మూడు నెలల క్షీణత నుంచి
కోలుకున్న సేవలు: నికాయ్
న్యూఢిల్లీ: మూడు నెలల నుంచీ అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో ఉన్న సేవల రంగం తిరిగి ఫిబ్రవరిలో కోలుకుంది. డీమోనిటైజేషన్ అనంతరం మూడు నెలలు క్షీణతలో ఉన్న సేవల రంగం నికాయ్ ఇండియా (పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్– పీఎంఐ) సూచీ ఫిబ్రవరిలో 50.3 పాయింట్లకు చేరింది. జనవరిలో ఇది 48.7 పాయింట్ల వద్ద ఉంది.
నికాయ్ సూచీ పాయింట్లు 50 పాయింట్లపైన ఉంటే, దానిని పురోగతిగా ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. కాగా ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిగానే ఉందని, వ్యాపార విశ్వాసం ఇంకా పుంజుకోవాల్సి ఉందనీ నికాయ్ సర్వే ఒకటి తెలిపింది.
సేవలు – తయారీ కలిపితే...
కాగా స్థూల దేశీయోత్పత్తి దాదాపు 70 శాతం వాటా ఉన్న సేవలు (దాదాపు 55 శాతం), తయారీ (దాదాపు 15 శాతం) రంగాలు కలిపి చూస్తే– నికాయ్ సూచీ ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉంది. జనవరిలో ఇది క్షీణతలో 49.4 శాతంగా ఉంది.