nikkei
-
మూడు నెలల క్షీణత నుంచి
కోలుకున్న సేవలు: నికాయ్ న్యూఢిల్లీ: మూడు నెలల నుంచీ అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో ఉన్న సేవల రంగం తిరిగి ఫిబ్రవరిలో కోలుకుంది. డీమోనిటైజేషన్ అనంతరం మూడు నెలలు క్షీణతలో ఉన్న సేవల రంగం నికాయ్ ఇండియా (పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్– పీఎంఐ) సూచీ ఫిబ్రవరిలో 50.3 పాయింట్లకు చేరింది. జనవరిలో ఇది 48.7 పాయింట్ల వద్ద ఉంది. నికాయ్ సూచీ పాయింట్లు 50 పాయింట్లపైన ఉంటే, దానిని పురోగతిగా ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. కాగా ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిగానే ఉందని, వ్యాపార విశ్వాసం ఇంకా పుంజుకోవాల్సి ఉందనీ నికాయ్ సర్వే ఒకటి తెలిపింది. సేవలు – తయారీ కలిపితే... కాగా స్థూల దేశీయోత్పత్తి దాదాపు 70 శాతం వాటా ఉన్న సేవలు (దాదాపు 55 శాతం), తయారీ (దాదాపు 15 శాతం) రంగాలు కలిపి చూస్తే– నికాయ్ సూచీ ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉంది. జనవరిలో ఇది క్షీణతలో 49.4 శాతంగా ఉంది. -
జూన్‌లో సేవల రంగం పేలవం: నికాయ్ పీఎంఐ
న్యూఢిల్లీ: దేశీ సేవల రంగం జూన్ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు నెలల నుంచీ ప్రతికూలంగా ఉన్న ఈ రంగం తాజా సమీక్ష నెలలో ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు లేకపోవడం ఈ రంగం మందగమనానికి కారణంగా నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పేర్కొంది. సూచీ మేలో 51 పాయింట్ల వద్ద ఉంటే, జూన్‌లో 50.3 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు సేవలు, తయారీ రంగాల పనితీరును సూచించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మేలో 50.9 పాయింట్ల వద్ద ఉండగా, జూన్‌లో ఇది 51.1 పాయింట్లకు పెరిగింది. కాగా, ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
యాపిల్ ఐఫోన్లకు కష్టకాలమే..
ఐఫోన్లకు డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో యాపిల్ సంస్థకు కష్టకాలం ఏర్పడింది. అమ్మకాలు తక్కువగా నమోదు అవుతుండటంతో, ఐఫోన్ ఉత్పత్తుల తయారీని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎస్ఈని కూడా యాపిల్ కు ఇప్పట్లో ఆవిష్కరించే ఉద్దేశాలు లేనట్లు నిక్కీ బిజినెస్ డైలీ తెలిపింది. అమ్మకాలు తగ్గిపోతుండడంతో ప్రస్తుతం యాపిల్ కంపెనీ షేర్లు 1.8 శాతానికి పడిపోయి 110.05 డాలర్లుగా నమోదవుతున్నాయి. 2013లో కూడా యాపిల్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తక్కువ ధరలకు ఐఫోన్ 5సీ మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని నెలలకి దాన్ని ఉత్పత్తుల తయారీని తగ్గించింది. ఇప్పటికే జపాన్, ఇతర ప్రాంతాల్లో ఈ త్రైమాసికంలో ఉత్పత్తులు తగ్గిస్తామని కంపెనీ తెలిపినట్టు నిక్కీ నివేదిక పేర్కొంది. చివరి త్రైమాసికం మార్చిలో రాబడులు తగ్గుతాయని యాపిల్ జనవరిలోనే ప్రకటించింది. 13 ఏళ్లలో రాబడులు తగ్గుతాయని యాపిల్ ప్రకటించడం అదే మొదటిసారి. మందగమన చైనా మార్కెట్లో బలహీనపడే సంకేతాలు రావడమే ఈ రాబడులు పడిపోవడానికి కారణమని యాపిల్ పేర్కొంది. ఈ క్రమంలోనే అతి పెద్ద టెక్నాలజీగా పేరున్న యాపిల్ మార్చి త్రైమాసికంలో ఐపోన్ 6ఎస్, ఐపోన్ 6ఎస్ ప్లస్ మోడళ్లను 30శాతం తగ్గించాలనుకుంది. కానీ ఉత్పత్తుల తయారీ సాధారణ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఐపోన్లు ఎదుర్కొంటున్న కష్టకాలంలో జూన్ త్రైమాసికం చివరి వరకు యాపిల్ ఉత్పత్తులను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. -
చౌక చమురు భారత్ కు వరం
ఐఎంఎఫ్ విశ్లేషణ.. వాషింగ్టన్: తక్కువ స్థాయిలో ఉన్న ముడి చమురు ధరలే భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ పేర్కొంది. గడచిన 18 నెలల కాలంలో క్రూడ్ ధర దాదాపు 70 శాతం పడి ప్రస్తుతం దాదాపు 35 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో.... ఐఎంఎఫ్ భారత్ వ్యవహారాల బృందం చీఫ్ పౌల్ క్యాషిన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చేసిన విశ్లేషణలో పలు కీలక అంశాలను పరిశీలిస్తే... ♦ వస్తువులు, సేవలపై వినియోగదారులు మరింత ఖర్చుచేయడానికి క్రూడ్ తక్కువ స్థాయి ధరలు దోహదపడతాయి. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, విదేశీ వాణిజ్య సమతౌల్య నిర్వహణకు సైతం ఇది లాభించే అంశం. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం 7.5 శాతానికి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశీయ వృద్ధి పటిష్టతకు అంతర్గత డిమాండ్ ప్రధాన కారణం. ♦ పెట్టుబడుల పరిస్థితి ఇంకా ఊపందుకోవాలి. ♦ మొండిబకాయిల సమస్య బ్యాంకింగ్ రంగంపై పెను భారాన్ని మోపుతోంది. ♦ అంతర్జాతీయ మందగమనం భారత్ విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. కఠిన పరపతి విధానం కొనసాగించాలి.... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన పరపతి విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని తన స్టాఫ్ రిపోర్ట్‌లో ఐఎంఎఫ్ పేర్కొంది. ద్రవ్యలోటుకు సంబంధించి ప్రభుత్వం గాడితప్పదని తాజా జైట్లీ బడ్జెట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో... రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత త్వరలో ఉంటుందని వస్తున్న పలు అంచనాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ సూచన చేయడం గమనార్హం. సమీప కాలానికి సంబంధించి ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడానికి కఠిన పాలసీ విధానమే అవసరమని నివేదిక అభిప్రాయపడింది. గృహ వినియోగానికి సంబంధించి నిజానికి ఇప్పటికీ ద్రవ్యోల్బణం కొంత ఎక్కువగానే ఉందని అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి సరఫరాల సమస్యనూ తొలగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఏప్రిల్ 5న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఆలోపే రెపో రేటు పావు శాతం తగ్గుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సేవల రంగం పేలవం: నికాయ్ న్యూఢిల్లీ: నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 3 నెలల కనిష్ట స్థాయికి పడింది. జనవరిలో 54.3 పాయింట్ల వద్ద ఉన్న ఈ సూచీ, ఫిబ్రవరిలో 51.4 పాయింట్లకు పడిపోయింది. డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి కారణమని సర్వేను రూపొందించిన మార్కిట్సంస్థ ఎకనమిస్ట్ పాలెయానా డీ లీమా తెలిపారు. కాగా తయారీ-సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన సూచీ జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్ల వద్ద ఉంటే... ఇది ఫిబ్రవరిలో 51.2 పాయింట్లకు తగ్గింది. ఏప్రిల్ 5న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ నిరాశాకర ఫలితం వెలువడ్డం గమనార్హం. అయితే సూచీ 50 పాయింట్ల దిగువకు పడిపోతేనే దానిని క్షీణ దశగా భావిస్తారు.