
దేశవ్యాప్తంగా జనవరిలో 7 శాతం వాహన రిటైల్ అమ్మకాలు అప్
రాష్ట్రంలో మాత్రం పది శాతం డౌన్
2024తో పోలిస్తే 70,815 నుంచి 64,149కు తగ్గిన సంఖ్య
ద్విచక్ర వాహన విక్రయాలు 7.19 శాతం డౌన్
గత ఏడాది ఇదే నెల 14 శాతానికి పైగా అప్
మిగిలిన అన్ని విభాగాలదీ క్షీణ బాటే
సాక్షి, అమరావతి: సాంప్రదాయికంగా చూస్తే జనవరిలో రిటైల్ వాహన విక్రయాలు భారీగా ఉంటాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు ధమాకా సంగతి చెప్పనే అక్కర్లేదు. సంక్రాంతి నేపథ్యంలో ‘పెద్ద పండుగ కదా.. మీ మామగారు ఏమి బండి కొనిచ్చారు..?’ అని అడగడం ఇక్కడ సర్వసాధారణ అంశమన్న విషయం ప్రస్తావించాలి. అయితే 2025 జనవరిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడిస్తున్న గణాంకాలను పరిశీలిస్తే...
⇒ దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ అమ్మకాలు జనవరిలో పరుగులు పెడితే ఒక్క ఏపీ మాత్రమే తిరోగమన దిశలో పయనించింది.
⇒ గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ అమ్మకాలు 7.05% పెరిగితే, మన రాష్ట్రంలో మాత్రం 9.41% పడిపోయాయి.
⇒ తమిళనాడు (6.99 శాతం), మహారాష్ట్ర (13.44 శాతం), పంజాబ్ (16.77 శాతం), హరియాణా (17.15 శాతం), ఉత్తరప్రదేశ్ (8.15 శాతం)లలో వాహన అమ్మకాలు పెరిగితే మన రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.
⇒ దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల అమ్మకాలు గతేడాది జనవరిలో 21,56,605 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 23,08 ,728కి పెరిగింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 70,815 నుంచి 64,149కి పడిపోయింది.
డబ్బులు లేవు
మొత్తం ఆటోమొబైల్ అమ్మకాల్లో 70 శాతంపైగా వాటా కలిగి ఉండే ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోవడం మధ్య తరగతి, పేద ప్రజల వద్ద డబ్బు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి చిన్న ఉద్యోగి వరకు తొలుత కొనుగోలు చేసేది ద్విచక్రవాహనాలనే. ఒక రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయో అన్న విషయాన్ని పరిశీలించడానికి ద్విచక్ర వాహన అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా దెబ్బతిన్న ద్విచక్ర వాహన రంగం గడిచిన రెండేళ్లుగా వృద్ధిబాట పట్టింది.
అయితే తిరిగి 2025 తొలి నెలలోనే క్షీణ బాట పట్టడం గమనార్హం. జనవరి నెలలో దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన అమ్మకాలు 4.15% పెరిగితే, మన రాష్ట్రంలో మాత్రం 7.19% తగ్గాయి. గతేడాది 49,240గా ఉన్న ద్విచక్రవాహన అమ్మకాలు ఈ ఏడాది 45,697కు పడిపోయాయి. కోవిడ్ తర్వాత ద్విచక్ర వాహన అమ్మకాలు తగ్గడం కేవలం మన రాష్ట్రంలోనే చూస్తున్నామంటూ ఆటో డీలర్లు వాపోతున్నారు. గత ఏడాది జనవరిలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 14.38 వృద్ధి నమోదయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
పడిపోయిన కొనుగోలు శక్తి
కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత గడచిన ఏడు నెలల్లో ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. వస్తు సేవల పన్ను ఆదాయం పతనం (జీఎస్‌టీ) దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రతీ నెలా ఈ వసూళ్లు రాష్ట్రంలో పడిపోతున్నాయి.
‘నిర్మాణ’ పటిష్టత ఎక్కడ
ఉచిత ఇసుకతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పరుగులు తీస్తోందంటూ కూటమి సర్కారు ప్రచారంలో నిజం లేదనడానికి నిర్మాణ రంగ వాహన అమ్మకాలు నిలువుటద్దంగా మారాయి. గతేడాది జనవరి నెలలో నిర్మాణ రంగానికి చెందిన 168 వాహనాల అమ్మకాలు జరిగితే, అది ఈ ఏడాది 144కు పరిమితం అయ్యింది. అదే విధంగా గూడ్స్ క్యారియర్స్ అమ్మకాలు 23,898 నుంచి 2,054కు, ఆటో అమ్మకాలు 2,324నుంచి 2,054కు పడిపోయాయి. ఇవన్నీ రాష్ట్రంలో వాణిజ్య కార్యక్రమాలు నెమ్మదించాయని స్పష్టం చేస్తున్నాయి.
అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేశారు...
గడిచిన ఏడు నెలలుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, సంక్షేమ పథకాలు ఆపేయడం, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలు ఆటోమొబైల్ అమ్మకాలపై గణనీయంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment