కీలక రంగాల వృద్ధి 0.9 శాతం
డిసెంబర్ గణాంకాల విడుదల
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ 2015 డిసెంబర్‌లో కేవలం 0.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.2 శాతం. అయితే 2015 నవంబర్‌లో అసలు ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత (ఎనిమిది నెలల కనిష్టం, -1.3 శాతం క్షీణత) నమోదయ్యింది. ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఉన్నాయి.
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, స్టీల్ రంగాల పేలవ పనితీరు మొత్తం గ్రూప్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఎరువుల రంగం మంచి పనితీరును కనబరిచింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
తొమ్మిది నెలల్లో...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. 2014 ఇదే తొమ్మిది నెలల కాలంలో ఈ రేటు 5.7 శాతం.