నకిలీ నోట్ల కుంభకోణంలో కదులుతున్న డొంక
► పశ్చిమ బెంగాల్ టూ విజయవాడ
► ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టిన తాడిపత్రి పోలీసులు
► నిందితులను కలిపింది బెంగళూరు జైలు
► కోల్‌కతా ప్రాంతానికి చెందిన అసలు సూత్రధారుల కోసం గాలింపు
దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే నకిలీ నోట్ల కుంభకోణాలకు మూలం మన పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ దేశమే. అక్కడి నుంచి కలకత్తా మీదుగా మన రాష్ట్రానికి చేరి, అన్ని ప్రాంతాలకు నకిలీ నోట్లు సరఫరా అవుతున్నాయనే విషయం తాడిపత్రి పోలీసుల విచారణలో వెల్లడైంది. లోతుగా దర్యాప్తు చేసేకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.- తాడిపత్రి
తాడిపత్రి పోలీసులు వలపన్ని నకిలీ నోట్ల ముఠాను శనివారం అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ నోట్లు, ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దొంగనోట్లు దొరకడం, దాని వెనుక పెద్ద రాకెట్ ఉండడం కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు...
విజయవాడ కేంద్రంగా...
విజయవాడకు చెందిన శ్రీరామవాసుదేవా ఓ హత్య కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో కలకత్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. తాము పశ్చిమబెంగాల్ నుంచి నకిలీ నోట్లు సేకరించి ఇస్తామని, వాటిని చెలామణి చేయాలని కోరగా అందుకు శ్రీరామవాసు దేవా సరేనన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక కలకత్తాకు వెళ్లి తనకు పరిచయమైన వారిని కలుసుకున్నాడు. అక్కడి నుంచి కొన్ని నకిలీ నోట్లు తీసుకువచ్చాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో మరికొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ధర్మవరం చెందిన మోహన్, సాంబశివుడు కూడా బెంగుళూరు జైలులో శ్రీరామవాసుదేవాకు పరిచయస్తులే. వారి ద్వారా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తన కార్యకలాపాలు కొనసాగించాడు. విజయవాడ, తిరుపతి, ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి ప్రాంతాలలో చాలా మంది ఏజెంట్లను నియమించుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారే టార్గెట్.
ప్రధాన నిందితుడు శ్రీరామవాసుదేవా తన అనుచరులైన మోహన్, సాంబశివుడు ద్వారా నియమించుకున్న ఏజెంట్లను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పంపేవాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారిని గుర్తించి సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని సూచించేవారు. రూ.60 వేలు ఒరిజనల్ నోట్లు ఇస్తే, అందుకు బదులుగా రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తామని ఆశపెట్టేవారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు, ముగ్గురు కలసి శివారు కాలనీలు, హోటళ్లు, కిరాణా కొట్లలో రూ.100 నుంచి రూ.200 వరకు బిల్లు చేస్తారు. అందుకు రూ.500 లేదా రూ.1000 నకిలీ నోట్లు ఇస్తారు. ఆ తరువాత చిల్లర తీసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోతారు. జాతర్లు, ఉత్సవాల్లో నకిలీ నోట్ల మార్పిడి మరింత జోరుగా సాగిస్తారు.
ఏమాత్రం అనుమానం రాకుండా..
పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను పరిశీలిస్తే... రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే పట్టుబడ్డాయి. అవి అసలుకు ఏమాత్రం తీసిపోవు. ఎవరికీ అనుమానం కూడా రాదు.
కీలక సమాచారంతో...
పట్టుబడిన ముఠాలో కీలక నిందితుడి నుంచి సేకరించిన సమాచారం మేరకు అసలు సూత్రధారుల కోసం తాడిపత్రి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.