ఆయన సరైన సమయంలో బయటికి వస్తారు
కేసీఆర్ నిశ్శబ్దం కాంగ్రెస్, బీజేపీలను భయపెడుతోంది
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పోలీసులు రేవంత్ ప్రైవేటు ఆర్మీలా తయారయ్యారు
మా పేరిట డీప్‌ఫేక్ ఆడియో,వీడియోలు పెట్టినా ఆశ్చర్యం లేదు
లగచర్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.. పేదలు, గిరిజనుల కోసం వందసార్లయినా జైలుకు వెళ్తా
కేసీఆర్‌ను ఖతం చేస్తామన్న వారెందరో అడ్రస్ లేకుండా పోయారు
రేవంత్‌కు పాలనా అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు
చరిత్రలో నియంతలకు పట్టిన గతే రేవంత్‌కు ఖాయమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మౌనం కూడా కాంగ్రెస్, బీజేపీలను భయపెడుతోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కేసీఆర్ నిశ్శబ్దం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదని.. ఆయన సరైన సమయంలో బయటికి వస్తారని చెప్పారు. రేవంత్ ఒక అజ్ఞాని, కేసీఆర్ ఒక లెజెండ్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుందని.. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కేసీఆర్ పేరును రేవంత్ ప్రతిరోజూ ప్రస్తావిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..
సాక్షి:లగచర్ల ఘటనలో మీ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఏమంటారు?
కేటీఆర్: లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తలో మాట చెప్తున్నారు. రేవంత్ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం జరుగుతున్న భూసేకరణపై రైతులు అభ్యంతరం చెప్తున్నారు. 9 నెలలుగా సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ వారితో మాట్లాడలేదు. కొందరిని దోషులుగా చూపిస్తూ గిరిజనుల భూములను లాక్కునేందుకు రేవంత్ చేస్తున్న కుట్ర ఇది. లగచర్ల ఘటనను రాజకీయ ప్రేరేపితమైనదిగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత పెంచడమే మీ ఉద్దేశమనే ఆరోపణలపై మీ స్పందన?
కేటీఆర్: కేవలం 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నిరసన వెల్లువెత్తుతోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అల్లాటప్పా నాయకుడు కాదు. గతంలో రేవంత్‌ను ఓడించారు. మరోవైపు రైతులను తన్ని అయినా సరే భూములు తీసుకుంటామని రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి చెప్తున్నారు. సీఎం సోదరుడు అయితే మాత్రం పేదల భూములు లాక్కుంటారా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? రేవంత్‌కు పాలనా అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రిమాండ్ రిపోర్టులో మీ పేరు చేర్చడంపై ఏమంటారు?
కేటీఆర్: పోలీసులు రేవంత్ ప్రైవేటు ఆర్మీలా తయారై... రిమాండు రిపోర్టులో ఏది పడితే అది రాస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు.. పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డి ఫోన్ చేస్తే తప్పేముంది? లగచర్ల కార్యకర్త సురేశ్.. మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేయకూడదా? మా సంభాషణను డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించి వక్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డిపై కూడా కేసులు పెట్టాలి. తిరుపతిరెడ్డి డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు. పరిగి జైలుకు పంపిన లగచర్ల పేదలను విడుదల చేయాలి. పేదలు, గిరిజనుల కోసం ఒక్కసారి కాదు.. వందసార్లు జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధం.
‘మిమ్మల్ని అడ్డుపెట్టి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా..’అన్న సీఎం వ్యాఖ్యలపై మీ స్పందనేంటి?
కేటీఆర్: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని గత 24 ఏండ్లలో అన్నవారందరూ అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు రేవంత్ తన స్థాయి, వయసు, గౌరవం ఏమిటో తెలుసుకోవాలి. కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ దుర్భాషలాడినంత కాలం మేం కూడా అదే తరహాలో సమాధానం ఇస్తాం. కాంగ్రెస్ స్కామ్స్, స్కీమ్స్ గురించి నిలదీస్తూనే ఉంటాం.
‘ఈ–ఫార్ములా’ఆరోపణల సంగతేమిటి?
కేటీఆర్: ఎలక్ట్రిక్ వాహన రంగానికి రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ–ఫార్ములా రేస్ నిర్వహించాం. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు నాదే బాధ్యత. కాంగ్రెస్ తెలంగాణకు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపిస్తారు. కానీ బీజేపీ ఎంపీలు రేవంత్‌కు రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యారనేందుకు అనేందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అమృత్ స్కామ్‌లో వివరాలు ఇచ్చినా కేంద్రం నుంచి స్పందన లేదు. మూసీ పునరుద్ధరణ పేరిట డీపీఆర్ లేకుండా ఇళ్లు కూల్చుతున్నా బీజేపీ నుంచి స్పందన లేదు.
మిమ్మల్ని అరెస్టు వార్తలపై ఏమంటారు?
కేటీఆర్: సీఎం రేవంత్ ఒక శాడిస్ట్. పోలీసులు ప్రైవేటు ఆర్మీలా ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయం. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment