స్వల్పంగా పెరిగిన హీరో అమ్మకాలు
న్యూఢిల్లీ/చెన్నై: హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 5,01,271 వాహనాలు విక్రయించామని, ప్రస్తుతం 5,04,181 వాహనాలు అమ్మామని కంపెనీ పేర్కొంది. త్వరలో ప్లెజర్, ఎక్స్‌ట్రీమ్, కరిజ్మా, జడ్‌ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్‌లను అందించనున్నట్లు తెలిపింది.
బజాజ్ ఆటో: మరో వాహన కంపెనీ బజాజ్ ఆటో మోటార్ బైక్‌ల విక్రయాలు ఫిబ్రవరిలో 6% తగ్గాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 2,91,297 మోటార్ బైక్‌లను విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 2,73,323 మోటార్‌బైక్‌లను అమ్మామని కంపెనీ పేర్కొంది. వాణిజ్య వాహనాలతో సహా మొత్తం అమ్మకాలు 3,32,387 నుంచి 3,13,294కు క్షీణించాయని వివరించింది. ఎగుమతులు మాత్రం 1,35,149 నుంచి 5% వృద్ధితో 1,35,149కు పెరిగాయని పేర్కొంది.
అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ ఫిబ్రవరి అమ్మకాలు 21 శాతం క్షీణించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 10,046 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 7.915 వాహనాలు అమ్మామని కంపెనీ తెలిపింది. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 7,045 నుంచి 21 శాతం క్షీణించి 5,576కు, తేలిక రకం వాణిజ్య వాహనాలు 3,001 నుంచి 2,339కు తగ్గాయని పేర్కొంది. ఇక 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ మొత్తం 79,056 వాహనాలను విక్రయించామని వివరించింది. 2012 ఏప్రిల్ నుంచి 2013 ఫిబ్రవరి అమ్మకాలు(1,00,592)తో పోల్చితే అమ్మకాలు 21 శాతం పడిపోయాయని పేర్కొంది. అలాగే భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 70,000 నుంచి 52,624కు, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 30,592 నుంచి 26,432కు తగ్గాయని వివరించింది.