ఢిల్లీ: ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి.. రెండేళ్ల శిక్ష గనుక పడితే వాళ్ల సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంతో ఈ సెక్షన్ గురించి దేశవ్యాప్త చర్చ కూడా నడిచింది.
అయితే.. పీపుల్స్ రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ.. సామాజిక ఉద్యమకారుడు ఆభ మురళిధరన్ సుప్రీంలో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలోనే ఆయన ఈ పిటిషన్ వేయడం గమనార్హం.
1951 చట్టంలోని సెక్షన్ 8లోని సబ్ క్లాజ్ (1) ప్రకారం.. ఎంపీల అనర్హత కోసం నేరాల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా నేరాలను వర్గీకరించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక సెక్షన్‌లోని సబ్ క్లాసులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయనే విషయాన్ని గమనించాలని ఆయన బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే గురువారం ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్థీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది. కానీ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్‌తో మీకు సంబంధం లేదు కదా. ఇది మీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది?. మీకు శిక్ష పడినప్పుడు.. మీపై అనర్హత వేటు పడినప్పుడు అప్పుడు మా దగ్గరకు రండి. ఇప్పుడు మాత్రం పిటిషన్‌ను వెనక్కి తీసుకోండి.. లేదంటే మేమే డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసుల్లో బాధిత వ్యక్తి పిటిషన్‌లను మాత్రమే మేం వింటాం అని బెంచ్ సున్నితంగా పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో మురళీధరన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
ఇదీ చదవండి: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరులతో అక్కడ అగ్గి
Comments
Please login to add a commentAdd a comment