
నోట్ల రద్దుతో పరిశ్రమల పడక
• డిసెంబర్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత
• నాలుగు నెలల కనిష్టం ∙మైనస్ 0.4 శాతానికి డౌన్
• కీలక తయారీ, వినియోగ ఉత్పత్తుల తగ్గుదల
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2016 డిసెంబర్‌లో 2015 డిసెంబర్‌తో పోల్చిచూస్తే... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా, –0.4 శాతం క్షీణించింది. 2015 డిసెంబర్‌లో సైతం పారిశ్రామిక ఉత్పత్తి –0.9 శాతం క్షీణతలో (2014 డిసెంబర్‌తో పోల్చితే) ఉంది. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో సూచీ 3.2 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోయింది.
తాజా సమీక్షా నెలను చూస్తే... సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం, అలాగే వినియోగ వస్తువుల ఉత్పత్తి భారీగా పడిపోయాయి. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ప్రధానాంశాలు చూస్తే... తయారీ రంగం డిసెంబర్‌లో – 1.9 క్షీణత మరింత తగ్గి –2.0 శాతానికి చేరింది. వినియోగ వస్తువుల్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషను వంటి దీర్ఘకా వినియోగ వస్తువుల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 10.3 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీసహా స్వల్పకాలం వినియోగించే వస్తువుల సూచీ సైతం డిసెంబర్‌లో మైనస్ 5 శాతం క్షీణించింది. ఈ రెండు విభాగాలనూ కలిపి చూస్తే– 3.2 % వృద్ధి (2015 డిసెంబర్‌లో) తాజాగా –6.8 % క్షీణతకు పడిపోయింది.
వచ్చే నెలల్లో పుంజుకుంటుంది: జైట్లీ
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ డిసెంబర్ నెల క్షీణతకు కారణం పెద్ద నోట్ల రద్దేనని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. అయితే ఆ తరువాతి నెలల్లో క్రమంగా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒక చానెల్‌కు ఆయన ఈ మేరకు ఒక ఇంటర్వూ్య ఇచ్చారు. ఏ ఆర్థికమంత్రి అయినా ఎప్పుడూ వడ్డీరేట్లు తగ్గాలనే కోరుకుంటారనీ, ఇది వృద్ధికి దారితీస్తుందని భావిస్తారనీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.