అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: ఎఫ్‌డీఐలతో దేశ ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం కాగలదని, త్వరలో మంచిరోజులు వస్తాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ప్రపంచఆర్థిక వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎకనామిక్ కమిటీ ప్లాటినం జూబ్లీవేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ శరవేగంగా పురోగతిలో దూసుకెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపిందని, అయినప్పటికీ భారత ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెంచుకునేందుకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా ఆర్థికవ్యవస్థ ఒడిదొడుకులను ఆయన సమగ్రంగా వివరించారు. తాజాగా గతేడాదితో పోలిస్తేఆర్థిక వృద్ధిరేటు గణాంకాలు తగ్గినట్లు సూచిస్తున్నప్పటికీ గత ఐదారు నెలల్లో వృద్ధిరేటు పుంజుకోవడం శుభపరిణామమని సంతృప్తి చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి దేశానికి ఉపయోగపడేలా మలచుకోవడం పట్ల దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా అడవుల కింద గల అపారమైన బొగ్గు నిల్వల ఉత్పాదన పెంచగలిగితే దేశానికి విద్యుత్తు కొరతే ఉండదన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీకి,ఎకనామిక్ కమిటీ తరపున విశేషసేవలు అందించిన హరినాథ్‌రెడ్డి, వనం వీరేందర్, డాక్టర్ రంగారావు, కృష్ణాజీయాదవ్‌లతోపాటు పలువురిని రంగరాజన్ సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆర్.సుఖేష్‌రెడ్డి, హనుమంతరావు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రంగరాజన్ వెల్లడి
Published Sat, Oct 19 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement