Two-Wheeler Sales
-
ఆటో పరిశ్రమకు టూవీలర్ల బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రిటైల్‌లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్‌లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి. అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది. త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం. నవరాత్రి కొత్త రికార్డు.. 2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్‌లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్‌యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. విభిన్న పరిస్థితులు.. స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్‌ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్‌ని పెంచుతున్నాయని ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్‌లను పెంచవచ్చు. అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది. -
హీరో లాభం రూ.721 కోట్లు
న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.721 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.41 శాతం పెరిగింది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.8,118 కోట్లుగా ఉంది. 12.40 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. వ్యయాలు రూ.7,217 కోట్ల నుంచి రూ.7,373 కోట్లకు చేరాయి. ‘‘మా మార్కెట్ వాటా కాస్తంత కోలుకుంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో మార్కెట్ వాటా పెంచుకుంటామని అంచనా వేస్తున్నాం’’అని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘విదా’ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు చేరువ చేస్తామన్నారు. -
11% తగ్గిన పండుగ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ–వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్ అశీష్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల కొరత తీవ్రంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం.. వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు. వాహన విక్రయాలకు ఎన్బీఎఫ్సీలు కీలకమని, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం.., ∙రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా గణిస్తారు. టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఈ సెగ్మెంట్లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన నిల్వలు డీలర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది పండుగల సీజన్లో 23,01,986గా ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది పండుగల సీజన్లో 20,49,391కు పడిపోయాయి. ఇక ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 3,33,456 నుంచి 2,87, 717కు తగ్గాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 18,11,703 నుంచి 13 % తగ్గి 15,83,276కు పడిపోయాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వాహన రిటైల్ అమ్మకాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకూ 1,12,54,305గా ఉన్న వాహన రిటైల్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 7 శాతం పెరిగి 1,19,89,705కు పెరిగాయి. -
టూ-వీలర్స్‌కు డిసెంబర్‌లోనూ బ్రేకులు
పెద్ద నోట్ల రద్దయి దాదాపు రెండు నెలలు గడిచినా టూ-వీలర్ విక్రయాలు మాత్రం కోలుకోవడం లేదు. నగదుతో ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంత మార్కెట్ నుంచి వీటికి డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో మోటార్ సైకిల్స్ దిగ్గజాలు హీరో మోటోకార్పొ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారో కో కంపెనీలకు డిసెంబర్ నెలలో కూడా విక్రయాలు మందగించాయి. దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీదారి హీరో మోటోకార్పొ లిమిటెడ్ 2016 డిసెంబర్ నెల విక్రయాలు 33.91 శాతం పడిపోయి, 3,30,202 యూనిట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాది ఈ కంపెనీ విక్రయాలు 4,99,665 యూనిట్లగా ఉన్నాయి. హీరో మోటోకార్పొ ప్రత్యర్థి బజాజ్ ఆటోకు సైతం దేశీయ బైక్ అమ్మకాలు 11 శాతం క్షీణించి, 1,06,665 యూనిట్లగా నమోదయ్యాయి. వీటితో పాటు చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ టూ-వీలర్ విక్రయాలు కూడా దేశీయంగా 8.76 శాతం పడిపోయినట్టు ఆ కంపెనీ పేర్కొంది. డిసెంబర్ నెల సమీక్షలో తమ విక్రయాలు 1,53,413 యూనిట్లగా రికార్డు అయినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ చెప్పింది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోనే ఆటోమొబైల్ విక్రయాలు పతనమయ్యాయని, ఈ సమయంలో వాహన కొనుగోళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నిందని ఆటో పరిశ్రమ నిపుణుడు అబ్దుల్ మజీద్ తెలిపారు. గ్రామీణ మార్కెట్ నుంచి 50 శాతం మోటార్ సైకిల్ విక్రయాలు నమోదైతాయని పరిశ్రమ అంచనావేస్తోంది. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ సైతం నవంబర్‌లో టూవీలర్ అమ్మకాలు గతేడాది కంటే పడిపోయినట్టు చెప్పింది. గతేడాది డిసెంబర్ నెలలో 13,20,552 యూనిట్లగా ఉన్న టూ-వీలర్ విక్రయాలు ఈ ఏడాది డిసెంబర్లో 12,43,251 యూనిట్లగా ఉన్నట్టు పేర్కొంది. నోట్ల రద్దుపై ప్రకటన వచ్చిన అనంతరం నవంబర్ నెలలో విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు ప్రభావం ఆటో పరిశ్రమపై భారీగానే ఎఫెక్ట్ చూపింది. ఈ దెబ్బనుంచి కోలుకోవడానికి ఇంకా రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశముందని టూ-వీలర్ పరిశ్రమ భావిస్తోంది.