖ్యంగా మౌలిక రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తేలా చేయాలని సర్వే ఉద్ఘాటించింది. ఇదే సమయంలో ఖజానాలో లోటు భారాన్ని తగ్గించుకునేందుకు సబ్సిడీల తగ్గింపు... పన్నుల విధానంలో సంస్కరణలు కూడా చాలా కీలకమేనంటూ సూచించింది. ఇక ఈ ఏడాది(2014-15) స్థూలదేశీయోత్పత్తి వృద్ధిరేటు 5.4-5.9 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. వృద్ధిని పుంజుకునేలా చేయాలంటే... మార్కెట్ ఆధారిత సంస్కరణలు, తయారీ రంగానికి బూస్ట్, పలు రంగాల్లో నిర్మాణాత్మక మార్పులు వంటివి అత్యంత ఆవశ్యకమని కూడా సర్వే పేర్కొంది. ఆర్థిక పరిస్థితి దుర్భరం... 2006 నుంచి 2014 వరకూ అధిక ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు తూట్లుపడ్డాయని.. కనిపిస్తున్నదానికంటే ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గింపు, ప్రభుత్వ ఆదాయం పెంపునకు తగిన చర్యలన్నీ చేపట్టాలని సూచించింది. ‘దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం మళ్లీ పుంజుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ కొద్దిగా పుంజుకోవచ్చు. దీనివల్ల ఈ ఏడాది, రానున్న కాలంలో కూడా భారత్ వృద్ధిరేటు కోలుకునే అవకాశం ఉంది’ అని సర్వే పేర్కొంది. ఇదిలావుండగా... గత రెండు సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోవడానికి(2012-13లో 4.5%, 2013-14లో 4.7%) పారిశ్రామిక రంగం తిరోగమనమే కారణమని సర్వే స్పష్టం చేసింది. ఈ ఏడాది 5 శాతం కంటే మెరుగైన వృద్ధే ఉండొచ్చని పేర్కొంది. పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాలనలో మెరుగుదలతో రానున్న సంవత్సరాల్లో వృద్ధి రేటు 7-8 శాతాన్ని అందుకునే అవకాశాలున్నాయి. అయితే.. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవన వర్షపాతం కొరతతో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఆహారోత్పత్తుల ధరలు పెరిగేందుకు దారితీయొచ్చని పేర్కొంది. ద్రవ్యలోటు ఆందోళన... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య వ్యత్యాసం) 4.5 శాతంగా ఉండొచ్చని సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని మరింత తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యంతర బడ్జెట్లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈ ఏడాది ద్రవ్యలోటును 4.1 శాతానికి తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించడం తెలిసిందే. అయితే, జైట్లీ మాత్రం గతేడాది స్థాయిలోనే ద్రవ్యలోటును అంచనావేయడం విశేషం. దీంతో మోడీ సర్కారు కొన్ని ప్రజాకర్షక తాయిలాలు ప్రకటించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు తక్షణమే చేపట్టాల్సిన చర్యలు సర్వేలో ఉన్నాయని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మాయారామ్ అన్నారు. అధిక వృద్ధి రేటును అందుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సి ఉందని ఆర్థిక సర్వేకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. -
ఆర్థిక క్రమశిక్షణతోనే వృద్ధి గాడిలోకి: జైట్లీ
శ్రీనగర్: దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడాలంటే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5% దిగువనే కొట్టుమిట్టాడుతున్న జీడీపీ వృద్ధి రేటును పుంజుకునేలా చేయాలంటే కొన్ని కీలక చర్యలు అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. రక్షణ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న జైట్లీ... ఆదివారమిక్కడ భద్రతకు సంబంధించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం ఆర్థికపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. కాగా, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న ప్రశ్నకు.. బడ్జెట్లో ఏం చేయబోతున్నామనేది ఇప్పుడే నాతో చెప్పించాలనుకుంటున్నారా అని చమత్కరించారు. మందగమనంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయాలంటే వచ్చే రెండేళ్లలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, కొన్ని వర్గాలకు ఇవి రుచించనప్పటికీ భరించాల్సిందేనంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన మర్నాడే జైట్లీ ఇదే తరహాలో వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఈక్విటీపై గురిపెడదాం..
- నాలుగేళ్లలో సెన్సెక్స్ లక్ష్యం 50,000 - 2008తో పోలిస్తే మార్కెట్లు ఇప్పుడే చౌక - బ్యాంకింగ్, ఇన్ఫ్రా, పవర్, మైనింగ్ జోరు సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తిగా మెజార్టీని ఇస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. కష్టాల కడలిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కాబోయే ప్రధాని మోడీకి మరింత వెసులుబాటు కలగనుంది. అభివృద్ధి నినాదంతో ఏడాదిగా ప్రచారం ప్రారంభించిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని సర్వేలు చెపుతుండటంతో గత మూడు నెలల్లోనే దేశీయ స్టాక్ సూచీలు 20 శాతానికి పైగా పెరిగాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటం, ఇదే సమయంలో ఈక్విటీలు మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది సరైన సమయంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయిలో ఉన్న మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయా, ఏ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నా యన్న దానిపై స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి ఏమంటున్నారో చూద్దాం.. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న మార్కెట్ అంచనాలను నిజం చేయడమే కాకుండా, ఎవరూ ఊహించని విధంగా బీజేపీకే పూర్తిస్థాయి మెజార్టీ రావడం ఆశ్చర్యపర్చింది. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం రావడంతో విదేశీ నిధులను ఇండియా ఆకర్షించనుంది. మధ్య, దీర్ఘకాలానికి ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ రూపంలో విదేశీ నిధులు పెరిగే అవకాశం ఉంది. నాలుగేళ్లలో రెట్టింపు ప్రస్తుతం మన స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నా వచ్చే ఒకటి నుంచి మూడేళ్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకొని ఆ మేరకు స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుతాయి. గత కొంతకాలంగా మార్కెట్లు పెరుగుతున్నా చిన్న ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్ దూరంగానే ఉన్నాయి. రానున్న కాలంలో ఎఫ్ఐఐ నిధులతో పాటు రిటైల్, డొమెస్టిక్ ఫండ్ నిధులు ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్లు మరింత పైకి పెరుగుతాయని చెప్పొచ్చు. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గి, వృద్ధిరేటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఏడాదిలో దేశీయ సూచీల నుంచి 20 నుంచి 30 శాతం లాభాలను ఆశించొచ్చు. మూడు, నాలుగేళ్లలో సూచీలు 80 నుంచి 100 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. అంటే ప్రస్తుతం సెన్సెక్స్ 25,000కు చేరువలో ఉండటంతో రానున్న కాలంలో 50,000 వరకు చేరే అవకాశం ఉంది. అయినా కొనవచ్చు... ప్రస్తుతం స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారు. సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నప్పటికీ గతంతో పోలిస్తే చౌకగానే ఉన్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. సెన్సెక్స్ 2014-15 ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే సుమారు 16 పీఈ వద్ద కదులుతోంది. అదే 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు సెన్సెక్స్ 24 పీఈ వద్దకు చేరింది. సగటు పీఈ చూస్తే 18గా ఉంది. అంటే ఏ విధంగా చూసినా ప్రస్తుతం మన సూచీలు చౌకగానే ఉన్నాయని, రానున్న కాలంలో మరింత పైకి పెరిగే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. కొన్ని భయాలూ ఉన్నాయి.. దీర్ఘకాలానికి మార్కెట్లకు అన్ని శుభసూచనలే కనపడుతున్నా.. స్వల్పకాలానికి కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే ప్రభావం చూపుతాయి. అదే విధంగా అధిక ద్రవ్యోల్బణం కూడా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. వీటికి తోడు అంతర్జాతీయంగా కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ భయాలున్నప్పటికీ వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో సంస్కరణలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ప్రతికూలాంశాలతో వచ్చే చిన్నపాటి కరెక్షన్స్ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. -
రంగరాజన్ వెల్లడి
అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: ఎఫ్‌డీఐలతో దేశ ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం కాగలదని, త్వరలో మంచిరోజులు వస్తాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ప్రపంచఆర్థిక వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎకనామిక్ కమిటీ ప్లాటినం జూబ్లీవేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శరవేగంగా పురోగతిలో దూసుకెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపిందని, అయినప్పటికీ భారత ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెంచుకునేందుకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా ఆర్థికవ్యవస్థ ఒడిదొడుకులను ఆయన సమగ్రంగా వివరించారు. తాజాగా గతేడాదితో పోలిస్తేఆర్థిక వృద్ధిరేటు గణాంకాలు తగ్గినట్లు సూచిస్తున్నప్పటికీ గత ఐదారు నెలల్లో వృద్ధిరేటు పుంజుకోవడం శుభపరిణామమని సంతృప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి దేశానికి ఉపయోగపడేలా మలచుకోవడం పట్ల దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా అడవుల కింద గల అపారమైన బొగ్గు నిల్వల ఉత్పాదన పెంచగలిగితే దేశానికి విద్యుత్తు కొరతే ఉండదన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీకి,ఎకనామిక్ కమిటీ తరపున విశేషసేవలు అందించిన హరినాథ్‌రెడ్డి, వనం వీరేందర్, డాక్టర్ రంగారావు, కృష్ణాజీయాదవ్లతోపాటు పలువురిని రంగరాజన్ సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆర్.సుఖేష్‌రెడ్డి, హనుమంతరావు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.