హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రిటైల్‌లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్‌లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి.
అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది.
త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం.
నవరాత్రి కొత్త రికార్డు..
2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి.
ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్‌లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్‌యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్‌ఏడీఏ తెలిపింది.
విభిన్న పరిస్థితులు..
స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్‌ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్‌ని పెంచుతున్నాయని ఎఫ్‌ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్‌లను పెంచవచ్చు.
అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment