చౌక చమురు భారత్ కు వరం
ఐఎంఎఫ్ విశ్లేషణ..
వాషింగ్టన్: తక్కువ స్థాయిలో ఉన్న ముడి చమురు ధరలే భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ పేర్కొంది. గడచిన 18 నెలల కాలంలో క్రూడ్ ధర దాదాపు 70 శాతం పడి ప్రస్తుతం దాదాపు 35 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో.... ఐఎంఎఫ్ భారత్ వ్యవహారాల బృందం చీఫ్ పౌల్ క్యాషిన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చేసిన విశ్లేషణలో పలు కీలక అంశాలను పరిశీలిస్తే...
♦ వస్తువులు, సేవలపై వినియోగదారులు మరింత ఖర్చుచేయడానికి క్రూడ్ తక్కువ స్థాయి ధరలు దోహదపడతాయి. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, విదేశీ వాణిజ్య సమతౌల్య నిర్వహణకు సైతం ఇది లాభించే అంశం.
♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం 7.5 శాతానికి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశీయ వృద్ధి పటిష్టతకు అంతర్గత డిమాండ్ ప్రధాన కారణం.
♦ పెట్టుబడుల పరిస్థితి ఇంకా ఊపందుకోవాలి.
♦ మొండిబకాయిల సమస్య బ్యాంకింగ్ రంగంపై పెను భారాన్ని మోపుతోంది.
♦ అంతర్జాతీయ మందగమనం భారత్ విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
కఠిన పరపతి విధానం కొనసాగించాలి....
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన పరపతి విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని తన స్టాఫ్ రిపోర్ట్‌లో ఐఎంఎఫ్ పేర్కొంది. ద్రవ్యలోటుకు సంబంధించి ప్రభుత్వం గాడితప్పదని తాజా జైట్లీ బడ్జెట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో... రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత త్వరలో ఉంటుందని వస్తున్న పలు అంచనాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ సూచన చేయడం గమనార్హం. సమీప కాలానికి సంబంధించి ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడానికి కఠిన పాలసీ విధానమే అవసరమని నివేదిక అభిప్రాయపడింది. గృహ వినియోగానికి సంబంధించి నిజానికి ఇప్పటికీ ద్రవ్యోల్బణం కొంత ఎక్కువగానే ఉందని అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి సరఫరాల సమస్యనూ తొలగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఆలోపే రెపో రేటు పావు శాతం తగ్గుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
సేవల రంగం పేలవం: నికాయ్
న్యూఢిల్లీ: నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 3 నెలల కనిష్ట స్థాయికి పడింది. జనవరిలో 54.3 పాయింట్ల వద్ద ఉన్న ఈ సూచీ, ఫిబ్రవరిలో 51.4 పాయింట్లకు పడిపోయింది. డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి కారణమని సర్వేను రూపొందించిన మార్కిట్‌సంస్థ ఎకనమిస్ట్ పాలెయానా డీ లీమా తెలిపారు. కాగా తయారీ-సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన సూచీ జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్ల వద్ద ఉంటే... ఇది ఫిబ్రవరిలో 51.2 పాయింట్లకు తగ్గింది. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ నిరాశాకర ఫలితం వెలువడ్డం గమనార్హం. అయితే సూచీ 50 పాయింట్ల దిగువకు పడిపోతేనే దానిని క్షీణ దశగా భావిస్తారు.