స్థిరమైన ఆర్థిక వృద్ధితోనే ఉపాధి కల్పన
సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం వంటికనీస మౌలిక సేవలు ప్రభుత్వ విభాగాల ద్వారా మాత్రమే కాకుండా.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లోనూ అందాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్) వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన, పెరుగుతున్న యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం స్థిరమైన, బలీయమైన వృద్ధిరేటు అవసరమన్నారు.
1970ల చివరి దశలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన చైనా భారత్ కంటే వేగంగా ముందుకు దూసుకుపోయిందన్నారు. 1970నాటికి దేశ జీడీపీ నాలుగు శాతంలోపే ఉండగా.. 2005-06లో అది తొలిసారి 8శాతం దాటిందన్నారు. వృద్ధిరేటు పెరగటమే కాకుండా, సగటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడడం ఎంతో అసవరమన్నారు. అప్పుడే మానవాభివృద్ధి సూచీలో మన దేశం మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. 2013మానవాభివృద్ధి సూచీలో 187 దేశాల జాబితా లో.. భారత్ 136వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ వైద్య వసతులు, అక్షరాస్యత తదితర విషయాల్లో మనం ఇంకా బాగా వెనకబడి ఉన్నామని చెప్పారు. కొన్ని విషయాల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలాంటి చిన్న దేశాలకంటే వెనకబడ్డామని.. అందుకే ఆర్థిక వృద్ధితోపాటు సామాజికాభివృద్ధి కూడా చాలా ముఖ్యమని గుర్తించాలని సూచించారు.
విద్య, వైద్య సేవల్లో పీపీపీ విధానాలు: రంగరాజన్
Published Sat, Feb 22 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement