విపక్షాల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టండి
బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపు
న్యూఢిల్లీ: విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదవుల కోసం కాకుండా దేశ నిర్మాణానికి పాటుపడాలని, త్యాగానికి సిద్ధం కావాలని కోరారు. సోమవారమిక్కడ ఘనంగా జరిగిన పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ బిల్లుపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే కులం, ఒకే జాతి అనే భావనను బీజేపీ విశ్వసిస్తుందని, అయితే దీన్ని మతతత్వంగా విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
కాంగ్రెస్ నిత్యం అసత్య ప్రచారానికి పాల్పడుతోందని, అందుకు తన జీవితంలో ఓ ఉదాహరణ ఉందని చెప్పారు. ‘నేను బీజేపీలో చేరేటప్పుడు నన్ను గేలి చేశారు. ఓ కాంగ్రెస్ మంత్రి వద్దకు మా మామ నన్ను తీసుకెళ్లారు. ‘బీజేపీలోకి వెళ్తున్నావా? అది ఉత్తర భారత పార్టీ, బ్రాహ్మణుల పార్టీ. శాకాహార పార్టీ’ అని అన్నారు. నేనేమో మాంసాహారిని. పార్టీలో చేరాలా, వద్దా అని సందిగ్ధపడ్డాను. అయితే మా సంఘ్ ప్రచారక్‌ను అడిగితే ‘శాకాహారమైనా తినొచ్చు, మాంసాహారమైనా తినొచ్చు’ అని చెప్పారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, సీనియర్ నేత మురళీమనోహర్ జోషీలు రాకపోవడం గమనార్హం. వీరితోపాటు ఏ నేతలకూ ఆహ్వానం పంపలేదని పార్టీ వర్గాలు చెప్పాయి.