ఈక్విటీపై గురిపెడదాం..
- నాలుగేళ్లలో సెన్సెక్స్ లక్ష్యం 50,000
- 2008తో పోలిస్తే మార్కెట్లు ఇప్పుడే చౌక
- బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, పవర్, మైనింగ్ జోరు
సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తిగా మెజార్టీని ఇస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. కష్టాల కడలిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కాబోయే ప్రధాని మోడీకి మరింత వెసులుబాటు కలగనుంది. అభివృద్ధి నినాదంతో ఏడాదిగా ప్రచారం ప్రారంభించిన ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రానుందని సర్వేలు చెపుతుండటంతో గత మూడు నెలల్లోనే దేశీయ స్టాక్ సూచీలు 20 శాతానికి పైగా పెరిగాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటం, ఇదే సమయంలో ఈక్విటీలు మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది సరైన సమయంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయిలో ఉన్న మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయా, ఏ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నా యన్న దానిపై స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి ఏమంటున్నారో చూద్దాం..
కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న మార్కెట్ అంచనాలను నిజం చేయడమే కాకుండా, ఎవరూ ఊహించని విధంగా బీజేపీకే పూర్తిస్థాయి మెజార్టీ రావడం ఆశ్చర్యపర్చింది. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం రావడంతో విదేశీ నిధులను ఇండియా ఆకర్షించనుంది. మధ్య, దీర్ఘకాలానికి ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ రూపంలో విదేశీ నిధులు పెరిగే అవకాశం ఉంది.
నాలుగేళ్లలో రెట్టింపు
ప్రస్తుతం మన స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నా వచ్చే ఒకటి నుంచి మూడేళ్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకొని ఆ మేరకు స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుతాయి. గత కొంతకాలంగా మార్కెట్లు పెరుగుతున్నా చిన్న ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్ దూరంగానే ఉన్నాయి. రానున్న కాలంలో ఎఫ్‌ఐఐ నిధులతో పాటు రిటైల్, డొమెస్టిక్ ఫండ్ నిధులు ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్లు మరింత పైకి పెరుగుతాయని చెప్పొచ్చు. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గి, వృద్ధిరేటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఏడాదిలో దేశీయ సూచీల నుంచి 20 నుంచి 30 శాతం లాభాలను ఆశించొచ్చు. మూడు, నాలుగేళ్లలో సూచీలు 80 నుంచి 100 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. అంటే ప్రస్తుతం సెన్సెక్స్ 25,000కు చేరువలో ఉండటంతో రానున్న కాలంలో 50,000 వరకు చేరే అవకాశం ఉంది.
అయినా కొనవచ్చు...
ప్రస్తుతం స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారు. సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నప్పటికీ గతంతో పోలిస్తే చౌకగానే ఉన్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. సెన్సెక్స్ 2014-15 ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే సుమారు 16 పీఈ వద్ద కదులుతోంది. అదే 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు సెన్సెక్స్ 24 పీఈ వద్దకు చేరింది. సగటు పీఈ చూస్తే 18గా ఉంది. అంటే ఏ విధంగా చూసినా ప్రస్తుతం మన సూచీలు చౌకగానే ఉన్నాయని, రానున్న కాలంలో మరింత పైకి పెరిగే అవకాశాలున్నాయని చెప్పొచ్చు.
కొన్ని భయాలూ ఉన్నాయి..
దీర్ఘకాలానికి మార్కెట్లకు అన్ని శుభసూచనలే కనపడుతున్నా.. స్వల్పకాలానికి కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే ప్రభావం చూపుతాయి. అదే విధంగా అధిక ద్రవ్యోల్బణం కూడా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. వీటికి తోడు అంతర్జాతీయంగా కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ భయాలున్నప్పటికీ వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో సంస్కరణలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ప్రతికూలాంశాలతో వచ్చే చిన్నపాటి కరెక్షన్స్‌ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.