
న్యూఢిల్లీ: మదర్సన్ సుమీ వైరింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ.123 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.126 కోట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.1,671 కోట్ల నుంచి రూ.1,859 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘కంపెనీ క్రమం తప్పకుండా స్థిరమైన పనితీరును చూపిస్తోంది.
గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఏర్పాటు చేసిన అదనపు తయారీ సామర్థ్యాలు ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలవడం మొదలైంది’’అని మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా చైర్మన్ వివేక్ చాంద్ సెహ్‌గల్ తెలిపారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నిర్వహణ పనితీరు మెరుగుపరుచుకోవడం సాయపడినట్టు చెప్పారు. వ్యయాలు తగ్గించుకునేందుకు తాము తీసుకున్న చర్యలకు తోడు, కస్టమర్ల మద్దతుతో తమ భాగస్వాములకు రానున్న త్రైమాసికాల్లోనూ విలువను జోడిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 2 శాతం తగ్గి రూ.59 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment