సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్య పాలన వచ్చి 75 ఏళ్లయినా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు బాధపడే పరిస్థితి ఉందని.. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు.
తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సభ జరిగింది. ఇందులో కేటీఆర్ ‘దేశంలో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలి’అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘మౌలిక వసతుల కొరతతో దేశ ప్రగతి మందగిస్తోంది. దేశాభివృద్ధికి చోదకశక్తిగా నిలవాల్సిన యువత ఉద్యోగ అవకాశాల్లేక నిరాశతో కొట్టుమిట్టాడుతోంది. సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్ష కొనసాగుతున్నాయి. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక మగ్గిపోతున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదు. దేశంలో అపారమైన సహజ వనరులున్నా అందిపుచ్చుకోవడంలో పాలకుల వైఫల్యంతో ప్రజలు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారు.
నీటి కోసం ఇంకా కొట్లాటలే..
దేశంలో జల వనరుల లభ్యత ప్రజల అవసరాలకు మించి ఉంది. ఏటా లక్షా 40 వేల టీఎంసీల వర్షపాతం కురుస్తోంది. నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. కానీ దేశవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చుకున్న నీళ్లు 20 వేల టీఎంసీలే. మిగతా 50 వేల టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఇందులో 20 వేల టీఎంసీలను వాడుకోగలిగితే.. దేశంలో సాగుయోగ్యమైన 41 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇప్పటికీ నదుల నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీలు కొనసాగుతున్నాయి.
భారీ ప్రాజెక్టులు లేవు.. విద్యుత్ లేదు..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే దేశ నిర్మాణం కోసం బలమైన అడుగులు పడ్డాయి. భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కానీ ఆ తర్వాతి ప్రభుత్వాల నిష్క్రియా పరత్వంతో దేశ ప్రజలు శాపగ్రస్త జీవితం గడుపుతున్నారు. భారత్ కన్నా విస్తీర్ణంలో, జనాభాలో చిన్నవైన దేశాలు కూడా వేల టీఎంసీల సామర్థ్యమున్న పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి.
తెలంగాణ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక బాధలు అనుభవిస్తున్నారు. మన దేశంలో అందుబాటులో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గును హైబ్రిడ్ పద్ధతిలో వాడినట్లయితే దేశ ప్రజలందరికీ, అన్నిరంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను 150 ఏళ్లపాటు ఇవ్వొచ్చు. వ్యవసాయ రంగంలో నెలకొన్న కరెంటు సంక్షోభాన్ని సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు.
మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి
దేశంలో మతోన్మాదశక్తులు విజృంభిస్తే అంతర్గత ఐక్యత విచ్ఛిన్నమైపోతుంది. దేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పతనమవుతుంది. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగా ల్లో విఫలమైంది. ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే దుర్మార్గ ఎత్తుగడ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదశక్తుల పాలన అంతం, తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ అప్రతిహతంగా పురోగమించాలి’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలోని రైతుకు బాసటగా..
తెలంగాణలో రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నాం. రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ విధానం దేశమంతా కొనసాగాలి. ప్రస్తుతం దేశంలో రైతుల పరి స్థితి దయనీయంగా ఉంది.
నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ దేశమంతటా విస్తరించి రైతు రాజ్యాన్ని నెలకొల్పేదిశగా పురోగమించాలని ప్రతినిధుల సభ తీర్మానిస్తోంది. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు దేశవ్యాప్తంగా విస్తరిస్తే అస్పృశ్యత తొలగిపోతుంది. రోడ్లు, పోర్టులు, ఇతర వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలి. ఇవి సాకారం కావాలంటే బీఆర్‌ఎస్ జాతీయస్థాయిలో పురోగమించాలి.
Comments
Please login to add a commentAdd a comment