వృద్ధి..ఉపాధి..సంస్కరణలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి మళ్లీ గాడిలోపెట్టి.. ఉద్యోగాలను భారీగా సృష్టించడమే తమ ప్రథమ కర్తవ్యమని మోడీ సర్కారు తేల్చిచెప్పింది. ఇందుకోసం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బుధవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2013-14 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేలో గత సంవత్సరం గణాంకాలకుతోడు భవిష్యత్తు కార్యాచరణను ఆవిష్కరించారు. నేడు(గురువారం) మొట్టమొదటి బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
వృద్ధి, ఉపాధి పునరుత్తేజానికి ముఖ్యంగా మౌలిక రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తేలా చేయాలని సర్వే ఉద్ఘాటించింది. ఇదే సమయంలో ఖజానాలో లోటు భారాన్ని తగ్గించుకునేందుకు సబ్సిడీల తగ్గింపు... పన్నుల విధానంలో సంస్కరణలు కూడా చాలా కీలకమేనంటూ సూచించింది. ఇక ఈ ఏడాది(2014-15) స్థూలదేశీయోత్పత్తి వృద్ధిరేటు 5.4-5.9 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. వృద్ధిని పుంజుకునేలా చేయాలంటే... మార్కెట్ ఆధారిత సంస్కరణలు, తయారీ రంగానికి బూస్ట్, పలు రంగాల్లో నిర్మాణాత్మక మార్పులు వంటివి అత్యంత ఆవశ్యకమని కూడా సర్వే పేర్కొంది.
ఆర్థిక పరిస్థితి దుర్భరం...
2006 నుంచి 2014 వరకూ అధిక ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు తూట్లుపడ్డాయని.. కనిపిస్తున్నదానికంటే ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గింపు, ప్రభుత్వ ఆదాయం పెంపునకు తగిన చర్యలన్నీ చేపట్టాలని సూచించింది. ‘దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం మళ్లీ పుంజుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ కొద్దిగా పుంజుకోవచ్చు.
దీనివల్ల ఈ ఏడాది, రానున్న కాలంలో కూడా భారత్ వృద్ధిరేటు కోలుకునే అవకాశం ఉంది’ అని సర్వే పేర్కొంది. ఇదిలావుండగా... గత రెండు సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోవడానికి(2012-13లో 4.5%, 2013-14లో 4.7%) పారిశ్రామిక రంగం తిరోగమనమే కారణమని సర్వే స్పష్టం చేసింది. ఈ ఏడాది 5 శాతం కంటే మెరుగైన వృద్ధే ఉండొచ్చని పేర్కొంది. పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాలనలో మెరుగుదలతో రానున్న సంవత్సరాల్లో వృద్ధి రేటు 7-8 శాతాన్ని అందుకునే అవకాశాలున్నాయి. అయితే.. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవన వర్షపాతం కొరతతో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఆహారోత్పత్తుల ధరలు పెరిగేందుకు దారితీయొచ్చని పేర్కొంది.
ద్రవ్యలోటు ఆందోళన...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య వ్యత్యాసం) 4.5 శాతంగా ఉండొచ్చని సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని మరింత తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈ ఏడాది ద్రవ్యలోటును 4.1 శాతానికి తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించడం తెలిసిందే. అయితే, జైట్లీ మాత్రం గతేడాది స్థాయిలోనే ద్రవ్యలోటును అంచనావేయడం విశేషం.
దీంతో మోడీ సర్కారు కొన్ని ప్రజాకర్షక తాయిలాలు ప్రకటించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు తక్షణమే చేపట్టాల్సిన చర్యలు సర్వేలో ఉన్నాయని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మాయారామ్ అన్నారు. అధిక వృద్ధి రేటును అందుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సి ఉందని ఆర్థిక సర్వేకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు.