టూ-వీలర్స్కు డిసెంబర్లోనూ బ్రేకులు
టూ-వీలర్స్కు డిసెంబర్లోనూ బ్రేకులు
Published Sat, Jan 7 2017 3:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
పెద్ద నోట్ల రద్దయి దాదాపు రెండు నెలలు గడిచినా టూ-వీలర్ విక్రయాలు మాత్రం కోలుకోవడం లేదు. నగదుతో ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంత మార్కెట్ నుంచి వీటికి డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో మోటార్ సైకిల్స్ దిగ్గజాలు హీరో మోటోకార్పొ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారో కో కంపెనీలకు డిసెంబర్ నెలలో కూడా విక్రయాలు మందగించాయి. దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీదారి హీరో మోటోకార్పొ లిమిటెడ్ 2016 డిసెంబర్ నెల విక్రయాలు 33.91 శాతం పడిపోయి, 3,30,202 యూనిట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాది ఈ కంపెనీ విక్రయాలు 4,99,665 యూనిట్లగా ఉన్నాయి. హీరో మోటోకార్పొ ప్రత్యర్థి బజాజ్ ఆటోకు సైతం దేశీయ బైక్ అమ్మకాలు 11 శాతం క్షీణించి, 1,06,665 యూనిట్లగా నమోదయ్యాయి.
వీటితో పాటు చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ టూ-వీలర్ విక్రయాలు కూడా దేశీయంగా 8.76 శాతం పడిపోయినట్టు ఆ కంపెనీ పేర్కొంది. డిసెంబర్ నెల సమీక్షలో తమ విక్రయాలు 1,53,413 యూనిట్లగా రికార్డు అయినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ చెప్పింది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోనే ఆటోమొబైల్ విక్రయాలు పతనమయ్యాయని, ఈ సమయంలో వాహన కొనుగోళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నిందని ఆటో పరిశ్రమ నిపుణుడు అబ్దుల్ మజీద్ తెలిపారు. గ్రామీణ మార్కెట్ నుంచి 50 శాతం మోటార్ సైకిల్ విక్రయాలు నమోదైతాయని పరిశ్రమ అంచనావేస్తోంది.
ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ సైతం నవంబర్లో టూవీలర్ అమ్మకాలు గతేడాది కంటే పడిపోయినట్టు చెప్పింది. గతేడాది డిసెంబర్ నెలలో 13,20,552 యూనిట్లగా ఉన్న టూ-వీలర్ విక్రయాలు ఈ ఏడాది డిసెంబర్లో 12,43,251 యూనిట్లగా ఉన్నట్టు పేర్కొంది. నోట్ల రద్దుపై ప్రకటన వచ్చిన అనంతరం నవంబర్ నెలలో విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు ప్రభావం ఆటో పరిశ్రమపై భారీగానే ఎఫెక్ట్ చూపింది. ఈ దెబ్బనుంచి కోలుకోవడానికి ఇంకా రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశముందని టూ-వీలర్ పరిశ్రమ భావిస్తోంది.
Advertisement