C. Rangarajan
-
గవర్నర్ తన ధర్మాన్ని పాటించాలి
ముంబై: ఆర్బీఐ స్వతంత్రతను కాపాడే విషయంలో నూతన గవర్నర్ శక్తికాంతదాస్ తన ధర్మాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సూచించారు. ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వ అధికారి శక్తికాంతదాస్ కాదని చెప్పారాయన. ‘‘చాలా మంది ఢిల్లీ అధికారులు ఆర్బీఐలోకి వచ్చారు. ఇదే తొలిసారి కాదు. ఒక్కసారి వారు బాధ్యతలు చేపట్టాక ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే కృషి చేశారు’’ అని రంగరాజన్ వ్యాఖ్యానించారు. ఇది ధర్మం వంటిదని, తనతోపాటు మాజీ గవర్నర్లంతా ఇదే అనుసరించారని చెప్పారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. శక్తికాంతదాస్ ఆర్బీఐ స్వతంత్రను పణంగా పెట్టకుండా, రెండింటి మధ్య వ్యవహారాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, పనిచేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీడీపీ గణన విషయంలో ఇటీవల చేసిన మార్పుల గురించి కొన్ని కనీస వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) వెల్లడించాల్సిన అవసరం ఉందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ‘‘సీఎస్‌వో ఎంతో పేరున్న సంస్థ. గత గణాంకాలను సవరించే విషయంలో అనుసరించిన విధానాన్ని మరింత స్పష్టం చేయాలి’’ అని కోరారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుమఖం పడితే, ఆర్బీఐ ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!
⇒ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి ⇒ కేంద్రానికి రంగరాజన్ సూచన అహ్మదాబాద్: ‘భారత్‌లో తయారీ’ ఆలోచన పాతదేనని, ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కేంద్రానికి సూచించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలన్న ఉద్దేశంతో మేకిన్ ఇండియా (బారత్‌లో తయారీ) పేరుతో మోదీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గానూ పనిచేసిన రంగరాజన్ ఈ అంశంపై అహ్మదాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. -
విద్య, వైద్య సేవల్లో పీపీపీ విధానాలు: రంగరాజన్
స్థిరమైన ఆర్థిక వృద్ధితోనే ఉపాధి కల్పన సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం వంటికనీస మౌలిక సేవలు ప్రభుత్వ విభాగాల ద్వారా మాత్రమే కాకుండా.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లోనూ అందాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్) వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన, పెరుగుతున్న యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం స్థిరమైన, బలీయమైన వృద్ధిరేటు అవసరమన్నారు. 1970ల చివరి దశలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన చైనా భారత్ కంటే వేగంగా ముందుకు దూసుకుపోయిందన్నారు. 1970నాటికి దేశ జీడీపీ నాలుగు శాతంలోపే ఉండగా.. 2005-06లో అది తొలిసారి 8శాతం దాటిందన్నారు. వృద్ధిరేటు పెరగటమే కాకుండా, సగటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడడం ఎంతో అసవరమన్నారు. అప్పుడే మానవాభివృద్ధి సూచీలో మన దేశం మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. 2013మానవాభివృద్ధి సూచీలో 187 దేశాల జాబితా లో.. భారత్ 136వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ వైద్య వసతులు, అక్షరాస్యత తదితర విషయాల్లో మనం ఇంకా బాగా వెనకబడి ఉన్నామని చెప్పారు. కొన్ని విషయాల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలాంటి చిన్న దేశాలకంటే వెనకబడ్డామని.. అందుకే ఆర్థిక వృద్ధితోపాటు సామాజికాభివృద్ధి కూడా చాలా ముఖ్యమని గుర్తించాలని సూచించారు. -
రంగరాజన్ వెల్లడి
అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: ఎఫ్‌డీఐలతో దేశ ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం కాగలదని, త్వరలో మంచిరోజులు వస్తాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ప్రపంచఆర్థిక వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. శుక్రవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎకనామిక్ కమిటీ ప్లాటినం జూబ్లీవేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శరవేగంగా పురోగతిలో దూసుకెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపిందని, అయినప్పటికీ భారత ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెంచుకునేందుకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా ఆర్థికవ్యవస్థ ఒడిదొడుకులను ఆయన సమగ్రంగా వివరించారు. తాజాగా గతేడాదితో పోలిస్తేఆర్థిక వృద్ధిరేటు గణాంకాలు తగ్గినట్లు సూచిస్తున్నప్పటికీ గత ఐదారు నెలల్లో వృద్ధిరేటు పుంజుకోవడం శుభపరిణామమని సంతృప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి దేశానికి ఉపయోగపడేలా మలచుకోవడం పట్ల దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా అడవుల కింద గల అపారమైన బొగ్గు నిల్వల ఉత్పాదన పెంచగలిగితే దేశానికి విద్యుత్తు కొరతే ఉండదన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీకి,ఎకనామిక్ కమిటీ తరపున విశేషసేవలు అందించిన హరినాథ్‌రెడ్డి, వనం వీరేందర్, డాక్టర్ రంగారావు, కృష్ణాజీయాదవ్లతోపాటు పలువురిని రంగరాజన్ సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆర్.సుఖేష్‌రెడ్డి, హనుమంతరావు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉల్లి ఘాటు.. ధరల పోటు!
న్యూఢిల్లీ: దేశ ప్రజలకే కాదు... ఇప్పుడు ప్రభుత్వం, విధానకర్తలకు కూడా ఉల్లి ఘాటు గట్టిగానే తగులుతోంది. మంటెక్కిస్తున్న ఉల్లిపాయ ధర.. మొత్తం ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది. జూలైతో పోల్చితే ఆగస్టులో టోకు ధరల పెరుగుదల రేటు (శాతం) మరింత తీవ్రమయ్యింది. వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల రేటు జూలైలో 5.79 శాతంగా ఉంటే... ఆగస్టులో 6.1 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. ఉల్లిసహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ ఆగస్టులో ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణమయ్యింది. వార్షిక ప్రాతిపదికన అంటే 2012 ఆగస్టుతో పోల్చితే ఒక్క ఉల్లి ధరలు 2013 ఆగస్టులో 244.62% పెరిగాయి. మే వరకూ వరుసగా నాలుగు నెలలు టోకు ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి తిరిగి పైచూపు చూడడం ప్రారంభించింది. సరఫరాలవైపు సమస్యలను పరిష్కరించి ద్రవ్యోల్బణం అదుపునకు కృషి చేయాలని ఫిక్కీసహా పలు పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిత్యావసరాలు భారమే... మొత్తం సూచీలో 14% వాటా కలిగిన ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 2012 ఆగస్టుతో పోల్చితే 2013 ఆగస్టులో 18.18 శాతంగా ఉంది. వేర్వేరుగా చూస్తే- కూరగాయల ధరలు 77.81% పెరిగాయి. బియ్యం ధరలు 20 శాతం ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 18.86 శాతం ఎగశాయి. తృణ ధాన్యాల ధరలు 14.35 శాతం ఎగశాయి. పండ్లు (8.17 శాతం), గోధుమలు (7.6 శాతం), పాలు (5.63 శాతం) వంటి నిత్యావసర ధరలు సైతం పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. కాగా వార్షిక ప్రాతిపదికన ఆగస్టులో ఆలూ ధరలు 15.13 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలు మాత్రం 14.4 శాతం దిగివచ్చాయి. మూడు విభాగాలు ఇలా... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 11.72 శాతంగా ఉంది (జూలైలో 8.99 శాతం). ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 18.18 శాతం కాగా (జూలైలో 11.91 శాతం), ఆహారేతర ఉత్పత్తుల విభాగంలో పెరుగుదల రేటు 1.06 శాతం (జూలైలో 5.51 శాతం). సూచీలో 15% వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరల పెరుగుదల జూలై 11.31 శాతంతో పోల్చితే ఆగస్టులో స్వల్పంగా పెరిగి 11.34 శాతానికి చేరింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తుల (కోర్) విభాగంలో ధరల పెరుగుదల రేటు 1.90 శాతం. జూలైలో ఇది 2.81 శాతం. ఆర్బీఐ పాలసీపై ఆసక్తి! నిత్యావసర ఉత్పత్తుల ధరల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశ్లేషకుల దృష్టి ఈ నెల 20న రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేపట్టనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్షపై కేంద్రీకృతమైంది. ఇది కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో జరుగుతున్న తొలి సమీక్ష కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. ధరల తీవ్రత నేపథ్యంలో ఆయన వడ్డీరేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. వృద్ధి లక్ష్యంగా వడ్డీరేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కోర్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడాన్ని వారు తమ వాదనకు కారణంగా చూపుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ద్రవ్యోల్బణం కట్టడికే రాజన్ ఆధిక ప్రాధాన్యత ఇస్తారని మరికొందరి విశ్లేషణ. 4-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భావిస్తుండగా, ఈ లక్ష్యాన్ని మించి టోకు ద్రవ్యోల్బణం పైకి దూసుకుపోవడం ఆందోళనకరమని వారు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఆయా అంశాలతోపాటు రానున్న రెండు రోజుల్లో అమెరికా ఫెడ్ నిర్ణయాలు ప్రధానంగా పాలసీపై ప్రభావితం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి క్షీణతే కారణం: మాంటెక్ డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత, దీనితో చమురు-ఇతర దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారడం, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చూపడం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. అయితే తగిన వర్షపాతం వల్ల దిగుబడులు పెరుగుతాయని, సరఫరాల వైపు సమస్యలు కూడా తొలగిపోయి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని విశ్లేషించారు. ఈ ఏడాది చివరకు ద్రవ్యోల్బణం 5-6% శ్రేణిలో ఉంటుందన్న అభిప్రాయపడ్డారు.