ఉల్లి ఘాటు.. ధరల పోటు!
ఉల్లి ఘాటు.. ధరల పోటు!
Published Tue, Sep 17 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
న్యూఢిల్లీ: దేశ ప్రజలకే కాదు... ఇప్పుడు ప్రభుత్వం, విధానకర్తలకు కూడా ఉల్లి ఘాటు గట్టిగానే తగులుతోంది. మంటెక్కిస్తున్న ఉల్లిపాయ ధర.. మొత్తం ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది. జూలైతో పోల్చితే ఆగస్టులో టోకు ధరల పెరుగుదల రేటు (శాతం) మరింత తీవ్రమయ్యింది. వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల రేటు జూలైలో 5.79 శాతంగా ఉంటే... ఆగస్టులో 6.1 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. ఉల్లిసహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ ఆగస్టులో ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణమయ్యింది. వార్షిక ప్రాతిపదికన అంటే 2012 ఆగస్టుతో పోల్చితే ఒక్క ఉల్లి ధరలు 2013 ఆగస్టులో 244.62% పెరిగాయి. మే వరకూ వరుసగా నాలుగు నెలలు టోకు ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి తిరిగి పైచూపు చూడడం ప్రారంభించింది. సరఫరాలవైపు సమస్యలను పరిష్కరించి ద్రవ్యోల్బణం అదుపునకు కృషి చేయాలని ఫిక్కీసహా పలు పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
నిత్యావసరాలు భారమే...
మొత్తం సూచీలో 14% వాటా కలిగిన ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 2012 ఆగస్టుతో పోల్చితే 2013 ఆగస్టులో 18.18 శాతంగా ఉంది. వేర్వేరుగా చూస్తే- కూరగాయల ధరలు 77.81% పెరిగాయి. బియ్యం ధరలు 20 శాతం ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 18.86 శాతం ఎగశాయి. తృణ ధాన్యాల ధరలు 14.35 శాతం ఎగశాయి. పండ్లు (8.17 శాతం), గోధుమలు (7.6 శాతం), పాలు (5.63 శాతం) వంటి నిత్యావసర ధరలు సైతం పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. కాగా వార్షిక ప్రాతిపదికన ఆగస్టులో ఆలూ ధరలు 15.13 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలు మాత్రం 14.4 శాతం దిగివచ్చాయి.
మూడు విభాగాలు ఇలా...
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 11.72 శాతంగా ఉంది (జూలైలో 8.99 శాతం). ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 18.18 శాతం కాగా (జూలైలో 11.91 శాతం), ఆహారేతర ఉత్పత్తుల విభాగంలో పెరుగుదల రేటు 1.06 శాతం (జూలైలో 5.51 శాతం). సూచీలో 15% వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరల పెరుగుదల జూలై 11.31 శాతంతో పోల్చితే ఆగస్టులో స్వల్పంగా పెరిగి 11.34 శాతానికి చేరింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తుల (కోర్) విభాగంలో ధరల పెరుగుదల రేటు 1.90 శాతం. జూలైలో ఇది 2.81 శాతం.
ఆర్‌బీఐ పాలసీపై ఆసక్తి!
నిత్యావసర ఉత్పత్తుల ధరల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశ్లేషకుల దృష్టి ఈ నెల 20న రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చేపట్టనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్షపై కేంద్రీకృతమైంది. ఇది కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో జరుగుతున్న తొలి సమీక్ష కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. ధరల తీవ్రత నేపథ్యంలో ఆయన వడ్డీరేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. వృద్ధి లక్ష్యంగా వడ్డీరేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కోర్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడాన్ని వారు తమ వాదనకు కారణంగా చూపుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ద్రవ్యోల్బణం కట్టడికే రాజన్ ఆధిక ప్రాధాన్యత ఇస్తారని మరికొందరి విశ్లేషణ. 4-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భావిస్తుండగా, ఈ లక్ష్యాన్ని మించి టోకు ద్రవ్యోల్బణం పైకి దూసుకుపోవడం ఆందోళనకరమని వారు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఆయా అంశాలతోపాటు రానున్న రెండు రోజుల్లో అమెరికా ఫెడ్ నిర్ణయాలు ప్రధానంగా పాలసీపై ప్రభావితం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
రూపాయి క్షీణతే కారణం: మాంటెక్
డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత, దీనితో చమురు-ఇతర దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారడం, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చూపడం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. అయితే తగిన వర్షపాతం వల్ల దిగుబడులు పెరుగుతాయని, సరఫరాల వైపు సమస్యలు కూడా తొలగిపోయి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని విశ్లేషించారు. ఈ ఏడాది చివరకు ద్రవ్యోల్బణం 5-6% శ్రేణిలో ఉంటుందన్న అభిప్రాయపడ్డారు.
Advertisement